breaking news
Lady Detective
-
తొలి లేడీ డిటెక్టివ్..! ఆఖరికి పెళ్లి గురించి కూడా...
మనం టీవీల్లో, సినిమాల్లో.. ట్రెంచ్కోట్ ధరించి, ఆధారాలను వెంబడిస్తూ..నేరస్థులను బయటపెట్టే డిటెక్టివ్‌లను చూశాం, ఆయా కథలు, నవలలు చదివాం. కానీ మహిళా డిటెక్టివ్‌ల గురించి వినడం గానీ, తెరపై చూడటం గానీ అత్యంత అరుదు. కానీ ఈమె సమస్యను బట్టి వేషం మారుస్తూ.. ఎన్ని కేసులు పరిష్కరించారో తెలిస్తే షాకవ్వుతారు. మహిళలు అత్యంత అరుదుగా వచ్చే ఈ వృత్తిలో కొనసాగుతూ.. నిలదొక్కుకోవడమే గాక మంచి పేరు తెచ్చుకున్నారు. ఒక్కోసారి నిజాలను వెలికి తీసినా.. బయటకు చెప్పకుండా..కౌన్సలర్లుగా వ్యవహరిస్తుంటుంది కూడా. ఆ మహిళే..రజనీ పండిట్. దాదాపు నాలుగు దశాబ్దాలుగా నిశబ్దంగా తనపని తాను చూసుకుంటూ పోతూ..తన వృత్తిని నిర్మించుకున్నారామె. అలా ఆమె భారతదేశపు తొలి మహిళా ప్రైవేట్ డిటెక్టివ్‌గా మంచి పేరు తెచ్చుకుంది. ప్రమాదం అనేది ఆమె ఉద్యోగంలో అంతర్భాగం. రచయిత్రి నటి, రచయిత్రి ఛవి మిట్టల్‌తో ఒక పాడ్‌కాస్ట్‌లో రజనీ మాట్లాడుతూ..తన వృత్తి గురించి ఇలా చెప్పుకొచ్చారు. దాదాపు 40 ఏళ్లుగా దేశవ్యాప్తంగా వేలాది కేసులను చేధించినట్లు తెలిపారు. అయితే తనను తాను స్వతాహాగా డిటెక్టివ్ అవ్వాలని ఎన్నడు అనుకోలేదని చెప్పుకొచ్చారామె. ఆ ఒక్క కేసు ఆమె జీవితాన్నే మార్చేసింది..కాలేజీ రోజుల్లో, ఇంట్లో విలువైన వస్తువులు పదేపదే మాయమవుతుండటంతో ఒక క్లాస్మేట్ సహాయం కోసం ఆమె వద్దకు వచ్చింది. ఎప్పుడూ ఆసక్తిగా ఉంటూ, మనుషులను అర్థం చేసుకోవడంలో నేర్పరి అయిన రజనీ, స్వయంగా ఆ విషయాన్ని పరిశీలించి..చివరికి దొంగను గుర్తించింది. కేవలం ఒక సాధారణ ఆసక్తిగా మొదలైనది నెమ్మదిగా ఒక అసలైన వృత్తిగా మారింది. తాను 1986లో, కేవలం 24 ఏళ్ల వయసులో, సొంత ఏజెన్సీ ‘రజనీ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో’ను ప్రారంభించినట్లు తెలిపారు. దీన్నే తర్వాత ‘రజనీ పండిట్ డిటెక్టివ్ సర్వీసెస్’ అని పేరు మార్చారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే పనిజీవితం ప్రారంభమైందని అన్నారు. అందువల్లే పెళ్లి కూడా చేసుకోలేకపోయానని చెప్పారు. కనీసం కుదురుగా కూర్చోని టీవి కూడా చూడలేనని అన్నారామె. ఎందుకంటే పదే పదే ఫోన్ మోగుతూనే ఉంటుందని అన్నారు. కేసుకి అనుగుణంగా మారిపోతా..!ఒక కేసు దర్యాప్తు కోసం తనను తాను పూర్తిగా మార్చుకోవడానికి సదా సిద్ధంగా ఉండాలని అదే తన విజయాలకి ప్రధాన కారణమని తెలిపారు. ఇన్నేళ్లలో పనిమనిషిగా, వీధి వ్యాపారిగా, అంధురాలిగా, మానసిక అస్థిరత ఉన్న మహిళగా ఇలా ఎన్నో రకాలుగా నటించినట్లు వెల్లడించారు. తాను చేపట్టిన తొలి అత్యంత ప్రమాదకరమైన కేసులో ఒకటి..అనుమానితురాలి ఇంట్లో పనిమనిషిగా నిశసించడం అని చెప్పుకొచ్చారు. జంట హత్యల కేసును ఛేదించడానికి ఆరు నెలల పాటు పనిమనిషిగా మారువేషంలో ఉండి ఆధారాలు సేకరిస్తుండగా..ఒకరోజు కెమెరా క్లిక్ మనడంతో వెంటనే నిందితురాలు తనను అనుమానించడం మొదలు పెట్టిందన్నారు. తను అటాక్ చేసే లోపలే ఆధారాలన్నీ పక్కాగా సేకరించి ఆమెను కటకటాల వెనక్కి పంపినట్లు తెలిపారు. కొన్ని కేసులు పిల్లలు చెడు వ్యసనాలకు సంబంధించినవి, విచ్చినమైన సంబంధాలతో బాధపుడుతున్న కుటుంబాలు వంటి కేసులను కూడా చేధించారు. అలా ఆ క్రమంలో కౌన్సలర్లగా కూడా మారతామని అంటున్నారామె. అయితే వివాహేతర సంబంధాన్ని కోర్టులో నిరూపించడం చాలా కష్టమని చెప్పారు. అందుకే తాము టెడ్డీ బేర్లలో దాచిన స్పై కెమెరాలు, పెన్నులలో అమర్చిన రహస్య కెమెరాలు, బటన్ కెమెరాలు, బల్లల కింద అమర్చిన రహస్య మైక్రోఫోన్‌లపై ఆధారపడుతుంటామని చెప్పారు. విచిత్రంగా తాను కూడా నేరం నుంచి తప్పించుకోలేకపోయానన్నారు. ఎందుకంటే తన పుస్తకాన్ని తర ప్రమేయం లేకుండానే అక్రమంగా కాపీ చేసి మార్కెట్లో అమ్మారని రజనీ వెల్లడించారు. తన కేసుని పరిష్కరించే ప్రయత్నం చేస్తుండగా..బెదరింపులు కూడా వచ్చాయన్నారు. అయితే తాను న్యాయ మార్గాన్ని ఎంచుకుని గెలిచినట్లు తెలిపారు. ఏ నిజం బయటపెట్టాలో తెలియాలి..రహస్యాలను వెలికి తీసే వృత్తే అయినప్పటికీ..ప్రతి నిజాన్ని బయటపెట్టాల్సిన అవసరం లేదని అంటోందామె. ఎందుకంటే ఆ నిజాన్ని బయటపెడితే కలిగే పరిణామాలపై అవగాహన ఉండాలని నొక్కి చెబుతోంది. ఈ వృత్తి కేవలం దొంగలను, నేరస్తులను పట్టుకోవడమే కాదు, మానవ ప్రవర్తనను అర్థం చేసుకోవడంపై పట్టు అందిస్తుందట. అందువల్ల కొన్ని కేసులు చేధించే క్రమంలో కుటుంబాలను కాపాడేలా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తానని అన్నారు. ఇంతలా తిరుగులేని లేడి డిటెక్టివ్‌గా ఏకంగా 80 వేలకు పైగా కేసులను చేధించిన మీరు తెరపై మీ పాత్రరె పోషించగలరా అని ప్రశ్నించగా..వెంటనే ఆమె నవ్వుతూ..నటించొచ్చేమో కానీ, నిజ జీవితంలో డిటెక్టివ్‌గా మారడం అనేది అంత ఈజీ కాదు. అలాగే ఆయా కేసు భావోద్వేగ భారాన్ని మోయడం అంత సులభం కాదని కూడా అన్నారు. ఇవన్నీ పుస్తకాల నుంచో, సినిమాల నుంచో నేర్చుకునేవి కాదని అన్నారామె. చివరగా డిటెక్టివ్‌గా రాణించాలంటే చక్కటి ధైర్యం, సహనం, సత్యాన్ని కనుగొనే వరకు వదలని పట్టుదల చాలా అవసరమంటూ తన సంభాషణను ముగించారు. (చదవండి: ఐఐటీ స్టూడెంట్ కాదు.. కానీ ఏకంగా రూ..4.8 లక్షలు..! కనీసం బీటెక్ కూడా..) -
లేడీ జేమ్స్‌బాండ్
ఆడవాళ్లకి ఆరాలు తీసే మనస్తత్వం ఉంటుందని జోకులేస్తుంటారు కొంతమంది. అయితే అది నవ్వాల్సిన విషయం కాదు, కామెంట్ చేయాల్సిన విషయం అంతకన్నా కాదు అంటారు రజనీ పండిట్. ఎందుకంటే ఆరాలు తీసే ఆ లక్షణమే ఆమె వృత్తిగా మారింది. ఆమెను డిటెక్టివ్‌గా మార్చింది. సెన్సేషనల్ లేడీ డిటెక్టివ్ అంటూ కితాబునిచ్చింది. ఎన్నో ప్రశంసలను, పురస్కారాలనూ తెచ్చిపెట్టింది. ముంబైలోని శివాజీ పార్క్‌కి దగ్గరలో ఉంది రజనీ పండిట్ ప్రైవేట్ డిటెక్టివ్ ఆఫీసు. ఎంతో క్లిష్టమైన కేసులకు సైతం అతి తక్కువ ఫీజు తీసుకుంటారు రజని. అందుకే ఆమెకు డిటెక్టివ్‌గానే కాక మంచి మనిషిగా కూడా పేరుంది. ఆవిడ ఓ సాహస కెరటం. తన పనితనం గురించి తెలుసుకోవాలంటే ఆవిడ రాసిన ఫేసెస్ బిహైండ్ ఫేసెస్, మాయాజాల్ అనే పుస్తకాలు చదివితే సరి! రజని పుట్టి పెరిగిందంతా మహారాష్ట్రలోని థానే జిల్లాలోనే. ఆవిడ తండ్రి ఓ సీఐడీ ఇన్స్పెక్టర్. ఆయన ప్రభావం రజని మీద చిన్ననాటనే పడింది. తండ్రి విచారణ జరిపే కేసులను ఆసక్తిగా పరిశీలించేవారు రజని. ఆయనను అడిగి మరీ కొన్ని విషయాలు తెలుసుకునేవారు. దాంతో ఆమెకి ఇన్వెస్టిగేషన్ పట్ల ఆసక్తి పెరిగిపోతూ వచ్చింది. ఆ ఆసక్తితోనే కాలేజీలో తన స్నేహితురాలి సమస్యను పరిష్కరించారామె. ఆ అమ్మాయి కొందరు చెడ్డ అబ్బాయిలతో తిరుగుతూ ఉండేది. ఎంత చెప్పినా వినేది కాదు. దాంతో అటెండర్ని అడిగి ఆ అమ్మాయి అడ్రస్ సంపాదించారు రజని. వాళ్ల ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో విషయం చెప్పారు. వాళ్లు నమ్మకపోతే తన సొంత డబ్బులతో ట్యాక్సీలో తీసుకెళ్లి మరీ ఆ అమ్మాయి చేసే పనులు చూపించారు. అప్పుడా అమ్మాయి తండ్రి ‘నువ్వు డిటెక్టివ్వా?’ అని అడిగాడు. ఆ ప్రశ్న రజని మనసులో బలంగా నాటుకుపోయింది. ఆమెను డిటెక్టివ్‌గా మార్చేందుకు దోహదపడింది. ఆ తర్వాత మరో మహిళ సమస్యను కూడా తన తెలివితేటలతో పరిష్కరించిన తర్వాత ఫుల్‌టైమ్ డిటెక్టివ్‌గా మారిపోవాలని నిర్ణయించుకున్నారు రజని. అడుగడుగునా సవాళ్లే... డిటెక్టివ్‌గా పని చేయడం అంత తేలికైన పని కాదు. ఒక్కో కేసు ప్రాణాల మీదకు తెచ్చేది. బెది రింపులు, వార్నింగులకు కొదువే లేదు. అయినా ఎన్నడూ వెనకడుగు వేయలేదు రజని. భయమనేది తన డిక్షనరీలోనే లేదంటారామె. భార్యను చంపా లనుకున్న భర్త ప్లాన్‌ను భగ్నం చేసినా... మరో పురుషుడితో సంబంధం పెట్టుకుని తన సొంత కొడుకునే కిడ్నాప్ చేసి, ఆపైన భర్తను డబ్బుకోసం బ్లాక్ మెయిల్ చేసిన భార్య పన్నాగాన్ని బయటపెట్టినా... సినిమా వాళ్ల అఫైర్ల కూపీ లాగినా... వ్యాపారవేత్తల మోసాలను బహిరంగపర్చినా... మిస్సింగ్ కేసుల మిస్టరీలు ఛేదించినా... హత్య కేసుల అంతు చూసినా... ఏం చేసినా పర్ఫెక్ట్గా చేశారు రజని. అనుకున్నదానికంటే వేగంగా ఉత్తమ ఫలితాలను అందించారు. అందుకే ఊహించనంత త్వరగా ఆమె పేరు దేశమంతా పాకిపోయింది. ఐదారు అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ‘లేడీ జేమ్స్‌బాండ్’ పేరుతో ఆమె మీద డాక్యుమెంటరీ సైతం తయారయ్యింది. నలభై ఏడేళ్ల వయసులో సైతం ఇప్పటికీ చలాకీగా తిరుగుతూ, చకచకా కేసుల్ని పరిష్కరించే రజని పనితనం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. తన దగ్గరకు వచ్చేవాళ్లందరి సమస్యలూ తీర్చడంలో సంతోషాన్ని పొందే రజని... తన సొంత సమస్యలు వృత్తికి అడ్డు కాకూడదనుకున్నారు. అందుకే తన వ్యక్తి గత జీవితానికి తక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం అల వాటు చేసుకున్నారు. చివరికి పెళ్లి సైతం వద్దను కున్నారు. అంత త్యాగం అవసరమా అని ఎవరైనా అంటే... ‘పెళ్లే జీవితం అని నేను అనుకోలేదు. పెళ్లిలోనే సంతోషం దొరకుతుందని నాకెప్పుడూ అనిపించనూ లేదు. కేసు సాల్వ్ చేసినప్పుడు కలిగే సంతోషం ముందు మిగతావన్నీ దిగదుడుపే నాకు’ అంటారామె మందహాసం చేస్తూ. నిజమే. పరులకు సాయపడటంలో సంతోషాన్ని వెతుక్కునేవారికి పర్సనల్ లైఫ్ ఎప్పుడూ ముఖ్యం కాదు... కాబోదు!!


