అందని పనస కలప | - | Sakshi
Sakshi News home page

అందని పనస కలప

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

ఆవేదనలో వీణల తయారీదారులు

బొబ్బిలి: పట్టణంలోని వీణల తయారీ కేంద్రంలో పనిచేస్తున్న కార్మికులకు పనస కలప కొరత వెంటాడుతోంది. వీణల తయారీ కష్ట సాధ్యంగా మారింది. విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం వపన్‌కల్యాణ్‌ అటవీశాఖ కార్పస్‌ ఫండ్‌ రూ.10 లక్షలతో కలప కొనుగోలు చేసి ఇస్తామని హామీ ఇచ్చారు. ఆ మేరకు అటవీశాఖ రూ.5లక్షల విలువైన పనస కలప కొనుగోలు చేసి వీణల తయారీ కేంద్రానికి చేర్చింది. మిగిలిన నిధులను ఉమ్మడి ఖాతాలో జమచేశారు. అయితే, కొనుగోలు చేసిన కలప వీణల తయారీ కేంద్రానికి చేరి దాదాపు మూడు నెలలవుతున్నా తయారీ దారులకు అప్పగించలేదు. ఇటీవల పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకిలో సీసీ రోడ్లు, కాలువల నిర్మాణాల ప్రారంభానికి పవన్‌ వస్తారని, పనస కలప అందిస్తారని భావించారంతా! కానీ ఆ పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాలేదని, గత నెల పవన్‌ రావాల్సిన షెడ్యూల్‌ను రద్దు చేశారు. ఇటీవల కుంకీ ఏనుగులు వచ్చాయి. వాటిని సంరక్షణ కేంద్రానికి తరలించగా ఆ ప్రాంతాన్ని శంకుస్థాపనతో వర్చువల్‌గా ప్రారంభించారు. ఇక ఆ అవకాశమూ వాయిదా పడింది. పనస కలపను పవన్‌ చేతుల మీదుగా ఇస్తారని భావిస్తున్న కార్మికులకు నిరాశే మిగులుతోంది. వర్చువల్‌గా 50 శాతం రాయితీపై పనసకలప ఇచ్చే అవకాశాలను పరిశీలించాలని తయారీదారులు కోరుతున్నారు.

ఆగస్టులో రావచ్చు!

వీణ కార్మికులకు పనస కలప అందించేందుకు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ వస్తారని సమాచారం ఉంది. ఆయన వచ్చాకే పనస కలప కార్మికులకు అందిస్తారు. ఈలోగా పనస కలప పాడవ్వకుండా భద్రపరిచాం. ఆగస్టు 15న కలప ఇచ్చేందుకు అవకాశం ఉంది. – రామకృష్ణ,

వీణల తయారీ కేంద్రం ఇన్‌చార్జి, బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement