'ఉత్త'రాదే.. కరువు ముప్పు! | Rainfall deficit in northern Telangana districts | Sakshi
Sakshi News home page

'ఉత్త'రాదే.. కరువు ముప్పు!

Apr 15 2026 1:55 AM | Updated on Apr 15 2026 1:55 AM

Rainfall deficit in northern Telangana districts

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాభావం

దక్షిణ, తూర్పు, మధ్య జిల్లాల్లో మాత్రం సాధారణ వర్షాలు

నైరుతి సీజన్‌ ముందస్తు అంచనాలు విడుదల చేసిన ఐఎండీ

భారీగా పెరిగిన గరిష్ట ఉష్ణోగ్రతలు

అత్యధికంగా ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీలు  నమోదు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నైరుతి సీజన్‌ వానలు సాధారణ స్థితిలోనే ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దక్షిణ, తూర్పు, మధ్య తెలంగాణ జిల్లాల్లో సాధారణ స్థితిలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. కొన్నిచోట్ల మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కూడా నమోదు కావొచ్చని వివరించింది. గతేడాది సీజన్‌తో పోలిస్తే తక్కువ వర్షాలు కురుస్తాయని, కానీ ఉత్తర ప్రాంత జిల్లాల్లో మాత్రం వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయని, ఆయా జిల్లాల్లో లోటు వర్షపాతమే నమోదవుతుందని తెలిపింది. మరింత స్పష్టమైన అంచనాలను వచ్చే నెలాఖరులో విడుదల చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతి సీజన్‌కు సంబంధించిన ముందస్తు అంచనాలను హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం మంగళవారం ఉదయం విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈసారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రాథమిక అంచనాల్లో స్పష్టం చేసింది. 

ఉత్తరాది జిల్లాలకు కరువు ముప్పు!
రాష్ట్రంలోని ఉత్తర ప్రాంత జిల్లాలు కరువు బారిన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రుంభీమ్‌ ఆసిఫాబాద్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నమోదు కావొచ్చని పేర్కొంది. కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో కూడా వర్షాభావ పరిస్థితులు ఉంటాయని, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో సాధారణం కంటే తక్కువ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. ఈ మేరకు రైతులు పంటల సాగు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచిస్తున్నారు. 


పెరిగిన భగ భగలు..
రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. మెజార్టీ జిల్లాల్లో 40 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. కాగా ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు మరో మూడురోజుల పాటు నమోదైతే వడగాడ్పుల ప్రభావం ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సీయస్‌ అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, నల్లగొండలో 23.6 డిగ్రీ సెల్సీయస్‌ అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, హైదరాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్, రామగుండంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సీయస్‌ అధికంగా నమోదయ్యాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement