breaking news
New York Time Square
-
అమెరికాలో వెల్లివిరుస్తున్న 'భారతీయం'.. మునుపు ఎన్నడూ లేనంతగా!
ప్రస్తుతం అమెరికాలో దాదాపు 50 లక్షల మంది భారతీయులు ఉన్నారు అనటం కంటే కూడా అగ్రరాజ్యంలో మునుపు ఎన్నడూ లేనంతగా ఉనికి చాటుకొనేలా, అందరూ గుర్తించేలా మనవాళ్లు ఉంటున్నారని చెప్పాలి. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ స్వయంగా వైట్‌హౌస్‌లో దివాలి వేడుకలు చెయ్యటం, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా దివాలి వేడుకలలో పాల్గొనటం మనవాళ్ల ప్రాముఖ్యతను వెల్లడిస్తోంది. వైట్‌హౌస్‌లో దీపావళి... బైడెన్ ఆతిధ్యంపై భారతీయుల సంతోషం అమెరికా అధ్యక్షుడి నివాస భవనమైన శ్వేత సౌధం చరిత్రలోనే భారీస్థాయిలో నిలిచిపోయేలా అధ్యక్షుడు జో బైడెన్ దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. దీపావళి పండుగ వేళ వైట్‌హౌస్ దీపాల వెలుగులతో మెరిసిపోయింది. బైడెన్ దంపతులు ఈ సందర్భంగా నిర్వహించిన ‘దీపావళి రిసెప్షన్’కి 200 మందికి పైగా అతిథులు హాజరయ్యారు. ఈ సంబరాలలో పూర్తి భారతీయత కనిపించడం విశేషం. సాంస్కృతిక ప్రదర్శనలు కనువిందు చేశాయి. సితారిస్ట్ రిషబ్ శర్మ, ఎస్ఏ డ్యాన్స్ కంపెనీ ట్రూపు ఆధ్వర్యాన సాగిన ఆర్టిస్టుల డ్యాన్సులు, వారి పర్ఫామెన్స్ కట్టి పడేశాయి. గెస్టుల వస్త్ర ధారణ చూస్తే ఇండియాలోనే ఉన్నట్టు అనిపించేలా కనిపించిందని చెబుతున్నారు. దీపావళి సందర్భంగా జోబైడెన్ దంపతుల విశిష్ట ఆదరణను మరిచిపోలేమని యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అతుల్ కేశప్ వ్యాఖ్యానించారు. ఈ ఆతిథ్యాన్ని అందుకోవడం ఓ గొప్ప ప్రివిలేజ్ అని టీవీ ఏసియా సీఈఓహెచ్ఆర్ షా పేర్కొన్నారు. అలాగే ఆసియన్ అమెరికన్స్ పై గల అడ్వైజరీ కమిషన్ సభ్యుడు అజయ్ జైన్ భుటారియా .. దక్షిణాసియా వాసులను బైడెన్ ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో ఈ ఈవెంట్ నిరూపిస్తోందన్నారు. బైడెన్ ప్రభుత్వం 130 మందికి పైగా ఇండియన్ అమెరికన్లను ఉన్నత స్థానాల్లో నియమించిందని ఆయన చెప్పారు. అంతకు ముందు బైడెన్ దంపతులు అతిథులను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ.. ‘మీకు ఆతిథ్యమివ్వడాన్ని గౌరవంగా భావిస్తాను. శ్వేత సౌధంలో ఈ స్థాయిలో నిర్వహిస్తున్న తొలి దీపావళి ఇదే. మా వద్ద గతంలో కంటే ఇప్పుడు పెద్దసంఖ్యలో ఆసియా-అమెరికన్లు ఉన్నారు. దీపావళిని అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన వేడుకలుగా మార్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమెరికా చరిత్రలోనే తొలి ఆఫ్రికా-దక్షిణాసియా మహిళ కమలా హ్యారిస్ నేతృత్వంలోని నా కార్యనిర్వాహక వర్గం సమక్షంలో దీపాలను వెలిగించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు. అమెరికా వృద్ధిలో ఇండో అమెరికన్ల కృషి చాలా ఉందని బైడెన్ చెప్పారు. కరోనా సమయంలో సైతం ఇక్కడి ప్రవాస భారతీయులు దేశ సేవకే అంకితమయ్యారని ఆయన ప్రశంసించారు. వీరి కృషిని తాము సదా గుర్తుంచుకుంటామన్నారు. దేశం ఆర్థికంగా ఎదిగేందుకు తాము ప్రవాస భారతీయుల సేవలను ఎప్పుడూ ఉపయోగించుకుంటామన్నారు. దీపావళి వేడుకల సందర్భంగా హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు బైడెన్ శుభాకాంక్షలు తెలిపారు. ముగ్గురు ప్రత్యేక అతిథులు ఈ దీపావళి వేడుకలకు ముగ్గురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. ఈ ముగ్గురు యువ భారతీయ-అమెరికన్లను అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఆహ్వానించారు. దీని ద్వారా డిఫర్డ్ యాక్షన్ లీగల్ చైల్డ్‌హుడ్ అరైవల్స్ (డీఏఎల్‌సీఏ) పిల్లలకు సంఫీుభావం తెలుపుతున్న సందేశాన్ని ఆయన అందించారని భావిస్తున్నారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులతో కలసి అమెరికా వెళ్లి, అక్కడ నివసించడానికి తగిన పత్రాలు లేని పిల్లలు డీఏసీఎల్‌ఏలో ఉన్నారు. వీరిని ఎప్పుడైనా అమెరికా నుంచి బహిష్కరించే అవకాశం ఉంటుంది. డీఏఎల్‌సీఏ పిల్లల తరఫున పోరాడుతున్న ‘ఇంప్రూవ్ ద డ్రీమ్’సంస్థ వ్యవస్థాపకుడు దీప్ పటేల్‌తోపాటు పరీన్ మహత్రే, అతుల్య రాజ్‌కుమార్ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధ్యక్షుడు బైడన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తో కలసి దీపావళి వేడుకల్లో పాల్గొనడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చిన కమలా హ్యారిస్ అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ శుక్రవారం(అక్టోబర్ 28) నేవల్ అబ్సర్వేటరీలోని తన అధికారి నివాసంలో దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భారతీయ సంతతి వారు హాజరయ్యారు. అమెరికాలోని ప్రముఖ భారతీయులందరికీ కమలా హ్యారిస్ దంపతులు ఆతిథ్యమిచ్చారు. ఈ సందర్భంగా అధికారులు కమలా నివాసాన్ని దీపాలు, వివిధ రకాల లైట్లతో గొప్పగా అలంకరించారు. కమలా హ్యారిస్.. అతిథులతో కలిసి బాణాసంచా కాల్చారు. దీపావళి పండుగ గొప్పదనం విశ్వవ్యాప్తమైనదని వ్యాఖ్యానించారు. ‘అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఉపాధ్యక్షురాలిగా నేను వీటి గురించి ఆలోచిస్తుంటా. అయితే.. చీకటిని తరిమేసి వెలుగులను ఆహ్వానించే శక్తి మానవాళికి ఉందన్న దీపావళి లాంటి పండుగలు గుర్తు చేస్తుంటాయి’అని కమలా హ్యారిస్ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయ సంతతి వారి ప్రభావం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ఈ క్రమంలోనే దీపావళి పండుగ.. అమెరికాలో ముఖ్య వేడుకగా ప్రాముఖ్యం సంతరించుకుంది. డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీకి చెందిన కీలక నేతలు దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇక అమెరికాలోని వివిధ రాష్ట్రాల గవర్నర్ల అధికారిక నివాసాల్లోనూ దీపావళి వేడుకలు జరిగాయి. డొనాల్డ్ ట్రంప్ ఇంట్లో దీపావళి వేడుకలు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన స్వగృహం మార్ ఏ లాగోలో(ఫ్లోరిడా రాష్ట్రం) పలు భారతీయ సంఘాల ప్రతినిధులతో కలిసి దీపావళి వేడుకలు శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పలువురు భారతీయ అమెరికన్లతోపాటు రిపబ్లికన్ పార్టీ నాయకులు పలువురు పాల్గొన్నారు. తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమన, జగదీశ్ ప్రభలతోపాటు అనేక మంది తెలుగు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమెరికా వ్యాప్తంగా ఉన్న రిపబ్లికన్ హిందూ సమాఖ్య ప్రతినిధులను ఉద్దేశించి ట్రంప్ ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించిన శలభ్‌కుమార్, సతీష్ వేమన, విక్రమ్ కుమార్, హరిభాయ్ పటేల్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అనాదిగా చెడుపై మంచి ఎప్పుడూ విజయం సాధిస్తుందని, సమస్త మానవాళి శాంతి సౌభ్రాతృత్వంతో మెలగాలని ఆకాంక్షిస్తూ, దీప ప్రజ్వలనతో మొదలైన ఈ కార్యక్రమంలో పలు ప్రధాన విషయాలను ట్రంప్ ప్రస్తావించారు. భారతదేశం, అమెరికా దౌత్య సంబంధాలు.. పరస్పర సహాయ సహకారాలు ఉన్నత శ్రేణిలో కొనసాగాలని ఆకాంక్షించారు. అదే విధంగా తన 2016 ఎన్నికలలో తన వెన్నంటి ఉండి బలపరచిన రిపబ్లికన్ హిందూ సమాఖ్య నాయకత్వాన్ని, సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. రాబోయే కాలంలో ఈ సహకారం ఇలాగే అందించాలని విజ్ఞప్తి చేస్తూ, తమ పార్టీ అధికారంలోకి వచ్చి.. సమాఖ్య సభ్యులను తన ప్రభుత్వ కార్య నిర్వహణలో భాగస్వాములను చేస్తామని.. శలభ్ కుమార్‌ను తమ తరపు భారత రాయబారిగా నియమిస్తామని తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సానుకూల దృక్పధాన్ని అవలంభించి, సంయుక్తంగా టెర్రరిజం మూలాలను మట్టుబెడతామన్నారు. భారతీయులు శాంతి కాముకులని, ఎలాంటి పరిస్థితులలోఐనా కస్టపడి, సానుకూల దృక్పధంతో సాగే వారి స్వభావమే వారికి ప్రత్యేక గుర్తింపుని తెచ్చిపెట్టిందని, మంచి ఎక్కడున్నా అందరూ అవలంబించాలని, నేర్చుకోవాలని సూచిస్తూ.. విభిన్న వ్యక్తులు, భాషలు, ప్రాంతాలు, దేశాల సమాహారమే అమెరికా అని, ప్రతిభకు పట్టం కట్టే విధానంతో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తామని ఉద్ఘాటించారు. అదే విధంగా భారతీయుల పట్ల, హిందువుల సంస్కృతీ, సంప్రదాయాలపట్ల తనకు గౌరవమని.. వారి అపార ప్రతిభ పాటవాలు పరస్పరం ఇరుదేశాల అభివృద్ధికి తోడ్పడాలని అభిలషిస్తూ, భారత అమెరికా సంబంధాలు అత్యున్నత స్నేహపూర్వకంగా నిలిపేందుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతీయ సాంప్రదాయక విందు పలువురిని ఆకర్షించింది. పూర్తి సంప్రదాయ బద్దంగా అన్ని భాషల, రాష్ట్రాల వంటల రుచులను ప్రత్యేకంగా అతిధులకు అందించటం జరిగింది.. ఒక్కొక్క అతిథికి విందుకు సుమారు 85,000 రూపాయల వ్యయంతో ఏర్పాట్లు చేశారు. కాగా కార్యక్రమం నిర్వాహకులు, సీక్రెట్ సర్వీస్ అధికారులు పూర్తిగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేసిన తర్వాతనే అతిథులను ఈ వేడుకలకు అనుమతించారు. ఇలా వచ్చిన వారిలో కేవలం ఇద్దరు తెలుగు వారికి మాత్రమే ట్రంప్‌తో కలిసి ఫొటో దిగే అవకాశం లభించడం గమనార్హం. వారిలో తానా మాజీ అధ్యక్షుడు సతీష్ వేమనతోపాటు, జగదీశ్ ప్రభల కూడా ఉన్నారు. భారత్ అంటే ఎంతో అభిమానమన్న ట్రంప్ తన నివాసం ‘మార్-ఎ-లాగో’లో దీపావళి వేడుకలు నిర్వహించినందుకు అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. 2016 ఎన్నికల్లో రిపబ్లికన్ హిందూ కోఅలియేషన్ (ఆర్‌హెచ్‌సీ) సహకారంతోనే కీలకమైన ప్రాంతాల్లో 4 లక్షల మంది ఓటర్లు తమ పార్టీకి ఓటేసినట్లు ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఆర్ఎన్సీ, ఎన్ఆర్సీసీ, ఎన్ఎస్ఆర్సీ వంటి హిందూ కోఅలియేషన్లకు చైర్మన్‌గా షల్లీ కుమార్ (శలభ్ కుమార్)ను నియమించాలని ట్రంప్ ప్రతిపాదించారు. 2024లో తాను ప్రెసిడెంట్‌గా పోటీ చేస్తే ఆ సమయంలో తన హిందూ కోలియేషన్ విభాగం అధినేతగా షల్లీ కుమార్‌ను నియమిస్తానని చెప్పారు. ఆర్‌హెచ్‌సీ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థలోని నైపుణ్యాలను మెచ్చుకున్న ట్రంప్.. తాను అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైతే ఆర్‌హెచ్‌సీ సభ్యులను పరిపాలనలో భాగం చేస్తానని హామీ ఇచ్చారు. హిందూ హోలోకాస్ట్ స్మారకాన్ని తాను కూడా సందర్శిస్తానని, ఈ కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానిస్తానని అన్నారు. పాకిస్తాన్‌కు మిలటరీ ఆయుధాలు అమ్మకుండా కఠిన చర్యలు తీసుకుంటానని, ఎఫ్16 విమానాల అమ్మకాన్ని కూడా అడ్డుకుంటాన్నారు. చైనా దిగుమతులపై పన్నులు కొనసాగిస్తానని చెప్పారు. అలాగే షల్లీ కుమార్ రచిస్తున్న ‘చైనీస్ కాలనైజేషన్ ఆఫ్ అమెరికా 2049 అండ్ ది ఓన్లీ మ్యాన్ హు కెన్ స్టాప్ ఇట్’అనే పుస్తకానికి తన వంతు సహకారం చేస్తానని, ఆ పుస్తకం ‘ముందుమాట’ను రచిస్తానని ట్రంప్ మాటిచ్చారు. డీఏఎల్‌సీఏ చిన్నారులు దేశ బహిష్కరణకు గురికాకుండా కాపాడటానికి కృషి చేస్తానని, గ్రీన్‌కార్డుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. భారతదేశం, హిందువులు అంటే తనకు చాలా అభిమానమని చెప్పిన ట్రంప్.. ‘షల్లీ అండ్ ట్రంప్ సబ్సే అచ్ఛే దోస్త్.. అండ్ భారత్ అండ్ అమెరికా సబ్సే అచ్ఛే దోస్త్’ అంటూ తన ప్రసంగం ముగించారు. టెక్సాస్ గవర్నర్ ఇంట్లో దీపావళి వేడుకలు టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్, సతీమణి సిసిలియా దంపతులు టెక్సాస్ రాష్ట్ర రాజధాని ఆస్టిన్ పట్టణంలో తమ నివాస గృహంలో అక్టోబర్ 23న వైభవంగా దీపావళి వేడుకలు జరిపారు. ఆ వేడుకలకు టెక్సాస్ రాష్ట్రం నుంచి అనేక మంది భారతీయ ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సందర్భగా గవర్నర్ గ్రెగ్ ఎబ్బోట్ మాట్లాడుతూ.. ‘దీపావళి పండుగ ముందరి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకురావాల’ని అన్నారు. తానా మాజీ అధ్యక్షులు, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్ షిప్ కౌన్సిల్ అధ్యక్షులు ప్రసాద్ తోటకూర.. గవర్నర్ దంపతులకు అభినందనలు తెలిపారు. (క్లిక్ చేయండి: బ్రిటన్ ప్రధానిగా రిషి.. యూకేలో ప్రవాసీయుల ఖుషీ) న్యూయార్క్‌లో టైం స్క్వేర్ వద్ద దీపావళి వేడుకలు న్యూయార్క్ నగరం లోని కొందరు భారతీయ ప్రముఖులు కలిసి అక్టోబర్ 15న న్యూ యార్క్ నగర బొడ్డున వున్నా టైం స్క్వేర్ సెంటర్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. న్యూ యార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ముఖ్య అతిధిగా వచ్చి భారతీయ సంతతిని, భారతీయ సంస్కృతిని, పండుగలను అభినందించారు. 2023 నుంచి న్యూయార్క్ నగరంలోని అన్ని పబ్లిక్ స్కూల్స్‌కి దీపావళి పండుగ సందర్భంగా సెలవు ఉంటుందని ప్రకటించారు. తెలుగు వారిలో ప్రముఖులైన డాక్టర్ నోరి దత్తాత్రేయులుని లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సన్మానించారు. తెలుగు నాయకులు రాజేందర్ డిచ్పల్లి.. మేయర్ ఎరిక్ ఆడమ్స్కి అభినందనలు తెలిపారు. - వేంకట సుబ్బారావు చెన్నూరి అమెరికాలో ప్రచురితమయ్యే తెలుగు టైమ్స్ సంపాదకులు -
రామ మందిర నిర్మాణం: వ్యతిరేక నినాదాలు
న్యూయార్క్: ‘‘ఈ కార్యక్రమ నిర్వహణకు ఆగస్టు 5ను ఎంచుకోవడం కశ్మీరీలపై మరో దురాక్రమణ వంటిది. ప్రజాస్వామ్య భారతాన్ని హతమార్చేందుకు, ద్వేషాన్ని పెంపొందించేందుకు మతాన్ని ఉపయోగించడాన్ని ఖండిస్తున్నాం’’ అని కోలిషన్ అగైనెస్ట్ ఫాసిజం ఇన్ ఇండియా(సీఏఎఫ్‌ఐ- భారత్‌లో ఫాసిజం వ్యతిరేక కూటమి)కి చెందిన అనియా వ్యాఖ్యానించారు. హిందుత్వ శక్తులు, వారిని అనుసరించే ఇండో- అమెరికన్లు అధికార బలంతో రామ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని వేడుకలా నిర్వహించాయని, ఆ అధికారం ద్వేషాన్ని పెంపొందించడానికి, భారత్‌లోని ముస్లింలు, ఇతరత్రా వర్గాలపై దుందుడుకు చర్యలను మరింతగా ప్రేరేపిస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా కోట్లాది మంది ప్రజల కలను సాకారం చేస్తూ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బుధవారం అంకురార్పణ జరిగిన విషయం విదితమే. భారత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆగష్టు 5న ఇందుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. (భారత్‌లో లౌకికవాదం ఓడిపోయిన రోజు: ఒవైసీ) ఈ నేపథ్యంలో ప్రధాని హోదాలో మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావడాన్ని కొన్ని వర్గాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రధాని మోదీ చర్య లౌకిక భావనకు విరుద్ధం అంటూ ఎంఐఎం చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయోధ్య వివాదంలో బీజేపీ, సంఘ్‌పరివార్ సుప్రీంకోర్టుకు అసత్యాలు చెప్పారని ఆరోపించారు. అదే విధంగా బాబ్రీ మసీదును కూల్చివేసి ఆ ప్రదేశంలో మందిర నిర్మాణం చేపట్టడం సరికాదంటూ పలువురు మండిపడుతున్నారు. ఇలాంటి తరుణంలో న్యూయార్క్‌లో సైతం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. జమ్మూ కశ్మీర్ స్వయంప్రతిపత్తి కోల్పోయేలా ఆర్టికల్ 370ని రద్దు చేసి సరిగ్గా ఏడాది పూర్తైన నాడే రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయడం పట్ల ఇండియన్ అమెరికన్ ముస్లిం, హక్కుల సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ‘‘మనుషుల ప్రాణం కంటే వేడుకలే ముఖ్యమా, కశ్మీరీలకు హక్కులు లేవా, ముస్లింలపై దాడులు ప్రోత్సహించేలా వ్యవహరించారు’’ అంటూ మండిపడుతున్నాయి.(శతాబ్దాల ఎదురుచూపులు ఫలించాయి) అదే విధంగా అమెరికన్ ఇండియన్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ రామ మందిర నిర్మాణ భూమి పూజను పురస్కరించుకుని వేడుకలు నిర్వహించడం పట్ల భగ్గుమంటున్నాయి. ఈ మేరకు ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్‌స్క్వేర్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ అనుకూల, వ్యతిరేక వర్గాల నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిందని ది వైర్ నివేదించింది. ఈ మేరకు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, ది కౌన్సిల్ ఆఫ్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, పెరియార్ ఇంటర్నేషనల్ యూఎస్ఏ వంటి పలు సంస్థలు భారత ప్రధాని చర్యను విమర్శిస్తూ నిరసన తెలిపినట్లు వెల్లడించింది. భారత్‌లో మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు తమతో చేతులు కలపాల్సిందిగా కోరడం సహా లౌకిక భావనతో నిండిన భారతే నిజమైన ఇండియా అంటూ వివిధ ప్లకార్డులు ప్రదర్శించినట్లు తెలిపింది.(కశ్మీర్ ఓ నివురుగప్పిన నిప్పు) కాగా అయోధ్య రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో భారత సర్వోన్నత న్యాయస్థానం గతేడాది నవంబరులో తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. వివాదానికి కారణమైన 2.77 ఎకరాల భూమి రాంలల్లాకు చెందుతుందని పేర్కొన్న సుప్రీంకోర్టు.. అయోధ్యలోనే మసీదు నిర్మాణానికై సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని ఆదేశించింది. ఈ క్రమంలో అయోధ్య నుంచి 18 కి.మీల దూరంలో లక్నో హైవే సమీపంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు స్థలం కేటాయించింది. -
నా సొంత ఖర్చుతో ఏర్పాటు చేశా.. టీడీపీపై ఫైర్
సాక్షి, విజయవాడ: న్యూయార్క్ నగరంలోని టైమ్స్‌స్క్వేర్‌లో ఇచ్చిన ప్రకటన తన సొంత ఖర్చులతో ఏర్పాటు చేసిందని.. ఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని నార్త్ అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ స్పష్టం చేశారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందేశాన్ని ప్రవాసాంధ్రులకు తెలియజేశానని పేర్కొన్నారు. తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఇటువంటి మంచి ప్రయత్నంపై కూడా దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుందని ధ్వజమెత్తారు. ధర్నాల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేసింది గత చంద్రబాబు ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన టీడీపీ.. ప్రస్తుతం న్యూయార్క్ టైమ్స్‌స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. (న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో ముఖ్యమంత్రి జగన్ సందేశం ) కాగా కోవిడ్-19(కరోనా వైరస్)విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్ మంగళవారం ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో’ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాట్ల ద్వారా తన సందేశాన్ని వినిపించిన విషయం తెలిసిందే. అమెరికా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అధైర్యపడొద్దని ప్రవాసాంధ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో టీడీపీ సోషల్‌మీడియాలో దుష్ప్రచారానికి తెరలేపింది. ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన పండుగాయల రత్నాకర్ టీడీపీ తీరుపై మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ... ‘‘కరోనా వ్యాప్తి నియంత్రణ, నివారణ కోసం ఏపీ ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు వైరస్ సోకిన వారిని గుర్తించడం మొదలు, వారికి మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు ప్రపంచంలోనే ఉత్తమ విధానాలను అనుసరిస్తోంది. అదే సమయంలో ప్రజల నిత్యావసరాలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం సమర్ధ చర్యలను తీసుకుంటోంది. ఇక.. అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులకు మన రాష్ట్రంలోని వారి కుటుంబాల బాగోగుల పట్ల ఆందోళన సహజం. వారలా ఆందోళన చెందకూడదన్నదే సీఎం జగన్ ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వం వారికి తోడుగా ఉందని ధైర్యం చెప్పేందుకు నిండు మనసుతో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందుకే నా సొంత ఖర్చుతో న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ప్రకటన ఏర్పాటు చేశాను. కానీ టీడీపీ ఇక్కడ కూడా తన వక్రబుద్ధిని ప్రదర్శించింది. స్క్వేర్ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తోంది. సొంత మనుషులకు, అనుకూల మీడియాకు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టిన టీడీపీ గురించి అందరికీ తెలుసు. చంద్రబాబుకు పబ్లిసిటీ పిచ్చి ప్రజలకు తెలిసిందే. అందుకే టీడీపీ ఐదేళ్ల దోపిడీపై విసుగుచెందిన ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. అయినా మీరు మారలేదు. ఎలాంటి ఆధారాల్లేకుండా నా పై దుష్ప్రచారం చేస్తున్నారు. నా సొంత డబ్బులు ఖర్చుపెట్టాను. సందేహం ఉన్నవారు మందుకొస్తే నివృత్తి చేస్తాను’’అని చురకలు అంటించారు. ఈ విషయంలో ప్రభుత్వంపై విష ప్రచారానికి పూనుకున్నవారిపై చట్టప్రకారం ముందుకెళ్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ డిసీజ్ కోవిడ్ –19 రెగ్యులేషన్, 2020, విపత్తు నిర్వహణ చట్టం, 2005లోని 54వ సెక్షన్, ఐపీసీ సెక్షన్ 505 కింద వారు శిక్షార్హులు అని పండుగాయల రత్నాకర్ పేర్కొన్నారు. -
అధైర్యపడొద్దు .. నేనున్నా
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో అమెరికాలో ఉన్న తెలుగువారంతా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారు. అమెరికా ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని, అధైర్యపడొద్దని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రఖ్యాత ‘న్యూయార్క్ టైమ్ స్క్వేర్‌లో’ ప్రత్యేక స్క్రీన్ ఏర్పాట్ల ద్వారా సీఎం సందేశాన్ని వినిపించారు. ► ఏపీలో ఉన్న మీ కుటుంబసభ్యుల గురించి కలత చెందవద్దు. మా ప్రభుత్వం వారి ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కోవిడ్– 19 నివారణకు ప్రభుత్వ యంత్రాంగం అంతా నిరంతరం శ్రమిస్తోంది. ► ఎక్కడ ఏ చిన్న ఘటన వెలుగులోకి వచ్చినా ప్రభుత్వం వెంటనే స్పందించి ఉత్తమ వైద్యం అందిస్తోంది. తమ వారి కోసం ప్రవాసాంధ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ► ప్రవాసాంధ్రులకు భరోసా కల్పిస్తూ టైమ్ స్క్వేర్‌లో ముఖ్యమంత్రి జగన్ సందేశం ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోందని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రత్నాకర్ పండుగాయల తెలిపారు. -
న్యూయార్క్ టైమ్‌స్క్వేర్‌లో ఏపీ సీఎం వీడియో సందేశం
-
పోలీసులకు స్పైడర్ మాన్ పంచ్
ఓవర్ యాక్షన్ చేసిన స్పైడర్ మాన్కు అమెరికా పోలీసులు కళ్లెం వేశారు. అయితే అతగాడు నిజమైన స్పైడర్ మాన్ కాదండోయ్. అతడిలా దుస్తులు వేసుకున్నాడంతే. అక్కడితో ఊరుకోకుండా మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు పోలీసులపై తన ప్రతాపం చూపాడు. న్యూయార్క్ టైమ్ స్వ్కేర్ వద్ద చోటుచేసుకున్న ఘటన గురించి న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది. స్పైడర్ మాన్ వేషంలో ఉన్న వ్యక్తిని జూనియర్ బిషప్(25)గా గుర్తించారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద తనతో ఫోటో దిగేందుకు వచ్చిన మహిళతో బిషప్ గొడవకు దిగాడు. స్పైడర్ మాన్ వేషంలో ఉన్న అతడిని పోలీసులు పట్టుకునేందుకు ప్రయత్నించగా పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఓ పోలీసు ముఖానికి గాయాలవడంతో అతడికి న్యూయార్క్ మెడికల్ సెంటర్ లో చికిత్స అందించారు. న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద వివిధ వేషాలు వేసుకుని విరాళాలు సేకరించడం సాధారణం. పర్యాటకుల పట్ల కొంత మంది అతిగా ప్రవర్తించి జైలు పాలవుతున్నారు. నెల క్రితం ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మరో స్పైడర్ మాన్ జైలు పాలయ్యాడు.