సరైన ఆహార నియమాలు, జీవనశైలితో వయసును తగ్గించుకునే అవకాశం
శరీర కణాలను యవ్వనంగా ఉంచుకోవచ్చంటున్నశాస్త్రవేత్తలు
సాక్షి స్పెషల్ డెస్క్: వయసు పెరగడం అనేది శారీరక క్రియ. అయితే వృద్ధాప్య ఛాయలు దరి చేరకుండా, శరీర కణాలను ఎల్లప్పుడూ యవ్వనంగా ఉంచుకోవడం ఇప్పుడు మన చేతుల్లోనే ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. కేవలం 4 వారాల పాటు సరైన ఆహార నియమాలు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని పాటిస్తే.. మన శరీర జీవసంబంధిత వయసును (బయలాజికల్ ఏజ్) ఏకంగా 3 నుంచి 4 ఏళ్ల వరకు వెనక్కి మళ్లించవచ్చని ఆ్రస్టేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. ఇందుకు సంబంధించిన విశేషాలు అంతర్జాతీయ జర్నల్ ‘ఏజింగ్ సెల్’లో ప్రచురితమయ్యాయి.
ఏమిటీ పరిశోధన?
సాధారణంగా మనం పుట్టిన తేదీని బట్టి లెక్కించే వయసును ‘క్రోనలాజికల్ ఏజ్’అంటారు. కానీ మన శరీరంలోని కణాలు, అవయవాల ఆరోగ్యం ఆధారంగా నిర్ణయించే అసలు వయసును బయోలాజికల్ ఏజ్ అంటారు. పరిశోధనలో భాగంగా శాస్త్రవేత్తలు 65 నుంచి 75 సంవత్సరాల మధ్య వయస్సు గల 104 మంది వృద్ధులను నాలుగు గ్రూపులుగా విభజించి, వారికి నాలుగు వారాల పాటు నాలుగు వేర్వేరు ఆహార ప్రణాళికలను (డైట్ ప్లాన్‌లు) అందించి పరిశీలించారు.
ఈ ప్రయోగ కాలంలో నాలుగు గ్రూపుల వారి రక్తపోటు, ఇన్సులిన్ స్థాయిలు, కొలెస్ట్రాల్, ఇన్‌ఫ్లమేషన్ (వాపులు) వంటి 20 రకాల ఆరోగ్య సూచికలను, అలాగే శరీరం ఎంత వేగంగా వయసు మీరుతోందో చెప్పే ‘ఎపిజెనెటిక్ క్లాక్’పై నిరంతర అధ్యయనం చేశారు.
ఆశ్చర్యకరమైన ఫలితాలు
⇒ తక్కువ కొవ్వు తింటూ, కలగూర కార్బోహైడ్రేట్లు (తృణ ధాన్యాలు, చిక్కుళ్లు, దుంపలు) తీసుకున్నవారిలో అత్యధికంగా 4.1 సంవత్సరాల బయోలాజికల్ వయస్సు తగ్గింది.
⇒ జంతు ప్రోటీన్లను (మాంసాహారం) తగ్గించి, మొక్కల ఆధారిత ప్రోటీన్లు తీసుకున్న వారిలో 2.9 నుంచి 3.2 ఏళ్ల వయస్సు తగ్గింది.
⇒ జంతు ఆధారిత కొవ్వులు, ఎక్కువ ఫ్యాట్ ఉన్న సాధారణ ఆహారం తిన్న వారి వయస్సులో ఏ మార్పూ కనిపించలేదు.
వృద్ధ జన్యువులు – యవ్వన జన్యువులు
మన శరీరంలో ‘డీఎన్‌ఏ మైథెలేషన్’అనే ఒక ముఖ్యమైన ప్రక్రియ జరుగుతుంది. మనం తినే ఆహారం, చేసే వ్యాయామం ఈ ప్రక్రియను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. తాజా పరిశోధన ప్రకారం.. మనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పుడు, వృద్ధాప్యానికి కారణమయ్యే జన్యువులు ‘స్విచ్ ఆఫ్’అవుతాయి. అదే సమయంలో మనల్ని యవ్వనంగా ఉంచే జన్యువులు మరింత మెరుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయి.
ఆహారంతో పాటుగా...
వయసును వెనక్కి మళ్లించే మ్యాజిక్ ఫలితం దక్కాలంటే కేవలం తిండి మార్చడమే కాదు.. ప్రతిరోజూ కనీసం 7 గంటల నాణ్యమైన నిద్ర, రోజుకు 30 నిమిషాల పాటు వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం, శరీరానికి సరిపడా నీరు తాగడం వంటి నియమాలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఆహార ప్రణాళికలివే..
⇒ మాంసాహారం,ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం.
⇒ మాంసాహారం, తక్కువ కొవ్వు, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం.
⇒ శాకాహారం, ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం.
⇒ శాకాహారం, ఎక్కువ కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారం.


