సాక్షి, చెన్నై : జననాయకన్ సినిమా చూడడం వలన మెదడు చురుగ్గా, ఉత్సా హంగా పనిచేస్తుందని తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాకు, విద్యార్థులు చేపట్టిన ఆందోళనలకు సంబంధం లేదని తెలిపారు. తమిళనాడు సీఎం విజయ్ నటించిన జననాయకన్ చిత్రం గురువా రం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. మంత్రులు, టీవీకే ఎమ్మెల్యేలు ఈ చిత్రం వీక్షణ, ఇతర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం జేసీడీ ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక మార్పులు తేవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రజలు కోరుకునే మార్పులను తీసుకురావడానికి ముఖ్యమంత్రి ఎంతో పట్టుదలతో సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థుల పోరాటాన్ని జననాయకన్ సినిమా నీరుగార్చిందా? అని విలేకరులు ప్రశ్నించగా ‘ఈ చిత్రం ముందే ప్రకటించిన తేదీ ప్రకారం థియేటర్లలో విడుదలయ్యిందే తప్పా, విద్యార్థుల ఆందోళనలతో(నీట్) దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు.
జననాయగన్ సినిమా చూడడం వలన మెదడుకు చురుకుదనం, ఉత్తేజం వస్తాయన్నారు. ఇది విద్యార్థులు లేదా ప్రజల మెదడును బ్రెయిన్ వాష్ చేసే సినిమా కాదని, మాటల ద్వారా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాలకు ఎవరూ పాల్పడకూడదనే విషయంలో తాము ఎంతో శ్రద్ధతో ఉన్నామన్నారు. కాగా, సినీ నటి త్రిష తల్లి ఉమాకృష్ణన్ జననాయకన్ చిత్రం గురించి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మారింది. రోహిణి థియేటర్లో సినిమా చూసిన ఆమె చాలా ఆనందంతో వీక్షించామన్నారు. ఇది విజయ్ చివరి సినిమా కావడం ఎంతో బాధగా ఉందని, ఆయన్ను చాలా మిస్ అవుతున్నాం అని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


