భూ సేకరణ పరిహారంలో కోత | Cut in land acquisition compensation | Sakshi
Sakshi News home page

భూ సేకరణ పరిహారంలో కోత

Jul 30 2026 4:47 AM | Updated on Jul 30 2026 4:47 AM

Cut in land acquisition compensation

పట్టణాలకు దగ్గరగా ఉన్న భూములకు పరిహారం తగ్గింపు

హైకోర్టు తీర్పు పేరుతో రైతులకు నష్టం చేసేలా ముసాయిదా నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: భూ సేకరణలో పట్టణాలకు దగ్గ­రగా భూములు కోల్పోతున్న రైతులకు చంద్రబాబు ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది.  ఈ భూముల­కు గతంలో కంటే భారీగా పరిహారం తగ్గించింది. భూసేకరణ చట్టం–2013 కింద పరిహారం లెక్కింపులో కీలకమైన నిబంధనను సవరిస్తూ బుధవా­రం జీవో 470 జారీ చేసింది. ప్రభుత్వం భూమిని సేకరించిన­ప్పుడు మార్కెట్‌ విలువే కాకుండా దానిపై అదనంగా కొంత శాతం కలిపి ఇస్తారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో (షెడ్యూల్డ్‌ ఏరియాలు మినహా) భూమిని సేకరిస్తే ఈ అదనపు పరిహారం 25 శాతంగా (మల్టిప్లికేషన్‌ ఫ్యాక్టర్‌ 1.25) ఉంది. అంటే రూ.10 లక్షల విలు­వైన భూమికి రైతుకు రూ.10 లక్షలతోపాటు అద­నంగా రూ.2.5 లక్షలు లభించేవి. 

ఇప్పుడు ప్రభు­త్వం ఈ 25 శాతాన్ని అందరికీ ఒకేలా ఇవ్వకుండా కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల నుంచి ఆ భూమి ఎంత దూరంలో ఉందన్న దాన్ని బట్టి మూడు స్థాయి­లుగా విభజించింది. పట్టణా­నికి 2 కిలోమీటర్ల లోపు ఉన్న భూములకు కేవ­లం 5 శాతం (మల్టిప్లికేషన్‌ ఫ్యాక్టర్‌ 1.05)  అదనంగా ఇవ్వనున్నారు. 2–5 కిలోమీ­టర్ల మధ్య ఉన్న భూములకు 10 శాతమే(మల్టిప్లికేషన్‌ 1.10) లభిస్తుంది. 5 కిలోమీటర్లు దాటిన భూము­లకు మాత్రమే 25 శాతం(మల్టిప్లికేషన్‌ 1.25) కొనసా­గు­తుంది. ఉదాహరణకు రూ.10 లక్షల విలువ ఉన్న భూమిని తీసుకుంటే పట్టణా­నికి దగ్గరగా ఉన్న రైతుకు ఇప్పుడు కేవలం రూ.10.5 లక్షలే వస్తాయి. 

నగర, పట్టణ శివారు భూముల విలువ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కీలకమైన భూము­ల­కే ఇప్పుడు ప్రభుత్వం అదనపు పరిహా­రంలో కోత పెట్టి­ంది. పశ్చిమ గోదావరి జిల్లా దేవర­పల్లి మండలానికి చెందిన కాశీరాజు సీతారామ­య్య, మరో 82 మంది రైతులు తమ భూములకు తక్కువ మల్టిప్లికే­షన్‌ వర్తింపజేశారని, పోరంకి రైతులకు ఇచ్చినంత పరిహారం తమకు ఇవ్వలేదని 2017లో హైకోర్టును ఆశ్రయించారు. 2019లో హైకోర్టు వీరికి అనుకూ­లంగా తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆధారంగానే సవరణ తెచ్చినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఆ తీర్పు రైతు­లకు ఎక్కువ పరిహారం ఇవ్వాలని చెబితే ప్రభుత్వం మాత్రం పట్టణాలకు దగ్గరగా ఉన్న భూములకు పరిహారాన్ని తగ్గించేలా నిబంధన మార్చింది. దీనిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement