
పోలింగ్ కేంద్రం పక్క గ్రామంలోకి మార్చడంపై నల్లగొండువారిపల్లి గ్రామస్తుల ఆగ్రహం (ఫైల్)
పోలింగ్ కేంద్రాల మార్పుపై గ్రామస్తుల ఆగ్రహం
కలెక్టర్, ఎస్పీ తీరు సరికాదని మండిపాటు
ఓటమి భయంతోనే టీడీపీ కూటమి కుట్రలని ఆరోపణ
పులివెందుల/వేంపల్లె: వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల మండలం జెడ్పీటీసీ ఉపఎన్నికలో భాగంగా నల్లగొండువారిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని పక్క గ్రామంలోకి మార్చడంపై ఆ గ్రామస్తులు రగిలిపోతున్నారు. పులివెందుల మండల జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి నల్లగొండువారిపల్లిలో 632 ఓట్లు ఉన్నాయి. గత పదేళ్లుగా ఈ గ్రామంలో పోలింగ్ బూత్ ఉండేది. స్థానికులంతా అక్కడే ఓటు హక్కు వినియోగించుకునే వారు.
కానీ, వీరంతా ఇప్పుడు నల్లపురెడ్డిపల్లిలో ఓటు వేయాల్సిన పరిస్థితి దాపురించింది. ఇదే పరిస్థితి ఎర్రబెల్లి ఓటర్లకు కూడా ఉత్పన్నౖమెంది. ఇక్కడి వారంతా నల్లపురెడ్డిపల్లికు వెళ్లి వేయాల్సిన దుస్థితి. నల్లపురెడ్డిపల్లి ఓటర్లు అటు నల్లగొండువారిపల్లి, ఇటు ఎర్రబెల్లి పోయి ఓటు వేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో.. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ తీరుపై నల్లగొండువారిపల్లి గ్రామ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఓడిపోతారనే భయంతోనే టీడీపీ కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. వారి ఆవేదన వారి మాటల్లోనే..
మా గ్రామంలోనే ఓటు వేసుకోనివ్వాలి
పోలింగ్ బూత్‌ను మా గ్రామంలో కాకుండా వేరే గ్రామానికి తరలించడం సరికాదు. అధికారులు అన్యాయం చేశారు. ఇప్పటికైనా మా గ్రామంలోనే మా ఓట్లు వేసుకునేలా చూడాలి. – విశ్వనాథ్, నల్లగొండువారిపల్లి
పోలింగ్ బూత్‌ను ఇక్కడే ఏర్పాటుచేయాలి
నాకు 72 ఏళ్లు. ఎన్నో ఏళ్లుగా మా ఊరిలోనే ఓటు హక్కు వినియోగించుకుంటున్నాను. అలాంటిది.. ఇప్పుడెందుకు మార్పు చేస్తున్నారో అర్ధంకావడంలేదు. పోలింగ్ బూత్‌ను ఇక్కడే ఏర్పాటుచేయాలి. వేరే గ్రామానికి తరలించడం మంచిది కాదు. – మస్తాన్, నల్లగొండువారిపల్లి
20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా లేదు
గతంలో ఇలాంటి సంస్కృతి ఎప్పుడూలేదు. ఓటు వేయాలంటే నాలుగు కిలోమీటర్ల దూరంలోని పక్క గ్రామానికి వెళ్లాలి. 20 ఏళ్లుగా నేనెప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదు. – అర్జున్, నల్లగొండువారిపల్లి
ఓడిపోతారనే భయంతోనే
నల్లగొండువారిపల్లిలోనే పోలింగ్ బూత్‌ను ఏర్పాటుచేయాలి. ఉన్నట్లుండి బూత్‌ను తరలించడం మంచి పద్ధతి కాదు. ఓడిపోతారనే భయంతోనే కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. – నరసింహారెడ్డి, నల్లగొండువారిపల్లి
వేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు
మా ఊరి పోలింగ్ బూత్ ఓటర్లను నల్లపురెడ్డిపల్లెకు మార్చడం సరికాదు. ఎన్నో ఏళ్ల నుంచి మా ఊరి పోలింగ్ కేంద్రంలోనే మా ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు వేరే గ్రామానికి మార్చడం మంచి పద్ధతి కాదు. – ఆదినారాయణ, నల్లగొండువారిపల్లి
అక్కడకెళ్లి ఓటు వేయాలంటే ఇబ్బందే
నల్లపురెడ్డిపల్లికు వెళ్లి ఓట్లు వేయాలంటే ఇబ్బందులు పడాలి. మా ఊర్లోని ఓటర్లను నల్లపురెడ్డిపల్లి పోలింగ్ కేంద్రానికి మార్చడంవల్ల పోలింగ్ రోజు వ్యయ ప్రయాసలు అవుతాయి. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. – చెన్నకేశవరెడ్డి, నల్లగొండువారిపల్లి