
అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతున్న ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ శ్రీచరణి
ఇంగ్లండ్‌తో టి20ల్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం
భవిష్యత్తుపై భరోసా పెంచుతున్న వైనం
ప్రాక్టీస్ సెషన్‌కు అందరికంటే ముందు హాజరవడం... శిక్షణ ముగిసిన తర్వాత కూడా ‘ఇంకొక్క బాల్ వేస్తా’ అంటూ కొనసాగించడం... అనుకున్న స్థానంలో బంతి వేసేంత వరకు అలుపెరగకుండా సాధన సాగించడం... వెరసి ఆ అమ్మాయిని ప్రత్యేకంగా నిలిపాయి! ఏజ్ గ్రూప్ టోర్నీలంటే ఏంటో తెలియకుండా... అండర్–19 ఊసే లేకుండా... నేరుగా మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఆడే అవకాశం దక్కించుకున్న ఆ అమ్మాయి... ఆడింది రెండు మ్యాచ్‌లే అయినా తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంది. దీంతో జాతీయ జట్టు నుంచి పిలుపు రాగా... అక్కడ కూడా మెరుగైన ప్రదర్శనతో కట్టిపడేసింది.
భిన్నమైన పిచ్‌లపై మరింత ప్రభావం చూపగలదని ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేస్తే ఏకంగా ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఆడిన తొలి టి20 సిరీస్‌లో 10 వికెట్లతో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్ స్పిన్నర్ నల్లపురెడ్డి శ్రీ చరణిపై ప్రత్యేక కథనం...
సాక్షి క్రీడావిభాగం : టి20 ఫార్మాట్‌లో ఇంగ్లండ్‌పై చెప్పుకోదగ్గ రికార్డులేని భారత జట్టు... ఈ పర్యటనలో భాగంగా ఆడిన తొలి టి20లో ఘనవిజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నాటింగ్‌హామ్ వేదికగా జరిగిన తొలి టి20లో స్మృతి మంధాన సెంచరీతో చెలరేగడంతో భారత జట్టు భారీ స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్ చేతులెత్తేసింది. ‘శత’క్కొట్టిన స్మృతికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కగా... ఈ మ్యాచ్ ద్వారానే అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేసిన శ్రీచరణి 4 వికెట్లతో అదరగొట్టింది. అయితే మంధాన మెరుపుల ముందు శ్రీచరణి బౌలింగ్ వాడి వెలుగులోకి రాలేదు.
బ్రిస్టల్‌లో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ మొదట టీమిండియా మంచి స్కోరు చేయగా... ఛేదనలో ఇంగ్లండ్‌ను కట్టడి చేసిన ఘనత ఆంధ్ర ప్లేయర్‌దే. 4 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టడంతో ఆతిథ్య జట్టు విజయానికి దూరమైంది.మూడో మ్యాచ్‌లోనూ నిలకడ కొనసాగించిన శ్రీ చరణి మరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకుంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో టి20లోనూ మరో 2 వికెట్లు తీసింది. ఆఖరి పోరులో వికెట్ పడగొట్టలేకపోయినా... ఓవరాల్‌గా ఐదు మ్యాచ్‌ల్లో కలిపి 10 వికెట్లు తీసిన శ్రీచరణి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు కైవసం చేసుకుంది.
అనూహ్య అవకాశం...
ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ఆరంభానికి ముందు దీప్తి శర్మ, రాధ యాదవ్ వంటి సీనియర్ స్పిన్నర్లు జట్టులో ఉండటంతో శ్రీ చరణికి అసలు తుది జట్టులో చోటు దక్కుతుందా అనే అనుమానాలు రేకెత్తగా... సిరీస్ ముగిసే సమయానికి నైపుణ్యం గల బౌలర్ అనే స్థాయికి ఎదిగింది. వైఎస్‌ఆర్ కడప జిల్లాకు చెందిన శ్రీచరణి చిన్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా ప్రారంభించిన ఆట తనను అందలం ఎక్కిస్తుందని ఏ దశలోనూ ఊహించలేదు.
జాతీయ జట్టు తరఫున నిలకడగా రాణించడమే తన లక్ష్యమని 20 ఏళ్ల శ్రీచరణి అంటోంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్... కెరీర్ ఆరంభంలో ఫాస్ట్ బౌలర్ కావాలని భావించింది. తగినంత ఎత్తు, అందుకు తగ్గ శరీర సౌష్టవం ఆమెను ఆ దిశగా ప్రోత్సహించగా... ఆంధ్రప్రదేశ్ హెడ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి మాత్రం ఆమెను స్పిన్ వైపు అడుగులు వేయించాడు.
అపార ప్రతిభ ఉన్న శ్రీచరణికి ఆరంభంలో ఏదీ కలిసి రాలేదు. దీంతో అండర్–19 జట్టులో ఆమెకు చోటు దక్కలేదు. అయినా ఏమాత్రం నిరుత్సాహానికి గురికాని ఈ లెఫ్ట్ హ్యాండర్... వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ రోజురోజుకు మరింత మెరుగైంది.
ఢిల్లీ క్యాపిటల్స్ చొరవతో...
డబ్ల్యూపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీకి చెందిన హైదరాబాద్ మాజీ కెపె్టన్ అనన్య ఉపేంద్రన్ దృష్టిలో పడటంతో శ్రీచరణి దశ తిరిగింది. 2022 టి20 చాలెంజర్ ట్రోఫీలో చరణి బౌలింగ్‌ను గమనించిన అనన్య... ఈ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఉందని ముందే ఊహించింది. ‘ఆ టోర్నీ మొత్తంలో శ్రీచరణి ప్రదర్శన నన్ను ఆకట్టుకుంది. మెరుగైన బౌలింగ్ యాక్షన్‌కు తోడు... బంతి మీద మంచి నియంత్రణ ఉండటం ఆమె బలం.
ఇక మిగిలిన స్పిన్నర్లతో పోల్చుకుంటే కాస్త వేగంగా బంతులు వేస్తుండటంతో... ప్రత్యర్థులు షాట్లు ఆడలేక పోయేవారు. ఇంత ప్రతిభ ఉన్న అమ్మాయిని ఐసీసీ తొలిసారి నిర్వహించిన అండర్–19 మహిళల ప్రపంచకప్‌లో పాల్గొన్న భారత జట్టులో చోటు దక్కకపోవడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. మంచి శరీర సౌష్టవం ఉండటంతో గాల్లోనే బంతిని తిప్పగల సహజ ప్రతిభ ఆమెకు అబ్బింది’అని అనన్య వెల్లడించింది.
ఆ తర్వాత అనన్య ప్రోత్సాహంతో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అవకాశం దక్కించుకున్న శ్రీచరణి ఆడిన రెండు మ్యాచ్‌ల్లో 4 వికెట్లు పడగొట్టింది. ఈ దెబ్బతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తెలుగమ్మాయి... ముక్కోణపు టోర్నీలో భాగంగా శ్రీలంకతో ఆడిన తొలి వన్డేలో రెండు వికెట్లతో సత్తా చాటింది. ఇప్పటి వరకు 5 వన్డేలు ఆడిన శ్రీచరణి 6 వికెట్లు పడగొట్టి భవిష్యత్తుపై ఆశలు రేపుతోంది.
సుదీర్ఘ కాలం ఆడాలనే లక్ష్యంతో...
ఈ ఏడాది సొంతగడ్డపై ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో భారత జట్టు తమ బలాన్ని పెంపొందించుకోవాలని భావిస్తుండగా... అందులో భాగంగా యువ ప్రతిభకు విరివిగా అవకాశాలు ఇస్తోంది. అలా జట్టులోకి వచ్చిన శ్రీ చరణి ఇప్పటి వరకైతే తనమీద పెట్టుకున్న అంచనాలను అందుకుంది. మరి ఏడాది వ్యవధిలో ఇటు వన్డే ప్రపంచకప్ అటు టి20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో శ్రీచరణి ఇదే నిలకడ కొనసాగిస్తే మెగా టోర్నీల్లో పాల్గొనడం ఖాయమే.
ఆడింది తక్కువ మ్యాచ్‌లే అయినా... ఆమె సాధన చేసే తీరు, బంతిని సంధించే విధానం శ్రీ చరణిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. కెరీర్ ఆరంభంలోనే అంతర్జాతీయ స్టార్ ప్లేయర్లతో కలిసి ఆడటం తనకు కలిసొచ్చిందని చరణి పేర్కొంది. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ మెగ్ లానింగ్ తనకు ఏం కావాలో స్పష్టంగా చెప్పేదని దాని వల్ల తన పని సులువైందని ఆమె వెల్లడించింది.
ఎప్పటికప్పుడు లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతున్న శ్రీచరణి... పరిస్థితులను త్వరగా ఆకళింపు చేసుకొని అందుకు తగ్గట్లు బంతులు వేస్తుందని భారత మహిళల జట్టు బౌలింగ్ కోచ్ ఆవిష్కార్ సాల్వీ చెప్పాడు. స్వతహాగా సిగ్గరి అయిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయిలో సుదీర్ఘ కాలం జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తోంది.