
బంగారం ధరలు ఆగకుండా దూసుకెళ్తున్నాయి. రోజుకో కొత్త రేటుకు చేరుతున్నాయి. ధనత్రయోదశి, దీపావళి (Diwali) రోజుల్లో కాస్త తగ్గినట్లే అనిపించినా మళ్లీ ఎగిశాయి. ఈ క్రమంలో దీపావళి తర్వాత బంగారం ధరలు ఏమైనా తగ్గే అవకాశం ఉందా అని చాలామంది కొనుగోలుదారులు ఎదురు చూస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇప్పట్లో లేదని తెలుస్తోంది.
హెచ్ఎస్‌బీసీ అంచనా
అంతర్జాతయ బ్యాంకు అయిన హెచ్ఎస్‌బీసీ (HSBC) తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. బంగారం ధరలు (Gold Price) ఇప్పట్లో మందగించే అవకాశం లేదని సూచించింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఇప్పటికే ఔన్స్ కు 4,300 డాలర్లు దాటింది. అక్టోబర్ 18న ఇది ఔన్స్ కు 4,362 ట్రేడ్ అవుతోంది. ఇది స్థిరమైన బుల్లిష్ సెంటిమెంట్‌ను సూచిస్తుంది.
పండుగ రద్దీ తర్వాత కూడా బంగారం తన వేగాన్ని కొనసాగిస్తుందని హెచ్ఎస్‌బీసీ భావిస్తోంది. 2026 ప్రథమార్థం నాటికి బంగారం ఔన్స్ కు 5,000 డాలర్లకు పెరుగుతుందని అంచనా వేస్తోంది.
అంతకుముందు, హెచ్‌ఎస్‌బీసీ 2025లో ఔన్స్ కు సగటు బంగారం ధర 3,355 డాలర్లుగా అంచనా వేసింది. దాన్ని ఇప్పుడు 3,455 డాలర్లకు సవరించింది. 2026 కోసం అంచనా ఔన్సుకు 3,950 డాలర్ల నుండి 4,600 డాలర్లకు పెంచేసింది. రాయిటర్స్ కూడా ఇవే అంచనాలను
ఉదహరించింది.
బంగారం ధరల పెరుగుదలకు కారణాలు
బంగారం ధరల పెరుగుదలకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు తమ బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయని, గోల్డ్ బ్యాక్డ్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) లో పెట్టుబడులు పెరుగుతున్నాయని, అమెరికా వడ్డీ రేట్ల తగ్గింపు అంచనాలు బలపడుతున్నాయని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక తెలిపింది. ప్రపంచ వాణిజ్య వివాదాలతో ముడిపడి ఉన్న అనిశ్చితులకు లోనుకాని, సురక్షిత-స్వర్గధామ ఆస్తిగా బంగారం కొనుగోలుదారును ఆకర్షిస్తూనే ఉంది.
ఇటీవల స్పాట్ గోల్డ్ వారం రోజుల్లోనే అమాంతం ఎగిసింది. ఇది ఔన్స్ కు 4,300 డాలర్లకు పెరిగింది. 2008 డిసెంబర్ నుండి ఇది వేగవంతమైన వారపు లాభాలలో ఒకటిగా నిలిచింది. ఈ క్రమంలో 2026 ప్రారంభం వరకు పసిడి ధరలు పెరిగే అవకాశం ఉందని హెచ్‌ఎస్‌బీసీ నమ్ముతోంది. అయితే ఆ సంవత్సరం చివర్లో మాత్రం కొంత కరెక్షన్ జరగొచ్చని భావిస్తోంది.
ఇతర బ్యాంకులదీ అదే అంచనా
బంగారం ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని, మరింత పెరుగుతాయని ఒక్క హెచ్ఎస్‌బీసీ మాత్రమే కాదు.. కొన్ని ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ భావిస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ అమెరికా, సొసైటీ జనరల్ కూడా రాబోయే సంవత్సరానికి బంగారం ధర ఔన్సుకు 5,000 డాలర్లను చేరుతుందని అంచనా వేశాయి. 2026 జూన్ నాటికి బంగారం ధర 4,600 డాలర్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని ఏఎన్‌జెడ్ బ్యాంక్ అంచనా వేసింది.
ఇదీ చదవండి: వారెన్ బఫెట్ చెప్పిన సక్సెస్ సీక్రెట్..