నేడు బంగ్లాదేశ్‌తో పోరు
అండర్–19 వరల్డ్ కప్
మ.గం.1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్‌లలో ప్రసారం
బులవాయో: అండర్–19 వరల్డ్ కప్‌లో ఐదు సార్లు చాంపియన్ భారత జట్టు మరో టైటిల్ వేటలో తమ జోరు కొనసాగించేందుకు రెండో మ్యాచ్ బరిలోకి దిగుతోంది. నేడు (శనివారం) జరిగే గ్రూప్ ‘బి’ పోరులో బంగ్లాదేశ్ అండర్–19తో భారత కుర్రాళ్లు తలపడతారు. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న భారత్‌ను నిలువరించడం బంగ్లాకు కూడా కష్టమే. కెపె్టన్ ఆయుశ్ మాత్రే, విధ్వంసక బ్యాటర్ వైభవ్ సూర్యవంశీలతో ఓపెనింగ్ బలంగా ఉండగా వేదాంత్, విహాన్ మల్హోత్రాలు కీలక బ్యాటర్లు.
మెరుపు బ్యాటింగ్‌తో ఆకట్టుకునే అభిజ్ఞాన్ కుందు మిడిలార్డర్‌లో జట్టు బలం. దీపేశ్, హెనిల్, ఖిలాన్, అంబరీశ్‌లతో జట్టు బౌలింగ్ కూడా పదునుగా ఉంది. గత ఏడాది కాలంగా మన అండర్–19 టీమ్ అద్భుత ఫామ్‌లో ఉంది. ఇంగ్లండ్, ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికాలపై సిరీస్‌లు నెగ్గడంతో పాటు ఆసియా కప్‌లో కూడా జట్టు ఫైనల్ చేరింది. గత 17 మ్యాచ్‌లలో భారత్ 14 గెలిచింది.
తొలి మ్యాచ్‌లో అమెరికాను భారత్ చిత్తు చేయగా...టోర్నీలో బంగ్లాకు ఇదే తొలి మ్యాచ్. బంగ్లా టీమ్‌లో కెపె్టన్ అజీజుల్ హకీమ్ మినహా మిగతావారికి పెద్దగా అనుభవం లేదు. హకీమ్‌తో పాటు రెండేళ్ల క్రితం వరల్డ్ కప్‌లోనూ రాణించిన జవాద్ అబ్రార్‌ల, కలీమ్ సిద్దిఖీలపై బ్యాటింగ్ భారం ఉండగా... జింబాబ్వేలో పేస్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బౌలర్లు ఇక్బాల్ హుస్సేన్, అల్ ఫహద్ రాణిస్తారని బంగ్లా ఆశిస్తోంది. సమీయుల్ బషర్ ప్రధాన స్పిన్నర్.
భారత్ గెలుపు బోణీ...
అండర్–19 వరల్డ్ కప్‌ను భారత్ ఘన విజయంతో ప్రారంభించింది. గురువారం జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా (యూఎస్‌ఏ)ను చిత్తు చేసింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికా 35.2 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. నితీశ్ సూదిని (52 బంతుల్లో 36; 4 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెనిల్ పటేల్ (5/16) ఐదు వికెట్లు తీశాడు. అనంతరం పదే పదే వాన అంతరాయం కలిగించడంతో భారత్ ల్యన్ని డక్‌వర్త్ – లూయీస్ ప్రకారం 37 ఓవర్లలో 96 పరుగులుగా నిర్దేశించారు. భారత్ 17.2 ఓవర్లలో 4 వికెట్లకు 99 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (19), వైభవ్ సూర్యవంశీ (2)
విఫలమైనా... అభిజ్ఞాన్ కుందు (41 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్) జట్టును గెలిపించాడు.


