పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు | - | Sakshi
Sakshi News home page

పంటల బీమా ప్రీమియం చెల్లింపు గడువు పెంపు

Aug 2 2026 12:52 AM | Updated on Aug 2 2026 12:52 AM

రైతుల నెత్తిన మరింత భారం

చెల్లింపునకు పాట్లు

రామభద్రపురం: ఖరీఫ్‌ సీజన్‌లో వరి మినహా పత్తి, మొక్కజొన్న తదితర మిగతా పంటలకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన గడువును కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే వరి పంటకు ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఉండగా, మిగతా పంటలకు గడువును పొడిగించింది. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నవారు, తీసుకోని వారితో పాటు కౌలు రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు ఈ గడువు వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 1,16,990 హెక్టార్లు. ఇందులో వరి 97,500 హెక్టార్లు, మొక్కజొన్న 10,791 హెక్టార్లు, పత్తి 2,200 హెక్టార్లలో సాగు లక్ష్యం. ఇప్పటి వరకు వెదలు, ఉబాలుతో వరి సాగు చేసింది 10,600 హెక్టార్లు, మొక్కజొన్న 7,212 హెక్టార్లలో సాగైంది. పంటల బీమా ప్రీమియం చెల్లింపులో తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ రెండు పంటలకుగాను ఇప్పటి వరకు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకం కింద బ్యాంకులో రుణాలు తీసుకున్న వారు, తీసుకొని వారు కలిపి 6,393 హెక్టార్లకు 56,600 మంది రైతులు సుమారు రూ.31 లక్షలు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. వాతావరణ ఆధారిత పథకం కింద పత్తి 2,112 హెక్టార్లకుగాను 462 మంది రైతులు 81 హెక్టార్లకు మాత్రమే పంటల బీమా ప్రీమియం సుమారు రూ.3,87 లక్షలు చెల్లించారు.

చెల్లింపునకు పాట్లు

ఎల్‌నినో పరిస్థితులు ఉన్నందున పంట చేతికిరాని సమయంలో కనీసం బీమా పరిహారమైనా వస్తుందనే ఆశతో ప్రీమియం చెల్లించేందుకు ఎగబడుతున్నారు. అయితే మీ సేవా కేంద్రాలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లు(సీఎస్‌సీ)ఆర్‌ఎస్‌కేలు, డిజిటల్‌ కేంద్రాలలో సర్వర్లు సరిగా పని చేయకపోవడంతో రైతులు ప్రీమి యం చెల్లింపు కోసం గంటల తరబడి నిరీక్షిస్తూ పా ట్లు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. రైతులు తా ము చేసిన పంటలకు తమ వాటా కింద ప్రీమియం చెల్లిస్తేనే బీమా పథకాలు వర్తించనున్నాయి.

అన్నదాతపై బీమా భారం

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాకు మంగళం పాడింది. ఆ భారాన్ని రైతులపైనే వేసింది. ఒక వైపు ఎలినినో ప్రభావంతో వర్షాలు లేక పొలంలో తాము కష్టపడి సాగు చేసిన పంటలు చేతికి రాకుండా పోతుండటం, చేతిలో చిల్లిగవ్వ లేక రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో రైతులే పంటల ప్రీమియం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. ఫలితంగా అన్నదాత మరిన్ని కష్టాలు పడుతున్నాడు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో రైతులపై పైసా భారం మోపకుండా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా కింద ఈ–పంట ఆధారితంగానే బీమా ప్రీమియం చెల్లించారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం ఈ భారాన్ని రైతులపైనే వేసింది.

15లోగా ప్రీమియం చెల్లించాలి

రైతు ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం పంటల బీమా నమోదు గడువు ఈ నెల 15వ తేదీ వరకు పెంచింది. రైతులు చివరి వరకు వేచి ఉండకుండా బ్యాంకులో రుణాలు ఉన్న వారు, లేని రైతులు మొబైల్‌ యాప్‌ ద్వారా లేక ఆర్‌ఎస్కేలు, సీఎస్‌సీల వద్ద ప్రీమియం చెల్లించాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

– మధుసూదనరావు, ఏడీఏ, బొబ్బిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement