ఏళ్ల తరబడి ఉన్న యాప్‌ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్‌ | Microsoft to Shut Down Outlook Lite App Users Must Switch to Main Outlook Mobile | Sakshi
Sakshi News home page

ఏళ్ల తరబడి ఉన్న యాప్‌ను నిలిపేసిన మైక్రోసాఫ్ట్‌

Apr 13 2026 3:23 PM | Updated on Apr 13 2026 3:28 PM

Microsoft to Shut Down Outlook Lite App Users Must Switch to Main Outlook Mobile

మే 25 నుంచి ‘అవుట్‌లుక్ లైట్’ సేవలు బంద్ 

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ వినియోగదారులకు ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో తక్కువ డేటా, తక్కువ మెమరీతో పనిచేసేలా రూపొందించిన ‘అవుట్‌లుక్ లైట్’ యాప్ సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. 2026, మే 25వ తేదీ నుంచి ఈ యాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని కంపెనీ స్పష్టం చేసింది.

ఏమిటీ మార్పు? ఎందుకు?

ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ కనెక్షన్లను దృష్టిలో ఉంచుకుని మైక్రోసాఫ్ట్ గతంలో ఈ ‘లైట్’ వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, తన మొబైల్ ఈమెయిల్ వ్యూహాన్ని ఏకీకృతం చేయడంలో భాగంగా ఇకపై సింగిల్ ప్లాట్‌ఫామ్ పైనే దృష్టి సారించాలని కంపెనీ నిర్ణయించింది. మైక్రోసాఫ్ట్ 365 సేవలతో అనుసంధానం, మెరుగైన భద్రతా ఫీచర్లు, వ్యక్తిగత, కార్పొరేట్ వినియోగదారులకు విస్తృతమైన సౌకర్యాలను ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే 2025 చివరి నుంచే కొత్త డౌన్‌లోడ్లను నిలిపివేసిన కంపెనీ ఇప్పుడు తుది గడువును ఖరారు చేసింది.

వినియోగదారులపై ప్రభావం ఇలా..

మే 25 తర్వాత మీ ఫోన్‌లో యాప్ ఐకాన్ కనిపించినప్పటికీ మెయిల్ బాక్స్ ఓపెన్ కాదు. అంటే, మీరు కొత్త ఈమెయిల్స్ చూడటం, పంపడం లేదా క్యాలెండర్ ఈవెంట్లను నిర్వహించడం సాధ్యం కాదు. అయితే, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ ఈమెయిల్స్, కాంటాక్ట్స్, క్యాలెండర్ డేటా అంతా సురక్షితంగా ఉంటుంది. యూజర్లు వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి ప్రధాన ‘అవుట్‌లుక్ మొబైల్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఇప్పుడేం చేయాలి?

అంతరాయం లేని అవుట్‌లుక్‌ సర్వీసుల కోసం వినియోగదారులు గడువు ముగిసేలోపే కొన్ని చర్యలు తీసుకోవాలని కంపెనీ సూచించింది. అవుట్‌లుక్ లైట్ యాప్‌లోనే అప్‌గ్రేడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా నేరుగా మెయిన్ యాప్‌కు వెళ్లవచ్చు. మెయిన్ అవుట్‌లుక్ యాప్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీ పాత మైక్రోసాఫ్ట్ అకౌంట్ వివరాలతో లాగిన్ అయితే సరిపోతుంది. మీ మెయిల్స్, అటాచ్‌మెంట్లు ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. కంపెనీ ఐటీ నిర్వాహకులు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు కానీ, తమ ఉద్యోగులు సకాలంలో కొత్త యాప్‌కు మారేలా అంతర్గత మార్గదర్శకాలు జారీ చేయాల్సి ఉంటుంది.

సాంకేతికత సర్వీసులు వేగంగా మారుతున్న తరుణంలో ఫీచర్ రిచ్ ప్లాట్‌ఫామ్‌ల వైపు మొగ్గు చూపడం ద్వారా యూజర్లకు అత్యుత్తమ సేవలు అందించడమే లక్ష్యమని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. కాబట్టి, గడువు ముగిసే వరకు వేచి చూడకుండా ఇప్పుడే మెయిన్ యాప్‌కు మారడం ఉత్తమం.

ఇదీ చదవండి: రూ.30 లక్షలలోపు ఈవీలపై పన్ను రాయితీ!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement