11 ఏళ్ల కనిష్టానికి వర్షపాతం: ఐఎండీ
ఇరాన్–అమెరికా డీల్‌పై సందిగ్ధత
ఎంఎస్‌సీఐ రీబ్యాలెన్సింగ్ ప్రభావం
సెన్సెక్స్ 1,092 పాయింట్లు డౌన్
నిఫ్టీకి 359 పాయింట్ల నష్టం
రూ. 5.77 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబై: దేశవ్యాప్తంగా ఈ ఏడాది 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదు అవుతుందంటూ భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదిక వెల్లడితో ట్రేడింగ్ చివర్లో ఫైనాన్స్, చమురు షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి ఒప్పందం ఇంకా పూర్తిగా ఖరారు కాకపోవడం, ఎంఎస్‌సీఐ సూచీ మార్పులు అమలులోకి రావడం, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. ఫలితంగా శుక్రవారం సెన్సెక్స్ 1,092 పాయింట్లు క్షీణించి 74,775 వద్ద ముగిసింది. నిఫ్టీ 359 పాయింట్లు పతనమై 23,548 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్ ఒకటిన్నర శాతానికిపైగా పతనంతో, ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.77 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మొత్తం మార్కెట్ క్యాప్ రూ.465 లక్షల కోట్లకు దిగివచి్చంది.
లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి
అమెరికా–ఇరాన్ కాల్పుల విరమణ పొడిగింపు వార్తలతో క్రూడాయిల్ ధరలు తగ్గడం, అంతర్జాతీయ సానుకూల సంకేతాల ప్రభావంతో దేశీయ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ప్రథమార్థంలో 352 పాయింట్లు పెరిగి 76,220 వద్ద, నిఫ్టీ 96 పాయింట్లు బలపడి 24,003 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్ సెషన్ నుంచి అమ్మకాలతో తలెత్తడంతో పాటు ట్రేడింగ్ చివర్లో అనూహ్య లాభాల స్వీకరణతో సూచీలు లాభాల్లోంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఒక దశలో సెన్సెక్స్ 1,279 పాయింట్లు క్షీణించి 74,589 వద్ద, నిఫ్టీ 422 పాయింట్లు పతనమై 23,4845 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగివచ్చాయి.
రంగాల వారీ ఇండెక్సుల్లో
బీఎస్‌ఈలో ఆయిల్ అండ్ గ్యాస్ 2.75%, మెటల్ 2.30%, వినిమయ 2.23%, హాస్పిటల్స్ 2.16%, ఇంధన 2.08%, కమోడిటీస్ 1.94%, ఆటో 1.90%, సరీ్వసెస్ 1.58 శాతం పతనమయ్యాయి. స్మాల్ క్యాప్ సూచీ 1.26%, మిడ్ క్యాప్ ఇండెక్సు 0.73 శాతం నష్టపోయాయి.
నాలుగు షేర్లకు మాత్రమే లాభాలు:
సెన్సెక్స్ సూచీలోని 30 షేర్లలో టెక్ మహీంద్రా (2%), హెచ్‌సీఎల్‌టెక్ (1.65%), ఎల్‌అండ్‌టీ (0.76%), ఇన్ఫోసిస్ (0.05%) మాత్రమే లాభపడ్డాయి. మరోవైపు, అధిక వెయిటేజీ రిలయన్స్ ఇండస్ట్రీస్( –2.18%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (–1.81%), ఐసీఐసీఐ బ్యాంక్ (–1.32%), ఎంఅండ్‌ఎం(–2.72%), బజాజ్ ఫైనాన్స్ (–2.82%) షేర్లు నష్టపోయి సూచీల పతనానికి ప్రధాన కారణమయ్యాయి. సెన్సెక్స్ కోల్పోయిన పాయింట్లలో ఈ షేర్ల వాటాయే 600 పాయింట్లు కావడం విశేషం.
నష్టాలు ఎందుకంటే
ఈ ఏడాది దేశంలో సాధారణం కంటే తక్కువగా, గత 11 ఏళ్ల కనిష్ట స్థాయిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) నివేదికలో వెల్లడి కావడం మార్కెట్‌ను నిరాశపరిచింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గి ఆహార ద్రవ్యోల్బణం పెరగొచ్చన్న ఆందోళనలు అమ్మకాల ఒత్తిడిని పెంచాయి. అమెరికా–ఇరాన్ మధ్య కాల్పుల విరమణ 60 రోజులు పొడిగింపు ఒప్పందం కుదిరినా, ట్రంప్ ఆమోదం లభించలేదు.
ఇరాన్ యురేనియం నిల్వల అంశంపై స్పష్టత కొరవడడంతో ప్రపంచ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ మేలో 19 సెషన్లలో 14 రోజులు నికర అమ్మకందారులుగా నిలిచి, శుక్రవారం రూ.21,106 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఎంఎస్‌సీఐ సూచీల పునర్వ్యవస్థీకరణ ప్రభావం కనిపించింది. ఎంసీఎక్స్, ఇండియన్ బ్యాంక్ ప్రధాన సూచీలో చేరగా, ఆర్‌వీఎన్‌ఎల్, కల్యాణ్ జ్యువెలర్స్‌తో పాటు 12 స్మాల్‌క్యాప్ స్టాక్‌లు వైదొలిగాయి.


