Tractors Sales
-
ట్రాక్టర్ విక్రయాలు.. రికార్డ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్లకు బలమైన డిమాండ్ ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా. కీలక పంటలకు అధిక మద్దతు ధరలకుతోడు, నిర్మాణ రంగం నుంచి డిమాండ్, పాత వాహనాలను మార్చడం, సాధారణం కంటే అధిక వర్షాలు పడతాయన్న అంచనాలతో క్రిసిల్ రేటింగ్స్ అ అంచనాకు వచి్చంది. 2025–26లో ట్రాక్టర్ల విక్రయాలు 9.75 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని.. క్రితం ఆర్థిక సంవత్సరంతో పోల్చి చూస్తే 3–5 శాతం వరకు పెరుగుతాయని తన తాజా నివేదికలో పేర్కొంది. ట్రాక్టర్ల తయారీ పరిశ్రమలో రూ.4,000 కోట్ల మూలధన పెట్టుబడులకు అవకాశాల్నుట్టు తెలిపింది. ప్రస్తుత తయారీ సామర్థ్యంలో వినియోగం 75–80 శాతానికి చేరుకోవడం, పర్యావరణ అనుకూల టెక్నాలజీలకు మద్దతు మూలధన నిధుల వ్యయాలకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. కర్బన ఉద్గారాల నిబంధనలు ‘టర్మ్ 5’ 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని.. కనుక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివర్లో ట్రాక్టర్ల ముందస్తు కొనుగోళ్లు ఊపందుకోవచ్చని కూడా క్రిసిల్ అంచనా వేసింది. కనుక 2022–23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన ట్రాక్టర్ల గరిష్ట విక్రయాలు 9.45 లక్షల యూనిట్ల మార్క్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అమ్మకాలు అధిగమించొచ్చని పేర్కొంది. 2024–25లో ట్రాక్టర్ల అమ్మకాలు 7 శాతం పెరిగినట్టు తెలిపింది. వర్షపాతం అంచనాలతో సానుకూల సెంటిమెంట్ ‘‘సాధారణం కంటే ఎక్కువ వర్షాలు నమోదవుతాయంటూ భారత వాతావణ శాఖ వేసిన అంచనాలు గ్రామీణ సెంటిమెంట్‌ను బలపరుస్తాయి. రైతుల్లో ఆత్మవిశ్వాసం బలపడుతుంది. ట్రాక్టర్లు సహా సాగుపై పెట్టుబడులకు ఇది కీలకంగా పనిచేస్తుంది’’అని క్రిసిల్ రేటింగ్స్ సీనియర్ డైరెక్టర్ అనుజ్ సేతి తెలిపారు. కీలక పంటలకు కనీస మద్దతు ధరలు పెరుగుతాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. అలాగే నిర్మాణ రంగంలో కార్యకలాపాలు ఊపందుకోవడం వంటివి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ట్రాక్టర్ల విక్రయాలు పెరిగేందుకు సానుకూలిస్తాయన్నారు. ముఖ్యంగా 2026 ఏప్రిల్ 1 నుంచి టర్మ్ 5 నిబంధనలు అమల్లోకి వస్తుండడంతో ట్రాక్టర్ల ధరలు పెరుగుతాయని.. ఇది కూడా ముందస్తు కొనుగోళ్లను పెంచుతుందని అంచనా వేశారు. అమ్మకాల్లో పెరుగుదల, తయారీ వ్యయాలు తగ్గుముఖం పట్టడం వంటివి ట్రాక్టర్ల కంపెనీల మార్జిన్లను 13–13.5 శాతం స్థాయిలో స్థిరంగా కొనసాగేందుకు దారితీస్తాయని క్రిసిల్ నివేదిక తెలిపింది. వర్షాల్లో తాత్కాలిక అవాంతరాలు, వ్యవసాయ రంగం, గ్రామీణ ఆదాయాలపై దీని ప్రభావం, కమోడిటీల ధరలు, వడ్డీ రేట్లు, కాలుష్య ఉద్గారాల నిబంధనల అమలు ప్రభావం వంటివి మధ్య కాలానికి గమనించాల్సిన అంశాలుగా పేర్కొంది. -
ఓజా బ్రాండ్ కింద 40 ట్రాక్టర్లు
న్యూఢిల్లీ: ఓజా బ్రాండ్ కింద కొత్తగా 40 ట్రాక్టర్ మోడళ్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రకటించింది. మహీంద్రా ఓజా ట్రాక్టర్లు దేశీ మార్కెట్‌తోపాటు అమెరికా, జపాన్, ఆగ్నేయ ఆసియా మార్కెట్లపై దృష్టి సారించనున్నట్టు కంపెనీ ప్రకటించింది. సబ్ కాంపాక్ట్, కాంపాక్ట్, స్మాల్ యుటిలిటీ, లార్జ్ యుటిలిటీ పేరుతో నాలుగు విభాగాల్లో 40 ఓజా ట్రాక్టర్లను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు తెలిపింది. మిత్సుబిషి మహీంద్రా అగ్రికల్చరల్ మెషినరీ (జపాన్), భారత్‌లోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ, మహీంద్రా ఆటో అండ్ ఫార్మ్ సెక్టార్ ఆర్అండ్డీ సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేసినట్టు పేర్కొంది. ఓజా శ్రేణి ట్రాక్టర్లను తెలంగాణలోని జహీరాబాద్ ట్రాక్టర్ల ప్లాంట్‌లో తయారు చేయనుంది. -
ఆగస్ట్‌లో పెరిగిన ట్రాక్టర్ల అమ్మకాలు
న్యూఢిల్లీ/ముంబై: ఖరీఫ్ సీజన్ కావడంతో ట్రాక్టర్ల విక్రయాలకు కలిసొచ్చింది. ఆగస్ట్ మాసంలో ట్రాక్టర్ల అమ్మకాల్లో మంచి వృద్ధి నెలకొంది. ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ లిమిటెడ్ (ఐటీఎల్)కు చెందిన సోనాలికా ట్రాక్టర్ల విక్రయాలు ఏకంగా 23.2 శాతం పెరిగాయి. 7,369 వాహనాలను విక్రయించింది. ఎగుమతులతో కలిపి 2017 ఆగస్ట్‌లో అమ్ముడుపోయిన ట్రాక్టర్లు 6,036 మాత్రమే. దీంతో పోలిస్తే విక్రయాలు 23.2 శాతం పెరిగాయి. ఈ కంపెనీ ట్రాక్టర్ల ఎగుమతులు క్రితం ఏడాది ఆగస్ట్‌లో 1,095గా ఉంటే, ఈ ఏడాది ఆగస్ట్‌లో 2,082కు పెరగడం గమనార్హం. ఈ సంస్థ 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. అటు మహింద్రా అండ్ మహింద్రా ట్రాక్టర్ల విక్రయాలు ఆగస్ట్ నెలలో 7 శాతం వృద్ధి చెంది 17,785 యూనిట్లుగా ఉన్నాయి. దేశీయ అమ్మకాలు 16,375 యూనిట్లు కావడం గమనార్హం. క్రితం ఏడాది ఆగస్ట్ నెలలో 16,641 ట్రాక్టర్లు అమ్ముడుపోయాయి. ఎగుమతి అయిన వాహనాల సంఖ్య 1,285 యూనిట్ల నుంచి 1,410 యూనిట్లకు పెరిగింది. బజాజ్ ఆటోఅమ్మకాల్లో వృద్ధి బజాజ్ ఆటో అమ్మకాలు 30 శాతం వృద్ధిని నమోదు చేశాయి. అన్ని విభాగాల్లో అమ్మకాలు సానుకూలంగా ఉన్నాయి. ఆగస్ట్ నెలలో 4,37,092 యూనిట్లను కంపెనీ విక్రయించింది. క్రితం ఏడాది ఇదే నెలలో విక్రయాలు 3,35,031 యూనిట్లుగా ఉండడం గమనార్హం. దేశీయ అమ్మకాలు 27 శాతం వృద్ధితో 2,00,659 యూనిట్ల నుంచి 2,55,631 యూనిట్లకు పెరిగాయి. మొత్తం మోటారు సైకిళ్ల అమ్మకాలు 3,62,923 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో ఉన్న అమ్మకాలతో పోల్చి చూస్తే 28 శాతం పెరిగాయి. వాణిజ్య వాహనాల విక్రయాలు 51,170 యూనిట్ల నుంచి 74,169 యూనిట్లకు పెరిగాయి. ఎగుమతులు సైతం క్రితం ఏడాది ఇదే నెలతో పోలిస్తే 1,34,372 యూనిట్ల నుంచి 1,81,461 యూనిట్లకు వృద్ధి చెందాయి. -
స్టాక్స్ వ్యూ
మహీంద్రా అండ్ మహీంద్రా బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ ప్రస్తుత ధర: రూ.1,377 టార్గెట్ ధర: రూ. 1,525 ఎందుకంటే: మహీంద్రా అండ్ మహీంద్రా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ట్రాక్టర్ల అమ్మకాలు తగ్గడంతో ఆదాయం అంచనాలను అందుకోలేక రూ.9,830 కోట్లకు పరిమితమైంది. నికర లాభం రూ.852 కోట్లకు చేరింది. 2011-12లో 55 శాతంగా ఉన్న కంపెనీ యుటిలిటీ వాహనాల మార్కెట్ వాటా 2014-15లో 37 శాతానికి తగ్గింది. కొత్త మోడళ్లు లేకపోవడం వల్ల మార్కెట్ వాటా తగ్గిందని గుర్తించిన కంపెనీ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలనే ఎక్స్‌యూవీ 500ను, చిన్న వాణిజ్య వాహనం జీతోను మార్కెట్లోకి తెచ్చింది. త్వరలో రెండు కొత్త మోడళ్లు(టీయూవీ 300ను, ఎస్101ను) తేనున్నది. ఈ రెండు కొత్త మోడళ్ల కారణంగా అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో 8 శాతం, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 35 శాతం చొప్పున వృద్ధి చెందగలవని అంచనా వేస్తున్నాం. 2010-15 కాలానికి 16 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించిన ఆదాయం రెండేళ్లలో 15 శాతం చొప్పున, 2010-15 కాలానికి 10 శాతం చొప్పున వృద్ధి సాధించిన నికర లాభం రెండేళ్లలో 18 శాతం చొప్పున వృద్ధి సాధించగలదని భావిస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్థభాగంలో ట్రాక్టర్ల అమ్మకాలు పుంజుకోగలవని కంపెనీ భావిస్తోంది. కమిన్స్ ఇండియా బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.1,192 టార్గెట్ ధర: రూ. 1,350 ఎందుకంటే: కమ్మిన్స్ ఇండియా పుణే కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా 200 ప్రాంతాల్లో ఎనిమిది సంస్థలతో వ్యాపారం సాగిస్తోంది. విద్యుదుత్పత్తి, పారిశ్రామిక, వాహన మార్కెట్లకు అవసరమైన డీజిల్, నేచురల్ గ్యాస్ ఇంజిన్లను తయారు చేస్తోంది. ఈ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర అమ్మకాలు 20 శాతం వృద్ధితో రూ.1,314 కోట్లకు పెరిగాయి. నికర లాభం మాత్రం స్వల్పంగా తగ్గి రూ.210 కోట్లకు క్షీణించింది. విద్యుదుత్పత్తి విభాగం వ్యాపారం 23 శాతం, దేశీయ అమ్మకాలు 17 శాతం, ఎగుమతులు 36 శాతం చొప్పున వృద్ధి సాధించాయి. కంపెనీకి దీర్ఘకాల, స్వల్పకాలిక రుణాలేమీ లేవు. అందుకని వడ్డీభార సమస్యే లేదు. మౌలిక రంగానికి పెట్టుబడులందించడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తున్న నేపథ్యంలో కంపెనీ పారిశ్రామిక వ్యాపార విభాగం పుంజుకోవచ్చు. రెండేళ్లలో నికర అమ్మకాలు 4 శాతం, నికర లాభం 5 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, షేర్‌వారీ ఆర్జన(ఈపీఎస్)ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.31గానూ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.34 గానూ ఉండొచ్చని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, ఇతర వివరాలు వివిధ బ్రోకరేజి సంస్థల నిపుణులు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.