మూత్ర పరీక్షలు నార్మల్‌గానే ఉన్నా..ఎందుకు ఆ సమస్య? | Health Tips: Vaginal Yeast Infection: Causes, Symptoms And Treatment | Sakshi
Sakshi News home page

మూత్ర పరీక్షలు నార్మల్‌గానే ఉన్నా..ఎందుకు ఆ సమస్య?

Sep 6 2026 3:16 PM | Updated on Sep 6 2026 3:47 PM

Health Tips: Vaginal Yeast Infection: Causes, Symptoms And Treatment

నా వయసు ముప్పై ఒకటి. యూరిన్‌కి వెళ్లేటప్పుడు చాలా మంటగా, దురదగా ఉంటుంది.  ఆ ప్రాంతంలో చర్మం రంగు మారినట్లు కనిపిస్తోంది. మూత్ర పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాలు సాధారణంగానే వచ్చాయి. ఇది సాధారణమేనా?
– స్వప్న, కర్నూలు. 

మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే, యోని బయట భాగంలో చర్మానికి సంబంధించిన చికాకు లేదా వాపు ఉండే అవకాశం ఉంది. యోని చుట్టూ ఉండే చర్మం, పెదవుల వంటి భాగాలు, ఇతర సున్నితమైన ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్‌, అలర్జీ లేదా చర్మ సమస్యల వల్ల మార్పులు రావచ్చు. 

ఈ ప్రాంతంలో వాపు లేదా చికాకు ఏర్పడినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మంటగా అనిపించవచ్చు. మూత్ర పరీక్షలు సాధారణంగా వచ్చినా, సమస్య యోని బయట భాగంలోని చర్మానికి సంబంధించినదై ఉండవచ్చు. అందువల్ల స్త్రీల వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. వైద్యులు అవసరమైతే అంతర్గత పరీక్ష చేసి సమస్యను గుర్తిస్తారు. మీరు ఇటీవల ఏవైనా యాంటీబయోటిక్‌ మందులు లేదా ఇతర ఔషధాలు వాడారా, గతంలో అలర్జీలు, ఉబ్బసం వంటి సమస్యలు ఉన్నాయా అనే వివరాలను కూడా అడుగుతారు. 

వేడిమి, తేమ, ఎక్కువగా చెమట పట్టడం వల్ల కూడా ఆ ప్రాంతంలో దురద, మంట పెరగవచ్చు. మధుమేహం, థైరాయిడ్‌ సమస్యలు, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపించవచ్చు. కొన్నిసార్లు యోనిలో లేదా బయట ఉపయోగించే క్రీములు, లోషన్లు కూడా అలర్జీకి కారణం కావచ్చు. అందువల్ల వైద్యుల సలహా లేకుండా ఏ మందు లేదా క్రీమునూ ఉపయోగించకండి. అవసరాన్ని బట్టి యోని నుంచి నమూనా తీసి పరీక్ష చేస్తారు. 

ఇన్ఫెక్షన్‌  ఉందా లేదా తెలుసుకోవడానికి రక్త పరీక్షలు, చక్కెర స్థాయిలు, థైరాయిడ్‌ పరీక్షలు కూడా చేయవచ్చు. కొన్ని ప్రత్యేక చర్మ వ్యాధుల్లో కూడా ఇలాంటి దురద, మంట, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అన్ని పరీక్షల తర్వాత సమస్యను బట్టి క్రీములు, లోషన్లు లేదా ఇతర మందులను సూచిస్తారు. కొన్నిసార్లు చికిత్సను కొన్ని వారాలు లేదా ఎక్కువ కాలం కొనసాగించాల్సి రావచ్చు. శిలీంద్రాల వల్ల ఇన్ఫెక్షన్‌  ఉంటే, దానికి తగిన మాత్రలు, పూతమందులు లేదా యోనిలో ఉపయోగించే ఔషధాలను సూచిస్తారు.చికిత్సతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి

యోని బయట భాగాన్ని శుభ్రమైన నీటితో కడుక్కోవాలి.

ఆ ప్రాంతాన్ని తేమ లేకుండా పొడిగా ఉంచుకోవాలి.

సువాసన సబ్బులు, పరిమళ ద్రవ్యాలు, డియోడరెంట్లు వాడకండి.

బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా, వదులుగా ఉండే పత్తి దుస్తులు వాడండి.

రోజంతా ప్యాడ్లు లేదా లోదుస్తుల్లో ఉపయోగించే పలుచటి రక్షణ పొరలను అనవసరంగా వాడకండి.

దుస్తులు ఉతికేటప్పుడు గాఢ సువాసన కలిగిన ద్రావకాలు ఉపయోగించకండి.

వైద్యుల సలహా లేకుండా క్రీములు లేదా ఇతర మందులు వాడకండి.

ఇలాంటి సమస్యలు కొన్నిసార్లు పూర్తిగా తగ్గడానికి సమయం పడుతుంది. అందువల్ల చికిత్స మధ్యలో ఆపకుండా, వైద్యులు సూచించిన విధంగా క్రమం తప్పకుండా పరీక్షలకు వెళ్లాలి. సమస్య తగ్గుతోందా లేదా, చికిత్సలో మార్పులు అవసరమా అనే విషయాన్ని వైద్యులు పరిశీలించి తదుపరి చికిత్సను నిర్ణయిస్తారు. 

డాక్టర్‌ భావన కాసు, గైనకాలజిస్ట్‌ – ఆబ్‌స్టెట్రీషియన్‌
హైదరాబాద్‌

(చదవండి:  మతిమరుపు నివారణ ఇలా..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement