
హైదరాబాద్ నగరంలోని వీ హబ్ వేదికగా నిర్వహించిన వినూత్న కార్యక్రమం ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంప్రదాయం, సృజనాత్మకత, మహిళా వ్యవస్థాపకత– ఆవిష్కరణలను ప్రదర్శించడానికి వీ హబ్ ఆధ్వర్యంలో శ్రావణం స్పెషల్‌గా ‘ఇంపాక్ట్ ఫెయిర్–మినీ ఎడిషన్’ను నిర్వహించింది. మహిళా వ్యవస్థాపకులకు విలువైన అమ్మకాల అవకాశాలు, ప్రత్యక్ష మార్కెట్ లింకేజీలను అందించడం లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులకు తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించింది.
రాష్ట్రంలోని అనేక జిల్లాల నుంచి దాదాపు 30 మంది మహిళా వ్యవస్థాపకులు, స్థానిక చేతివృత్తుల వారు ఒకచోట చేరి వారి కళాత్మక, సృజనాత్మక ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో భాగంగా అద్భుతమైన చేనేత, హస్తకళలు, పండుగ దుస్తులు, నగలు, ప్రామాణికమైన తెలంగాణ ఆహారాలు, స్నాక్స్–స్వీట్లు, గృహాలంకరణ వస్తువులను ఇక్కడ ఉంచారు.
వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల మాట్లాడుతూ.. ఇది ఒక ప్రదర్శన మాత్రమే కాదు.. ఇది మహిళల సంస్థ, మహిళా శక్తి. ఈ సంస్కృతి సమాజ స్ఫూర్తికి ఒక వేడుక అని తెలిపారు. ప్రతి మహిళా వ్యవస్థాపకురాలు తన నేపథ్యం లేదా స్థానంతో సంబంధం లేకుండా ఈ కమర్షియల్ మార్కెట్లకు ప్రాప్యత పొందేలా చూసుకోవడమే తమ లక్ష్యమన్నారు.
(చదవండి: Independence Day 2025: ఎర్రకోటలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వీక్షించాలనుకుంటే..!)