రుచి మాత్రమే కాదు.. శుచికీ చిరునామా
ఆరోగ్యకరమైన జీవితానికి పునాది ఎక్కడ పడుతుందో తెలుసా? మన వంటగదిలోనే! మంచి ఆహార అలవాట్లు పాటించటం ఎంత ముఖ్యమో.. దానికి తగ్గట్టుగా మన వంటగదిని సిద్ధం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. కిచెన్ శుభ్రంగా, పద్ధతిగా ఉంటే వంట చేయడం భారం కాకుండా ఒక ఆనందమైన పనిలా మారుతుంది. అందుకే, మీ వంటగదిని ‘హెల్దీ – స్మార్ట్’గా మార్చే కొన్ని చిట్కాలను నిపుణులు అందిస్తున్నారు.
అందుబాటులో వంట సామగ్రి
⇒ స్పష్టమైన లేబుల్స్: ధాన్యాలు, పప్పులు, మసాలా దినుసులను ప్రత్యేక డబ్బాల్లో పోసి లేబుళ్లు అంటించండి.
⇒ కంటికి కనిపించేలా పండ్లు: పండ్లు, కూరగాయలు కనిపించేలా ముందే ఉంచితే, అవే తినాలనే ఆసక్తి పెరుగుతుంది.
⇒ నీట్ కౌంటర్ టాప్: వంటగది కౌంటర్‌ను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచండి.
⇒ వీక్లీ క్లీనింగ్: వారానికి ఒకసారి అవసరం లేని వస్తువులను ఏరిపారేసి వంటగదిని రీఫ్రెష్ చేయండి.
గాజు డబ్బాల మెరుపులు
⇒ రోజూ వాడే పదార్థాలను సులభంగా అందే షెల్ఫ్‌లలో ఉంచండి.
⇒ తృణ ధాన్యాలు, పప్పులు, డ్రై ఫ్రూట్స్ వంటివి పారదర్శక డబ్బాల్లో నిల్వ చేయండి. ఇవి తాజాగా ఉండడమే కాకుండా, సమయానికి సులభంగా కనిపిస్తాయి.
⇒ కిచెన్‌లో హెల్దీ ఆప్షన్ కంటికి కనిపిస్తుంటే, జంక్ ఫుడ్ పక్కన పెట్టి ఆరోగ్యకరమైన ఆహారానికే ప్రాధాన్యం ఇస్తాం.
సరైన పరికరాలు – సగం పని తేలిక!
వంట వేగంగా, సురక్షితంగా జరగాలంటే మంచి సాధనాలు ఉండాల్సిందే. నాణ్యమైన కత్తులు, కటింగ్ బోర్డులు, కొలత కప్పులు, చెంచాలను మీ దగ్గర ఉంచుకోండి. సరైన పరికరాలుంటే వంట చేయడం చకచకా పూర్తవుతుంది.
నిలువు స్థలం – స్మార్ట్ సేవింగ్!
గోడలకు అమర్చే షెల్ఫ్‌లు లేదా ర్యాక్‌లను ఉపయోగిస్తే కిచెన్ పెద్దగా, విశాలంగా కనిపిస్తుంది. మసాలాలు, ఎండిన ఆకుకూరల డబ్బాలను గోడ ర్యాక్స్‌లో అమర్చడం వల్ల కిచెన్ కౌంటర్ ఖాళీగా ఉండి వంట చేయడం సులభమవుతుంది.
తాజాదనానికి ఫ్రిజ్ మేనేజ్‌మెంట్
పదార్థాలు పాడవకుండా ఉండాలంటే ఫ్రిజ్‌ను పద్ధతిగా తీర్చిదిద్దాలి. పండ్లకు పండ్లు, కూరగాయలకు కూరగాయలు.. ఇలా ఒకే రకమైన వస్తువులను ఒకే విభాగంలో వర్గీకరించి ఉంచండి.
మీల్ ప్లానింగ్ – సమయం, ఆరోగ్యం భద్రం!
⇒ ముందే మెనూ: వారానికి సరిపడే వంటల ప్రణాళికను ఒకేసారి సిద్ధం చేసుకోండి.
⇒ జాబితాతో షాపింగ్: మెనూ ప్రకారం కిరాణా సరుకుల జాబితా చేసుకొని షాపింగ్ చేస్తే.. అనవసరమైన జంక్ ఫుడ్ కొనే అలవాటు తగ్గుతుంది.
⇒ న్యూట్రిషన్ గ్యారంటీ: ఈ అలవాటు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, వారమంతా పోషకాహారం మన కడుపులో పడేలా చేస్తుంది!
⇒ గుర్తుంచుకోండి: శుభ్రమైన, క్రమబద్ధమైన వంటగదే మన సమయాన్ని ఆదా చేస్తుంది... కుటుంబానికి పరిపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది! - సాక్షి, స్పెషల్ డెస్క్


