
ప్రతీ నియోజకవర్గంలో మైక్రో ఇండస్ట్రీస్
అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపడతాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
మంచిర్యాల జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పాల్గొన్న శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి
దండేపల్లి/జన్నారం/మంచిర్యాల రూరల్ (హాజీపూర్)/ లక్సెట్టిపేట: మహిళా సాధికారతకు ప్రజా ప్రభుత్వం కట్టుబ డి ఉందని, రాష్ట్రంలోని ప్రతీ నియోజక వర్గంలో మహిళల కోసం మైక్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి, వారు వ్యాపారాలు చేసుకునేలా కార్యక్రమాలు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో మంత్రులు శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వులతో కలసి భట్టి విక్రమార్క పర్యటించారు. లక్సెట్టిపేట లో నూతనంగా నిర్మించిన 50 పడకల సామాజిక ఆస్పత్రి, కళాశాల భవనాన్ని ప్రారంభించారు.
దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్కు, ఐటీ పార్కుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాలో సగభాగమైన మహిళలకు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలు అందించగా, బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీ లేని రుణాల పథకాన్ని పునరుద్ధరించినట్లు తెలిపారు.
‘కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని ప్రకటించినప్పుడు కొందరు అవహేళన చేశారు. కానీ మొదటి సంవత్సరంలోనే రూ.21,600 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్టులు కేటాయించి, ఆర్థిక స్వావలంబనకు మార్గం సుగమం చేస్తున్నాం. మహిళా సంఘాలకు రుణ సౌకర్యం కల్పించి, బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకు ఇప్పిస్తున్నాం. క్యాంటీన్లు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారాల కోసం మహిళా సంఘాలకు స్థలాలు కేటాయించాం’అని భట్టి చెప్పారు.
సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు
ఇందిరమ్మ ఇళ్ల పథకంలో 4.50 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని రూ.22,500 కోట్లతో మొదలుపెట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. సంక్షేమ పథకాల కోసం రూ.55 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అటవీ అధికారులతో ఇబ్బందులు ఎదుర్కొన్న గిరిజనుల కోసం ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం ప్రవేశపెట్టినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు.
ఈ పథకం కింద ఉచిత సోలార్ పంప్‌సెట్లు, స్ప్రింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్, అవకాడో, వెదురు మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి చేపడతామని డిప్యూటీ సీఎం ప్రకటించారు. ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామ న్నారు. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రివర్గం దృష్టి సారించిందని తెలిపారు.
మంచిర్యాలలో ఐటీ, ఇండస్ట్రియల్ పార్కు
మంచిర్యాలలో 212 ఎకరాల్లో దత్తసాయి ఇండస్ట్రియల్, ఐటీ, ఆటోనగర్ పార్కు ఏర్పాటుకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శంకుస్థాపన చేశారు. మొత్తం 300 ఎకరాల్లో ఈ పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా రూ.30 కోట్లు కేటాయించామని, ఈ ప్రాజె క్టు ద్వారా 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.