పెరుగుతున్న ప్రోటీన్ డిమాండ్..
మారుతున్న జీవనశైలి
భారతీయుల రోజువారీ ఆహార అలవాట్లలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు జిమ్‌కు వెళ్లేవారో, బాడీ బిల్డర్లో అధికంగా తీసుకునే ప్రోటీన్ (మాంసకృత్తులు)పై ఇప్పుడు సామాన్యులకు ఆసక్తి పెరిగింది. దేశవ్యాప్తంగా హెల్త్, ఫిట్‌నెస్ పట్ల అవగాహన పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఫుడ్‌మెనూలో ప్రోటీన్ ఆధారిత ఆహారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టామార్ట్ తాజాగా విడుదల చేసిన 2023-2025 కాలానికి సంబంధించిన నివేదికలో కొన్ని కీలక విషయాలు వెల్లడయ్యాయి. గడిచిన రెండేళ్లలోనే ఇన్‌స్టామార్ట్‌లో ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు ఏకంగా 150 శాతం వృద్ధి చెందగా వినియోగదారులు వీటికోసం చేసే ఖర్చు ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం.
టైర్-2 నగరాల్లో వృద్ధి!
ఒకప్పుడు హెల్తీ లైఫ్‌స్టైల్ ట్రెండ్స్ కేవలం మెట్రో నగరాలకే పరిమితం అనుకునేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. మెట్రో నగరాలతో పోలిస్తే టైర్-2, 3 నగరాల్లో ప్రోటీన్ ఆర్డర్ల వృద్ధి రేటు 200 శాతం వేగంగా ఉంది. వైజాగ్ వంటి నగరాలు ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రోటీన్ వినియోగ హబ్‌లుగా మారుతున్నాయి. ఇక్కడి ప్రజలు తమ రోజువారీ సరుకుల లిస్ట్‌లో సాంప్రదాయ ఆహారంతో పాటు ఆధునిక ప్రోటీన్ ప్రొడక్ట్స్‌ను కూడా చేరుస్తున్నారు.
ప్రోటీన్ ఆర్డర్ల ట్రెండ్‌పై ఇన్‌స్టామార్ట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ హరి కుమార్ మాట్లాడుతూ ‘మేం నిత్యావసరాలను వేగంగా అందించడంతోపాటు భారతీయుల జీవన విధానంలో వస్తున్న ఒక ప్రాథమిక మార్పులో భాగస్వామ్యం అవుతున్నాం. ఇది హెల్తీ లైఫ్‌స్టైల్ వైపు మళ్లుతున్న ట్రెండ్‌ను సూచిస్తుంది. మెట్రోల నుంచి చిన్న నగరాల వరకు ప్రతి ఒక్కరికీ నాణ్యమైన పోషకాహారాన్ని అందుబాటులోకి తీసుకురావడమే మా లక్ష్యం’ అని పేర్కొన్నారు.
నివేదికలోని కొన్ని అంశాలు..
మార్నింగ్ విండో క్రేజ్ (ఉదయం 7 నుంచి 11 గంటలు): దేశవ్యాప్తంగా ప్రోటీన్ ఉత్పత్తుల ఆర్డర్లు అత్యధికంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల మధ్యే వస్తున్నాయి. అంటే ప్రజలు తమ బ్రేక్‌ఫాస్ట్‌ను ప్రోటీన్-రిచ్‌గా మార్చుకోవడానికి ఇష్టపడుతున్నారు.
నంబర్ 1 కాంబో: భారతీయుల ఇన్‌స్టామార్ట్ కార్ట్‌లో అత్యధికంగా ఆర్డర్ అవుతున్న నంబర్ వన్ హెల్తీ కాంబో.. కోడిగుడ్లు, పనీర్. వీటి తర్వాత చికెన్, శనగలు ఉన్నాయి.
2025 నాటి డేటా ప్రకారం.. యాప్‌లో అత్యధికంగా వెతికిన ప్రోటీన్ పదం ‘పీనట్ బటర్’. రెండో స్థానంలో గ్రీక్ యోగర్ట్ నిలిచింది.
చెన్నై యూజర్ రికార్డ్: ప్రోటీన్ డైట్ కోసం ఒక చెన్నై వినియోగదారుడు ఏకంగా రూ.2,71,385 ఖర్చు చేశాడు. ఇందులో ఎక్కువ భాగం పీనట్ ఆధారిత ప్రోటీన్ స్టేపుల్స్ ఉండటం విశేషం.
ట్రెండీ స్నాక్స్ వైపు మొగ్గు..
సాధారణ చిప్స్, స్నాక్స్ స్థానంలో ఇప్పుడు హెల్తీ ప్రత్యామ్నాయాల కోసం చూస్తున్నారు. ప్రోటీన్ యోగర్ట్, ప్రోటీన్ స్నాక్స్ (ప్రోటీన్ చిప్స్) కేటగిరీ ఏటా ఏకంగా 300 శాతం వృద్ధితో దూసుకుపోతోంది. యువత ఆకలి వేసినప్పుడు జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా ఇటువంటి హై-ప్రోటీన్ స్నాక్స్‌ను ఎంచుకుంటున్నారు.
సాంప్రదాయ ప్రోటీన్‌కు డిమాండ్
ఆధునిక మార్పులు వస్తున్నప్పటికీ మన దేశీయ పాతకాలపు ప్రోటీన్ వనరుల క్రేజ్ తగ్గలేదు. భారతీయ సాంప్రదాయ సూపర్ ఫుడ్స్ అయిన సోయా చంక్స్, సత్తు (వేయించిన శనగల పిండి)ల డిమాండ్‌లో కూడా 100 శాతానికి పైగా వృద్ధి కనిపించింది. మొత్తంగా చూస్తే.. భారతదేశంలో క్విక్ కామర్స్ విప్లవం వస్తువులను వేగంగా డెలివరీ చేయడంతోపాటు ప్రజలు మరింత ఆరోగ్యకరమైన, సమతుల్యమైన జీవనశైలిని అలవర్చుకోవడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ప్రోటీన్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిపోయిన బంగారం ధరలు


