breaking news
climate researchers
-
మోగుతున్న ఎల్ నినో ఘంటికలు
ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం భారతదేశంపై ఉండదని కొందరు వాతావరణ నిపుణులు అంచనా వేస్తుండగా, మరోవైపు నైరుతి రుతుపవనాల వేగం గణనీయంగా తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో వర్షాలు, పంటల సాగుకు నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకం. పసిఫిక్ మహాసముద్రం అత్యంత తీవ్రంగా వేడెక్కే దశలోకి ప్రవేశిస్తోంది. పసిఫిక్‌లో వేగంగా బలపడుతున్న ఎల్ నినోను వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా గమనిస్తున్నారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గతంలో ఎన్నడూ లేనంత అధిక స్థాయికి చేరుకోవడంతో, ఇండియాలో చాలా ప్రాంతాల్లో వర్షపాతం లోటు ఏర్పడుతుందని చెబుతున్నారు. మధ్య పసిఫిక్ మహా సముద్రంలో ఎల్ నినో పరిస్థితులను పర్యవేక్షించడానికి ‘నినో 3.4’అనే ప్రాంతాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు(ఎస్ఎస్టీ) వరుసగా 16వ రోజు కూడా కొత్త గరిష్ట స్థాయిని నమోదు చేసినట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్లైమేట్ రీఅనలైజర్ డేటా ప్రకారం.. నినో 3.4 జోన్లో సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.32 సెంటీగ్రేడ్‌కు చేరుకుంది. ఇది సాధారణం కంటే 1.6 సెంటీగ్రేడ్ నుంచి 1.8 సెంటీగ్రేడ్ అధికం. ఈ ఏడాది ఇప్పటిదాకా ఇదే అత్యధికం కావడం గమనార్హం. చరిత్రలోనే అత్యంత ప్రతికూల వాతావరణ ఘటనలలో ఒకటిగా నిలిచిన 2015–16 నాటి సూపర్ ఎల్ నినో’ప్రారంభ దశల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇప్పుడు కూడా నమోదవుతున్నాయి. సాధారణంగా ఏడాదిలో తర్వాతి దశలో నియో 3.4 ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి, కానీ, ఈ ప్రాంతం అప్పటికే ఎల్ నినో పరిస్థితులకు సంబంధించిన స్థాయికి చేరుకుంది. పొడి వాతావరణమే పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్న ఎల్ నినో పరిస్థితులు భారత్‌కు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. మధ్య, తూర్పు పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల జలాలు అసాధారణంగా వేడెక్కడమే ఎల్ నినో ముఖ్య లక్షణం. ఈ వేడి జలాలు వాతావరణ ప్రసరణ సరళిని మార్చేస్తాయి. భారత ఉపఖండంలో రుతుపవన వర్షపాతానికి సహాయపడే వాకర్ సర్క్యులేషన్‌ను బలహీనపరుస్తాయి. దీని ప్రభావం ఇప్పటికే కనిపిస్తోంది. ప్రారంభంలో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా మొదలైనప్పటికీ.. నేడు అనేక ప్రాంతాల్లో వాటి కదలిక నిలిచిపోయింది. వర్షపాతం తగ్గింది. మేఘాలు ఏర్పడే విధానం అస్తవ్యస్తంగా మారింది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాలు సాధారణం కంటే చాలా పొడిగా ఉన్నాయి. వర్షాధార ఆధారిత వ్యవసాయ ప్రాంతాల్లోని రైతులు ఆందోళన చెందుతున్నారు. విత్తనాలు వేసే సమయంలో వర్షాలు ముఖం చాటేశాయి. వేగాన్ని కోల్పోతున్న రుతుపవనాలు ఎల్ నినో ఏర్పడినంత మాత్రాన కచ్చితంగా దేశంలో కరువు వస్తుందని చెప్పలేమని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు. హిందూ మహాసముద్ర డైపోల్, ప్రాంతీయ వాతావరణ వ్యవస్థలతో సహా ఇతర వాతావరణ కారకాలు కొన్నిసార్లు ఎల్ నినో ప్రభావాలను తగ్గించగలవు. అయితే.. ఈ ఏడాది పసిఫిక్ వేడెక్కే వేగం, తీవ్రత అధికంగా ఉండడంతో జూలై, ఆగస్టు నెలల్లో వాతావరణం ఎల్ నినో ప్రభావానికి ఎక్కువగా లోనయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శక్తివంతమైన ఎల్ నినో, సాధారణం కంటే తక్కువ స్థాయి రుతుపవనాల గమనంతో కూడిన సంవత్సరాల జాబితాలో 2026 కూడా చేరవచ్చు. పసిఫిక్ మహాసముద్రం రికార్డు స్థాయిలో వేడెక్కుతుండగా.. దాని ప్రభావంతో భారతదేశానికి అత్యంత అవసరమైన సమయంలోనే రుతుపవనాలు తమ వేగాన్ని, ప్రభా వాన్ని కోల్పోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మేఘాల జాడలేదు నైరుతి రుతుపవనాల సమయంలో ఆకాశంలో భారీ వర్షాన్ని మోసుకొచ్చే దట్టమైన మేఘాలు కనిపించడం పరిపాటి. ఈసారి అలాంటి మేఘాల జాడే లేదు. దేశంలోని చాలా ప్రాంతాల్లో మేఘాలు అసాధారణంగా పలుచగా కనిపిస్తున్నాయి. ఐరోపా, అమెరికా వాతావరణ సంస్థల తాజా ఉపగ్రహ చిత్రాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. దీర్ఘకాలం పాటు వర్షపాతం లోటు కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. యూరోపియన్ వాతావరణ ఉపగ్రహం మెటియోశాట్ ఐఓడీసీ, అమెరికాకు చెందిన ఎన్ఓఏఏ వాతావరణ ఉపగ్రహం, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు చెందిన ఇన్సాట్–3డీఎస్ మంగళవారం తీసిన చిత్రాలను గమనిస్తే మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో దట్టమైన మేఘాలు దాదాపుగా కనిపించడం లేదు. తేమతో కూడిన మేఘాలు విస్తృతంగా వ్యాపించడానికి బదులుగా చాలా ప్రాంతాలు పొడిగా దర్శనిమిస్తున్నాయి. బంగాళాఖాతం, తూర్పు భారతదేశంలో కొన్నిచోట్ల మాత్రమే అక్కడక్కడా పలుచటి మేఘాలు కనిపిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావం గణనీయంగా బలహీనపడిందని చెప్పడానికి ఇదే సంకేతమని నిపుణులు పేర్కొంటున్నారు. సాధారణంగా రుతుపవనాలకు ఊపునిచ్చే కీలక వాతావరణ పరిస్థితులు బలహీనంగా ఉన్నాయి. శాటిలైట్ పశ్చిమ హిందూ మహాసముద్రంపై విస్తృతమైన పొడి గాలిని సూచిస్తున్నాయి. దేశ వ్యవసాయోత్పత్తిలో గణనీయమైన వాటా కలిగిన మధ్య, పశ్చిమ, ద్వీపకల్ప భారతదేశ ప్రాంతాలతో కూడిన ‘రుతుపవన ప్రధాన ప్రాంతం’లో దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఇప్పటికే వెల్లడించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Climate Transparency Report 2022: భారత్‌ను దెబ్బతీసిన వాతావరణ మార్పులు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులు మన దేశాన్ని ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. 2021లో వడగాడ్పులకి భారత్‌కి 15,900 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని క్లైమేట్ ట్రాన్స్పరెన్సీ రిపోర్ట్–2022 వెల్లడించింది. పర్యావరణం, వాతావరణ మార్పులపై అధ్యయనం చేస్తున్న కొన్ని అంతర్జాతీయ సంస్థలు కలసికట్టుగా ఈ నివేదిక రూపొందించాయి. వ్యవసాయం, నిర్మాణం, తయారీ, సేవా రంగాల్లో ఈ నష్టం వాటిల్లింది. దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 5.4% నష్టం జరిగినట్టు ఆ నివేదిక వివరించింది. ఆ నివేదికలో ఏముందంటే..! ► మండే ఎండలతో గత ఏడాది దేశంలో 16,700 పని గంటలు వృథా అయ్యాయి. 1990–1999తో పోల్చి చూస్తే 39% పెరిగింది. ► 2016–2021 మధ్య కాలంలో తుపానులు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి 3.6 కోట్ల హెక్టార్లలో పంటలకి నష్టం వాటిల్లింది. దీంతో రైతన్నలు 375 కోట్ల డాలర్లు నష్టపోయారు. ► దేశంలో 30 ఏళ్లలో వర్షాలు పడే తీరులో ఎన్నో మార్పులు వచ్చాయి. వ్యవసాయం, అటవీ, మత్స్య ఆర్థిక ప్రభావాన్ని కనబరిచింది. ► 1850–1900 మధ్య కాలంతో పోల్చి చూస్తే భూ ఉష్ణోగ్రతలు 1.1 డిగ్రీల సెల్సియస్ పెరిగాయి ► వాతావరణ మార్పుల ప్రభావం అన్ని దేశాలతో పాటు భారత్‌పై రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. నిలువ నీడ లేని వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతోంది. ► వాతావరణ మార్పులతో జరుగుతున్న నష్టాన్ని అరికట్టాలంటే ప్రపంచ దేశాలు భూ ఉష్ణోగ్రతల్ని 2 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గించడానికి కృషి చేయాలి. 2015 పారిస్ ఒప్పందాన్ని అన్ని దేశాలు వినియోగించడమే దీనికి మార్గం. ► పర్యావరణ మార్పుల్ని కట్టడి చేయాలంటే మనం వాడుతున్న ఇంధనాలను మార్చేసి, పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు చేపట్టాల్సి అవసరం ఉందని ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో ఎర్త్ సైన్సెస్, క్లైమేట్ చేంజ్ డైరెక్టర్ సురుచి భద్వాల్ పేర్కొన్నారు. -
మరో 4 డిగ్రీలు పైపైకి..!
న్యూఢిల్లీ: భూగోళంలో వాతావరణ మార్పుల ప్రభావం భవిష్యత్తులో దేశంపై ప్రతికూలంగా ఉండనుందని కేంద్రం అంచనా వేసింది. ఈ శతాబ్దాంతానికల్లా దేశంలో ఉష్ణోగ్రతలు సరాసరిన 4.4 డిగ్రీలు పెరగనుండగా, వేసవి వడగాల్పుల తీవ్రత 3 నుంచి 4 రెట్లు పెరిగే అవకాశాలున్నాయని కేంద్ర భూ విజ్ఞాన శాఖ పేర్కొంది. సెంటర్ ఫర్ క్లైమేట్ రీసెర్చ్ వారి ఆ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ► కర్బన ఉద్గారాల కారణంగా 1901–2018 సంవత్సరాల మధ్య దేశంలో ఉష్ణోగ్రత సగటున 0.7 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగింది. ► 1986 –2015 మధ్య 30 ఏళ్ల కాలంలో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజుల్లో ఉష్ణోగ్రతలు 0.63, 0.4 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఈ శతాబ్దాంతానికి అత్యంత వేడి, అత్యంత చల్లని దినాల్లో ఉష్ణోగ్రతలు వరుసగా 4.7, 5.5 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగే అవకాశముంది. భవిష్యత్తులో అత్యంత వేడి, అత్యంత చల్లని రోజులు నమోదులో 55, 70 శాతం మేర పెరుగుతాయి. ► ఏప్రిల్–జూన్‌ల మధ్య దేశంలో సాధారణంగా సంభవించే వడగాడ్పుల తీవ్రత రాబోయే కాలంలో 3 నుంచి 4 శాతం మేర పెరగనుంది. వడగాల్పులు వీచే సమయం కూడా రెట్టింపు కానుంది. ఇది ముఖ్యంగా గంగా, సింధు నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. దేశంలో రుతు పవనాలకు కారణమయ్యే హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో 1951–2015 కాలంలో సగటున ఒక డిగ్రీ చొప్పున నమోదయింది. ఇది ప్రపంచ సగటు 0.7 కంటే ఎక్కువ. ► ఉత్తర హిందూ మహా సముద్రంలో సముద్ర మట్టాలు 1874– 2004 కాలంలో ఏడాదికి 1.06 నుంచి 1.75 మిల్లీమీటర్ల చొప్పున పెరిగాయి. 1986–2005 కాలంతో పోల్చి చూసుకుంటే శతాబ్దాంతానికి సుమారు 300 మిల్లీమీటర్లమేర పెరిగే అవకాశం. -
30వ తేదీకల్లా కేరళకు నైరుతి రుతుపవనాలు
న్యూఢిల్లీ: భారత ఉపఖండానికి వర్ష రుతువును తీసుకొచ్చే నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రెండు రోజులు ముందుగానే రానున్నాయి. మామూలుగా జూన్ 2వ తేదీన కేరళ తీరాన్ని తాకాల్సిన ఈ రుతుపవనాలు ఈ నెల 30వ తేదీకల్లా అక్కడకు వచ్చేస్తాయని వాతావరణ పరిశోధకులు చెప్తున్నారు. రానున్న మూడు, నాలుగు రోజుల్లో రుతుపవనాలు అండమాన్ సముద్రంపై విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే.. గత ఏడాది లాగానే ఈ ఏడాది కూడా ఎల్ నినో ప్రభావంతో సాధారణం కన్నా తక్కువ వర్షాలే కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.


