గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా? | Funday Kids Special Story On Lion Cure Power Of Mind Moral Story | Sakshi
Sakshi News home page

గతం గతః! ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందా?

Sep 6 2026 2:20 PM | Updated on Sep 6 2026 2:51 PM

Funday Kids Special Story On Lion Cure Power Of Mind Moral Story

ఫండే

పిల్లల కథ

క అడవికి రాజు సింహం. సింహం అంటేనే గజగజలాడే భయం. కానీ, ఇప్పుడు ఆ మృగరాజు ఒక చీకటి గుహలో దీనంగా పడి ఉంది. కొద్దిరోజుల కిందటే తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒక క్రూరమైన పులితో చేసిన పోరాటంలో సింహం తీవ్రంగా గాయపడింది. ఆ గాయాలు మానినా, ఆనాటి భయంకరమైన దృశ్యాలు సింహం మనసును వదలడం లేదు.

రాజవైద్యుడైన ఎలుగుబంటి ఎన్ని ఔషధాలు ఇచ్చినా ప్రయోజనం లేకపోయింది. సింహం నిరాశతో, ‘నా పరాక్రమం ముగిసింది మిత్రమా! ఈ గాయాలే నా మరణానికి దారి తీస్తాయి. నేను మళ్ళీ గర్జించలేను.’ అంటూ నిట్టూర్చింది.
అదే సమయంలో, పొరుగు అడవి నుంచి తన మిత్రుడైన ఏనుగును కలవడానికి ఒక కోతి వచ్చింది. ఏనుగు తన రాజు ఆరోగ్య పరిస్థితిని వివరించగా, అంతా విన్న కోతి గంభీరంగా ఇలా అంది: ‘మిత్రమా! మృగరాజుకు ఇప్పుడు కావాల్సింది మూలికల వైద్యం కాదు, మానసిక వైద్యం!’

ఏనుగు ఆశ్చర్యపోయి, ‘వైద్యం గురించి నీకు ఇవన్నీ ఎలా తెలుసు?’ అని అడిగింది. అప్పుడు కోతి తన గతాన్ని వివరిస్తూ, ‘నేను ఒకప్పుడు గొప్ప వైద్యురాలిని. కానీ, ఒక చిన్న పొరపాటు వల్ల ఒక జీవి ప్రాణం పోయింది. ఆ అపరాధ భావంతో అప్పటి నుండి వైద్యం చేయడమే మానేశాను. ఎవరికీ ఈ విషయం చెప్పలేదు.’ అని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పింది.
ఏనుగు వెంటనే కోతి భుజంపై తొండం వేసి, ‘మిత్రమా! గతాన్ని తలచుకుంటూ కూర్చుంటే ప్రయోజనం లేదు. మన పొరపాట్ల నుంచే మనం పాఠాలు నేర్చుకోవాలి. ఇప్పుడు సింహాన్ని కాపాడటం నీ బాధ్యత. నీలో నిద్రాణమైన వైద్యుడిని నిద్రలేపు!’ అని ప్రోత్సహించింది.

ఏనుగు మాటలతో కోతిలో ఆత్మవిశ్వాసం పెరిగింది. కోతి, ఏనుగు కలిసి సింహం గుహకు వెళ్లాయి. అవి రాజవైద్యుడు ఎలుగుబంటికి విషయం చెప్పాయి. ఎలుగుబంటి సంబరపడి, మృగరాజుకు వైద్యం చేయటానికి కోతిని అనుమతించింది. కోతి సింహాన్ని పూర్తిగా పరీక్షించి ఒక నిర్ణయానికి వచ్చింది. తనకు కావలసిన మూలికలు సేకరించడానికి గుహ బయటకు వెళ్ళింది.
ఆ సమయంలో ఏనుగు ఇలా అంది: ‘మృగరాజా! గతం గతః. మీ పరాక్రమాన్ని మళ్ళీ చాటే సమయం వచ్చింది. ఈమె సామాన్యమైన కోతి కాదు, గొప్ప వైద్యురాలు.’

మూలికలు సేకరించి తిరిగి గుహలోకి వచ్చిన కోతి, సింహం కళ్ళలోకి సూటిగా చూస్తూ, ‘రాజా! మీ వ్యాధి మీ దేహంలో లేదు, మీ ఆలోచనల్లో ఉంది. నాడు మీరు పులిని తరిమికొట్టినప్పుడు తగిలిన ఈ గాయాలు మీ వీరత్వానికి సజీవ సాక్ష్యాలు! అవి మిమ్మల్ని భయపెట్టకూడదు, మీ గుండెను మరింత బలంగా మార్చాలి.’ అని నొక్కి చెప్పింది. అనంతరం మూలికలతో ఒక లేహ్యం తయారుచేసి సింహానికి తాగించింది.

ఆశ్చర్య కరంగా, మరుసటి రోజు ఉదయానికే మృగరాజు తన నిస్సత్తువను వదిలి ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు. అడవి మొత్తం దద్దరిల్లేలా గర్జించాడు! నిజానికి కోతి ఇచ్చిన ఆ ‘మందు’ కేవలం తీపి పండ్ల రసం మాత్రమే. సింహం రోగం నయం కావడానికి కారణం ఆ రసం కాదు; కోతి తన మనసులో నింపిన ధైర్యం, గతాన్ని మర్చిపోవాలనే సంకల్పం మాత్రమే!

సింహం తన తప్పు తెలుసుకుంది. ఆలోచన మారితే ఆరోగ్యం మారుతుందని గ్రహించింది. తనను మళ్ళీ కర్తవ్యోన్ముఖుడిని చేసిన కోతిని ఘనంగా సత్కరించి, తన ఆస్థాన వైద్యురాలిగా నియమించుకుంది. అలాగే కోతిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన ఏనుగును తన రాజ సలహాదారునిగా నియమించుకుంది. రాజవైద్యుడు ఎలుగుబంటి కూడా వారి సమయస్ఫూర్తిని చూసి మురిసిపోయాడు.

హితవచనం..
అసంవిభాగీ దుష్టాత్మా కృతఘ్నో నిరపత్రపః
తాదృగ్నరాధిపో లోకే వర్జనీయో నరాధిప
ఇవ్వవలసిన వాళ్లకు ఇవ్వనివాడు, దుష్టబుద్ధి, కృతజ్ఞత లేనివాడు, సిగ్గులేనివాడు అయిన రాజును పరిత్యజించాలి.
- ముద్దు హేమలత

ఇవీ చదవండి: బెండకాయ వండకూడదట.. నీళ్లు చల్లకూడదట.. ఎందుకో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement