breaking news
el nino cyclone
-
ఎల్‌నినో దెబ్బ.. ఎండిపోనున్న ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు
భూమ్మీద ఉన్న అతిపెద్ద సరస్సుకు ఘోర విపత్తు రాబోతోంది. 3 లక్షల 75 వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి, సముద్రాన్ని పోలి ఉన్న ఆ సరస్సు మరో పాతికేళ్లలో ఎండిపోవడమే కాకుండా.. అక్కడ ఓ భయంకర ఎడారి ఉద్భవించనుంది.ఇప్పుడు ప్రపంచమంతా రష్యా-ఉక్రెయిన్.. పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాలపై ఆందోళన చెందుతుంటే.. అంతకు మించిన విపత్తు తనపని తాను చేసుకుపోతోందనే విషయం మీకు తెలుసా?అవును, మధ్య ఆసియాలో అతి పెద్ద సరస్సుగా పేరున్న క్యాస్పియన్ సీ వేగంగా అంతరించిపోతోంది. మీరు విన్నది నిజమే..!ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్‌తో విలవిలలాడుతున్న ఈ మహా సరస్సుకు.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికేస్తున్న భయంకరమైన ‘సూపర్ ఎల్‌నినో’ విపత్తు తోడైంది! పసిఫిక్ మహాసముద్రంలో పుట్టే ఈ ఎల్‌నినో ప్రభావం వల్ల, క్యాస్పియన్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మునుపెన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. దీనివల్ల ఇక్కడి నీరంతా ఊహించని వేగంతో ఆవిరైపోతోంది.మరోవైపు ఎల్‌నినో వల్ల వర్షాలు ముఖం చాటేయడంతో.. ఈ సరస్సుకు జీవనాడి అయిన నదుల నుంచి వచ్చే నీటి ప్రవాహం కూడా ఘోరంగా పడిపోతోంది. రష్యా, కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, అజర్బైజాన్, ఇరాన్.. ఇలా ఐదు దేశాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న ఈ మహా సరస్సు, 2050 కల్లా గుర్తుపట్టలేనంతగా మారిపోబోతోంది. అసలు క్యాస్పియన్ సముద్రానికి ఏమైంది? దీని వెనుక ఉన్న భయంకరమైన నిజాలు ఏంటి? ఈ రోజు చర్చించుకుందాం.సముద్రమంత పెద్ద సరస్సు..!క్యాస్పియన్ సముద్రం ఎంత పెద్దదో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే.. దీన్ని గనుక అమెరికా మ్యాప్ పైన పెడితే, దక్షిణాన లాస్ ఏంజిల్స్ నుండి ఉత్తరాన ఓరెగాన్, ఐడహో రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది. సముద్రాలతో ఎలాంటి సహజ అనుసంధానం లేకపోవడం వల్ల సాంకేతికంగా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సరస్సు. కానీ, 2020లో జర్మనీలోని బ్రెమెన్ యూనివర్సిటీ, నెదర్లాండ్స్ లోని ఉట్రెచ్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు 'నేచర్' జర్నల్‌లో ప్రచురించిన ఒక పరిశోధన ప్రకారం.. ఈ శతాబ్దం ముగిసేసరికి క్యాస్పియన్ సముద్రం నీటి మట్టం 9 మీటర్ల నుండి ఏకంగా 18 మీటర్ల మేర పడిపోనుంది! ఒకవేళ 9 మీటర్ల నీటి మట్టం తగ్గితే.. ఈ సముద్ర ఉపరితల వైశాల్యంలో 23 శాతం శాశ్వతంగా ఎండిపోతుంది. అదే గరిష్టంగా 18 మీటర్లు తగ్గితే.. ఏకంగా 34 శాతం భాగం భూమిగా.. ఇంకా పరిస్థితులు దారుణంగా ఉంటే.. ఎడాదిరి మాదిరిగా మారిపోతుంది. అంటే, దాదాపు 'పోర్చుగల్' దేశమంత పరిమాణంలో ఉన్న నీటి భాగం ఎండిపోయి ఎడారిగా మారుతుందన్నమాట! అన్నిటికంటే భయంకరమైన విషయం ఏంటంటే.. 2050 నాటికే, అంటే కేవలం మరో పాతికేళ్లలోనే ఈ సరస్సు ఉత్తర భాగం పూర్తిగా అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది.ఉత్తరభాగం కనుమరుగు..!అసలు ఈ ఉత్తర భాగమే ఎందుకు ముందు ఎండిపోతోంది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని నేను వివరిస్తాను. క్యాస్పియన్ సముద్రం మూడు బేసిన్లుగా ఉంది. దక్షిణ బేసిన్ అత్యంత లోతైనది. ఇక్కడ దాదాపు ఒక కిలోమీటరు మేర లోతు ఉంటుంది. మధ్య బేసిన్ కూడా 788 మీటర్ల మేర లోతు ఉంటుంది. కానీ కజకిస్తాన్, రష్యా సరిహద్దుల్లో ఉండే ఉత్తర బేసిన్ సగటు లోతు 5 మీటర్లు మాత్రమే! క్యాస్పియన్ సముద్రంలో మూడో వంతు వైశాల్యం దీనిదే అయినప్పటికీ, కేవలం 1 శాతం నీరు మాత్రమే ఇక్కడ ఉంటుంది. గత శతాబ్దంలో 'ఆరల్ సముద్రం' ఎలాగైతే సోవియట్ పాలకుల నిర్వాకం వల్ల పూర్తిగా ఎండిపోయిందో.. ఇప్పుడు క్యాస్పియన్ సముద్రానికి కూడా అదే గతి పడుతోంది.ఎందుకు ఈ పరిస్థితి?అసలు క్యాస్పియన్ సముద్రం ఎందుకు ఎండిపోతోంది? అనే ప్రశ్నకు రెండు అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. మొదటిది, ఈ సరస్సుకు నీరందించే 130 నదులలో అత్యంత ప్రధానమైనది 'ఓల్గా నది'. క్యాస్పియన్ సముద్రానికి వచ్చే నీటిలో 80 శాతం ఈ ఒక్క నది నుంచే చేరుతుంది. అయితే, 2026లో 'అమెరికన్ జియోఫిజికల్ యూనియన్' ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. ఓల్గా నది ద్వారా వచ్చే నీటి ప్రవాహం గత కొన్నేళ్లుగా 12 శాతం తగ్గిపోయింది. క్లైమేట్ ఛేంజ్ వల్ల వర్షపాతం తగ్గడమే దీనికి కారణం. ఇక క్యాస్పియన్ సీ ఎండిపోవడానికి రెండో కారణం.. గ్లోబల్ వార్మింగ్! 1979 నుంచి 2015 మధ్య కాలంలో ఇక్కడి సగటు ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ మేర పెరిగింది. దీనివల్ల నీరు ఆవిరైపోయే రేటు విపరీతంగా పెరిగింది. క్యాస్పియన్ సముద్రం కోల్పోయిన నీటిలో 40 శాతం కేవలం ఈ ఎండల వల్ల ఆవిరైపోయినదే!జీవవైవిధ్యానికి ముప్పు..?ఈ విపత్తు వల్ల జరిగే నష్టం ఊహాతీతం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, అంతరించిపోతున్న 'క్యాస్పియన్ సీల్స్' అనే జీవులు చలికాలంలో ఈ ఉత్తర భాగంలో గడ్డకట్టే మంచుపైనే పిల్లల్ని కంటాయి. ఇప్పుడు ఆ మంచు కరిగిపోతే, ఆ జీవజాతి పూర్తిగా అంతరించిపోతుంది. ఇక ఆర్థికంగా చూస్తే.. ప్రపంచంలోని 3 శాతం ఆయిల్ నిల్వలు, 4 శాతం గ్యాస్ నిల్వలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ముఖ్యంగా కజకిస్తాన్‌కు చెందిన, అతిపెద్ద ఆయిల్ ఫీల్డ్ అయిన 'కాశగన్ ఆయిల్ ఫీల్డ్' ఈ ఉత్తర బేసిన్ లోనే ఉంది. సముద్రం ఎండిపోతే, అక్కడ ఉన్న బిలియన్ల డాలర్ల షిప్పింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ల్యాండ్లాక్డ్ అయిపోయి, కజకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. అంతేకాదు, రష్యాలోని ఆస్ట్రాఖాన్, అజర్బైజాన్ రాజధాని బాకూ లాంటి ప్రముఖ ఓడరేవులు కొత్త తీరప్రాంతానికి కిలోమీటర్ల దూరంలోకి జరిగిపోతాయి. చైనా నుంచి ఐరోపా వెళ్లే అత్యంత కీలకమైన 'మిడిల్ కారిడార్' ట్రేడ్ రూట్ కూడా ఈ సరస్సు ఎండిపోవడం వల్ల ప్రశ్నార్థకంగా మారబోతోంది.భూగర్భం విషపూరితమే..ఇవన్నీ ఒకెత్తయితే, ఎండిపోయిన ఈ సరస్సు గర్భం విషపూరితమైన ఎడారిగా మారుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా ఇక్కడ జరిగిన ఆయిల్ వెలికితీత, కెమికల్ వ్యర్థాల వల్ల ఈ నీరు పూర్తిగా కలుషితమైంది. రేపు ఎండల వల్ల ఈ భూమి ఎండిపోయాక, వీచే గాలులు ఆ కెమికల్ ధూళిని చుట్టుపక్కల నగరాలపైకి మోసుకొస్తాయి. దీనివల్ల ఈ తీరప్రాంతాల్లో నివసిస్తున్న దాదాపు 1.5 కోట్ల మంది ప్రజలు 'క్లైమేట్ రెఫ్యూజీస్' అంటే.. వాతావరణ శరణార్థులుగా తమ ఇళ్లను వదిలి వలస వెళ్ళిపోవాల్సిన దుస్థితి వస్తుంది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల్లోనూ ఇరాన్ తన డ్రోన్లను రష్యాకు సరఫరా చేయడానికి ఈ క్యాస్పియన్ సముద్రాన్నే వాడుకుంటోంది. రాజకీయాలకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఈ మహా సరస్సు.. ప్రకృతి ప్రకోపానికి బలైపోతుండటం నిజంగా మానవాళికి ఒక హెచ్చరిక. మరి గ్లోబల్ ఎమిషన్స్ తగ్గించి ప్రపంచ దేశాలు ఈ మహావినాశనాన్ని ఆపగలవా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.:: హెచ్.కమలాపతిరావు, సీనియర్ జర్నలిస్టు -
ఉగ్రరూపం దాల్చనున్న ఎల్ నినో.. WMO హెచ్చరిక
-
డేంజర్ బెల్స్.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్‌నినో సిగ్నల్!
భూమిపై అతిపెద్ద మహాసముద్రం.. దాని లోతుల్లో వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక భారీ వేడి నీటి ప్రవాహం.. అదే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. ఏకంగా 14,500 కిలోమీటర్ల పొడవున్న ‘కెల్విన్ వేవ్ (Kelvin Wave)’ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు దిశగా కదులుతోంది. ఈ ఒక్క పరిణామం ప్రపంచ వాతావరణాన్ని నెలల తరబడి ప్రభావితం చేసే ఎల్‌నినో (El Nino) తిరిగి బలపడుతున్న సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.అమెరికా వాతావరణ సంస్థ NOAA ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఈ భారీ వేడి నీటి అలను నాసా–యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న Sentinel-6 Michael Freilich ఉపగ్రహం అత్యంత స్పష్టంగా నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మాన్స్టర్ వేవ్.. కానీ సునామీ కాదు!సముద్రంలో 14,500 కిలోమీటర్ల అల అని వినగానే భయంకరమైన కెరటం కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఇది అలాంటి అల కాదు. ఇది సముద్రం లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. దీన్ని శాస్త్రవేత్తలు కెల్విన్ వేవ్ అంటారు. ఇది సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా కదులుతూ, ఉపరితలంలోని నీటిని కూడా వేడెక్కిస్తుంది. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్‌కు చేరుకున్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.🌊 A 14,500-km “monster wave” of warm water is moving across the Pacific.Tracked from space by NASA’s Sentinel-6 satellite, the massive Kelvin wave is pushing heat eastward — a major signal of a strengthening El Niño. pic.twitter.com/SkZ0ebXIs0— StarSnap 🌟 (@StarSnap_1) July 4, 2026ఎందకంత ప్రమాదకరం?సాధారణంగా పసిఫిక్‌లో తూర్పు నుంచి పడమర వైపు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. అయితే ఆ గాలులు బలహీనపడితే, ఆ వేడి నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగినట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ఇది చిన్న మార్పుగా కనిపించినా, ప్రపంచ వాతావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద సంకేతం.ప్రపంచానికి ఎందుకు టెన్షన్?ఎల్‌నినో అనేది ఒక దేశానికి లేదా ఒక సముద్రానికి మాత్రమే సంబంధించిన పరిణామం కాదు. ఇది భూమి మొత్తం వాతావరణ సమతుల్యాన్ని మార్చగల శక్తి. దీని కారణంగా ఒక దేశంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. మరో దేశంలో తీవ్ర కరువు.. ఎక్కడో అడవి మంటలు.. మరెక్కడో శక్తివంతమైన తుఫాన్లు వస్తాయి. అలాగే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు అవతాయి. ఇవన్నీ ఎల్‌నినోతో ముడిపడి ఉండే అవకాశాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని అత్యంత నిశితంగా గమనిస్తుంటారు.భారత్‌పై ఎలాంటి ప్రభావం?భారత్‌కు ఎల్‌నినో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రుతుపవనాలు. ఎల్‌నినో బలంగా ఉంటే సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గవచ్చు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి నుంచి తాగునీటి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈసారి మరో అంశం కొత్త ఆశను కలిగిస్తోంది. అదే భారత మహాసముద్ర డైపోల్ (IOD). ఇది అనుకూలంగా ఉంటే ఎల్‌నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.‘సూపర్ ఎల్‌నినో’ వస్తుందా?శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్నినోగా పరిగణిస్తారు. NOAA అంచనాల ప్రకారం, ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం 63 శాతం వరకు ఉంది. అది జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ ఘటనలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.🚨 A 14,500-km "monster wave" is crossing the Pacific as El Niño strengthensNASA's Sentinel-6 satellite detected a vast subsurface warm-water (Kelvin) wave stretching nearly 14,500 km across the tropical PacificThe heat pulse raised sea-surface height by up to 15 cm#SSTVI pic.twitter.com/2QKrSoVcEh— Geo Politics Desk (@GeoPoliticsDesk) July 4, 2026 -
డేంజర్ లో తెలుగు రాష్ట్రాలు ఎల్ నినో ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే?
-
సూపర్ ఎల్‌నినో వెనుక బంగారు రహస్యం!
ప్రపంచ దేశాలను వణికిస్తున్న "సూపర్ ఎల్‌నినో" పేరు వినగానే కరువు, వరదలు, పంటనష్టం, ఆహార సంక్షోభమే గుర్తుకొస్తాయి. కానీ ఈ వాతావరణ దృగ్విషయం అందరికీ శాపమేనా? ఆశ్చర్యకరంగా, కొన్ని దేశాలకు మాత్రం సూపర్ ఎల్‌నినో బంగారు అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఎక్కడో పంటలు ఎండిపోతుంటే.. మరెక్కడో రికార్డు దిగుబడులు నమోదవుతాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత పెరుగుతుంటే.. మరికొన్ని దేశాల్లో ఆనకట్టలు నిండిపోతాయి. ప్రకృతి సృష్టించే ఈ అసమాన సమీకరణంలో విజేతలు ఎవరు? ఓటమిపాలయ్యే దేశాలు ఏవి?.ప్రపంచ వాతావరణ వ్యవస్థలో అత్యంత ప్రభావశీలమైన ఘటనల్లో ఎల్‌నినో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల సముద్ర జలాలు అసాధారణంగా వేడెక్కినప్పుడు ఎల్‌నినో ఏర్పడుతుంది. ఈ వేడిమి మరింత తీవ్రరూపం దాల్చినప్పుడు దానిని "సూపర్ ఎల్‌నినో"గా పిలుస్తారు. 1982-83, 1997-98, 2015-16లో నమోదైన సూపర్ ఎల్నినోలు ప్రపంచవ్యాప్తంగా వందల బిలియన్ల డాలర్ల ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. సూపర్ ఎల్‌నినో ప్రభావం కేవలం వర్షాలకే పరిమితం కాదు. మనం ఉదయం తాగే కాఫీ నుంచి సాయంత్రం తినే చాక్లెట్ వరకు, రైతు పొలం నుంచి ప్రపంచ స్టాక్ మార్కెట్ల వరకు దీని ప్రభావం కనిపిస్తుంది. అందుకే వాతావరణ నిపుణులు సూపర్ ఎల్‌నినోను ‘ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి’గా అభివర్ణిస్తుంటారు.అయితే ప్రకృతి ఇక్కడే తన విచిత్రాన్ని చూపిస్తుంది. ఒకే వాతావరణ పరిణామం కొన్ని దేశాలకు విపత్తుగా మారితే, మరికొన్ని దేశాలకు అది వరంలా మారుతుంది. ముఖ్యంగా అర్జెంటీనా, ఉరుగ్వే, పెరుగ్వే వంటి వ్యవసాయాధారిత దేశాలు ఎల్‌నినో సంవత్సరాల్లో అధిక వర్షపాతం కారణంగా భారీ పంట దిగుబడులను నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. సోయాబీన్, మొక్కజొన్న, గోధుమల ఉత్పత్తి పెరగడంతో ఈ దేశాల ఎగుమతులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లలో ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు వీటికి మరింత డిమాండ్ పెరిగి అదనపు ఆదాయం సమకూరుతుంది.ఇక అమెరికాలోని కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి ప్రాంతాలకు కూడా ఎల్‌నినో కొన్నిసార్లు ఊరటనిస్తుంది. సాధారణంగా కరువుతో ఇబ్బందులు పడే ప్రాంతాల్లో వర్షపాతం పెరిగి జలాశయాలు నిండుతాయి. భూగర్భ జలాలు పునరుద్ధరించబడతాయి. వ్యవసాయ రంగానికి నీటి లభ్యత మెరుగుపడుతుంది. హైడ్రోపవర్ ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఆసక్తికర విషయం ఏమిటంటే, కొన్ని సందర్భాల్లో ఎల్‌నినో ప్రపంచ వాణిజ్య సమీకరణాలనే మార్చేస్తుంది. ఒక దేశంలో పంటలు విఫలమైతే, మరో దేశం ఆ కొరతను భర్తీ చేస్తూ భారీ ఎగుమతుల ద్వారా లాభపడుతుంది. 1997-98 సూపర్ ఎల్‌నినో సమయంలో కొన్ని దక్షిణ అమెరికా దేశాల వ్యవసాయ ఎగుమతులు గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక అధ్యయనాలు చెబుతున్నాయి.అయితే ఈ లాభాల వెనుక కూడా ప్రమాదాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక దేశంలో పంటలు బాగా పండినా, ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి తగ్గిపోతే అంతర్జాతీయ మార్కెట్లలో ధరల అస్థిరత ఏర్పడుతుంది. సరఫరా గొలుసులు దెబ్బతినడం, ఆహార ధరలు పెరగడం వంటి పరిణామాలు చివరికి లాభపడిన దేశాలపైనా ప్రభావం చూపుతాయి. మరోవైపు భారత్, ఆస్ట్రేలియా, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలు సూపర్ ఎల్‌నినో ప్రభావంతో కరువు, వర్షాభావం, పంట నష్టాలను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ముఖ్యంగా భారత్‌లో రుతుపవనాలపై ఎల్‌నినో ప్రభావం పడితే వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్‌లో ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది.వాతావరణ మార్పుల కారణంగా ఎల్‌నినో ప్రభావాలు మరింత తీవ్రంగా మారుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు దశాబ్దాలకు ఒకసారి కనిపించే తీవ్ర ఎల్‌నినో పరిస్థితులు ఇప్పుడు మరింత తరచుగా సంభవించే అవకాశముందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. దీని అర్థం ప్రపంచం భవిష్యత్తులో మరిన్ని వాతావరణ షాక్‌లను ఎదుర్కొనే అవకాశం ఉందన్న మాట.చివరగా.. సూపర్ ఎల్‌నినో అనేది కేవలం సముద్రంలో ఉష్ణోగ్రత పెరగడం కాదు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కదిలించే అదృశ్య శక్తి. ఎక్కడో రైతు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తుంటే, మరో దేశంలో అదే వర్షాలు బంగారు పంటలుగా మారతాయి. ఎక్కడో ఆనకట్టలు ఎండిపోతుంటే, మరెక్కడో నీరు పొంగిపొర్లుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఎల్‌నినోను ప్రకృతి నిర్వహించే ప్రపంచ స్థాయి లాటరీగా అభివర్ణిస్తారు. కానీ ఈ లాటరీలో కొందరు గెలిచినా, చివరికి చెల్లించాల్సిన మూల్యం మాత్రం మొత్తం ప్రపంచానిదే. -
సూపర్ ఎల్‌నినో వస్తోందా?
పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా ‘సూపర్ ఎల్‌నినో’ అనే వాతావరణ సన్నివేశం వస్తున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న చోట్ల చాలా బలమైన ఎల్ నినో పరిస్థితి ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో రావచ్చు అన్న సూచనలు అందుతున్నాయి.అది మరి ముందు ఎప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. ఈ పరిస్థితిని కొందరు ‘గాడ్జిల్లా ఎల్ నినో’ అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరవులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవ త్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా. అసాధారణమైన వాతా వరణ పరిస్థితులు రాబోతున్నాయని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్ కింగ్డమ్ వారి నేషనల్ వెదర్ సర్వీసెస్ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు. ఎల్‌నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్‌నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న సూపర్ ఎల్‌నినో పరిస్థితి అప్పుడపుడూ వస్తూ ఉంటుంది. 1982–83, 1997–98 ఆ తరువాత 2015–16లలో వచ్చింది ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగితే దానిని సూపర్ ఎల్నినోగా భావిస్తారు. మార్చి నెలలోనూ, ఏప్రిల్ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. బలమైన ఎల్‌నినో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు.సెప్టెంబర్ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా రెండు డిగ్రీల సెంటీగ్రేడ్ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ‘యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్‌క్యాస్ట్’ వారు బలమైన ఎల్ నినో వచ్చే పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ వారు ఆ అవకాశం 25 శాతం మాత్రమే అంటున్నారు. యూరప్‌లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతా మార్పులు వస్తాయనీ, వేడి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుతుందనీ అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్‌నినో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. జూన్ మాసం సగం గడిచిన తరువాత ఈ విషయం గురించి కచ్చితంగా చెప్పే వీలు ఉంటుంది.ప్రభావం ఎలా ఉంటుంది?ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్ర తీరాలలోని పగడపు కొండలు బ్లీచ్ కావడం మొదలు... ఆ యా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. ‘పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు’ అంటారు పరిశోధకులు టిమ్ స్టాక్‌డేల్. ‘పెద్ద ఎత్తున తుపానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు’ అంటారాయన.ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనా లలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమ యంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్ ప్రాంతాల్లో పొడి వాతావరణం బాగా పెరిగి కరవులు, హీట్ వేవ్‌లు, అడవులు తగలబడటం లాంటివెన్నో జరగవచ్చు. యూకే, ఇతర యూరప్ దేశాలలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అననుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఈ పరిస్థితి సముద్రంలో తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ ఎల్ నినో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్పవచ్చు.వ్యాసకర్త సైన్స్ అంశాల రచయిత. -
ఈ ఏడాది మండిపోనున్న ఎండలు..
-
పడగెత్తిన ఎల్‌నినో!
ఈసారి రుతుపవనాల రాక ఆలస్యం.. వర్షాలూ అంతంతే: స్కైమెట్ అంచనా ► వర్షపాతం సాధారణం కంటే తక్కువే ► ఎల్‌నినో పరిస్థితులకు 50 శాతం అవకాశం ► మండిపోనున్న ఎండలు.. రానున్న 2 నెలలూ భగభగలే ► చుక్కలు చూపనున్న మే.. 45 డిగ్రీల దాకా నమోదయ్యే చాన్స్ ► ఎండలకు రాష్ట్రంలో 8 మంది మృతి సాక్షి, హైదరాబాద్ మేలో దంచికొట్టాల్సిన ఎండలు ఏప్రిల్‌లోనే ఠారెత్తిస్తున్నాయి.. నెల రోజుల ముందుగానే మండిపోతున్నాయి.. ఈసారి రికార్డు స్థాయిలో హీటెక్కిస్తాయన్న సంకేతాలూ వెలువడుతున్నాయి.. మరి వానల సంగతేంటి? మంచి వర్షాలే ఉంటాయని అంతా చెబుతున్నా వాతావరణ నిపుణుల తాజా అంచనాలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఈసారి ఎల్‌నినో ముప్పు పొంచి ఉందని, ఫలితంగా ‘చల్లని’కబురు లేటుగా అందుతుందని పేర్కొంటున్నారు. అంతేకాదు జూన్–సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదవుతుందని స్పష్టంచేస్తున్నారు. వాతావరణ పరిశోధన సంస్థ స్కైమెట్తోపాటు నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ తాజా అధ్యయనంలో ఇదే విషయం తేలింది. పసిఫిక్ మహాసముద్రం ఉపరితలం వేడెక్కి సముద్రం మీదుగా వీచే పవనాలు గతి తప్పడంతో వాతావరణంలో పెనుమార్పులు చోటుచేసుకుంటాయి. దీన్నే ఎల్నినోగా వ్యవహరిస్తారు. దీని ప్రభావంతో వేసవిలో ఎండలు మండి పోవడం, అకాల వర్షాలు, రుతుపవనాల్లో జాప్యం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఖరీఫ్ పంటలకు ఇబ్బందేనా? రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకి క్రమంగా దేశమంతా విస్తరిస్తాయి. ఈ సమయంలో మంచి వర్షాలు కురిస్తేనే ఖరీఫ్ సాగు జోరుగా సాగుతుంది. రుతుపవనాల రాక ఆలస్యమైనా, తగినన్ని వర్షాలు లేకపోయినా పంటల సాగు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈసారి రుతుపవనాలు ఆలస్యంగా రావడంతోపాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందన్న స్కైమెట్ అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ‘‘ఎల్‌నినో ఏర్పడితేనే వర్షాలు కురవవని చెప్పలేం. పరిస్థితులు ఎల్‌నినో ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నా కరువు ఏర్పడుతుంది. 2014లో ఇదే జరిగింది. ఆ ఏడాది ఎల్‌నిలో లేదు కానీ వర్షాలు చాలా తక్కువగా కురిసి కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి ఎల్‌నినో ఏర్పాటుకు 50 శాతం పరిస్థితులకు అనుకూలంగా ఉన్నాయి. దీంతో జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌లో తక్కువ వర్షాలు పడొచ్చు’’అని స్కైమెట్ అధినేత జతిన్ సింగ్ పేర్కొన్నారు. ఎండ ప్రచండమే.. రాష్ట్రంలో ఏప్రిల్ రెండో వారంలోనే 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. మరో 60–70 రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో సాధారణంగా మే నెలలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. గతంలో ఏప్రిల్‌లో ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండురోజులు మాత్రమే నమోదైన దాఖలాలున్నాయి. కానీ ఈసారి అందుకు భిన్నంగా ఇప్పట్నుంచే ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్‌లో 1973 ఏప్రిల్ 30న అత్యధికంగా 43.3 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం ఇప్పటివరకు రికార్డు. ఈసారి ఈ రికార్డు బద్దలయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. మే నెలలో గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. రామగుండం, నిజామాబాద్‌లలో 42.4 డిగ్రీలు ఆదివారం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లోనూ 40 డిగ్రీలకు మించి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్‌లలో 42.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్‌లో 42, మహబూబ్‌నగర్‌లో 41.5, మెదక్‌లో 41.6, భద్రాచలంలో 41.2 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండల్లో 40 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, మరికొన్నిచోట్ల ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బతో 8 మంది మృతి సాక్షి, నెట్వర్క్: ఎండ వేడిమికి తాళలేక ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 8 మంది చనిపోయారు. వనపర్తి జిల్లాలో ముగ్గురు, నల్లగొండ జిల్లాల్లో ముగ్గురు మహబూబ్‌నగర్ జిల్లాలో ఒకరు, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఒకరు మరణించారు. గత పదేళ్లుగా ఏప్రిల్ నెలలో గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలివీ.. సంవత్సరం తేదీ ఉష్ణోగ్రత 2016 14 43 2015 30 40.6 2014 29 40.3 2013 30 40.6 2012 30 40.5 2011 29 40.4 2010 16 42.7 2009 30 41.9 2008 30 41.6 2007 30 41.1 ఇప్పటివరకు రికార్డు..1973 ఏప్రిల్ 30: 43.3 డిగ్రీలు వర్షాలపై స్కైమెట్ అంచనా ఇదీ.. పరిస్థితి శాతం అధిక వర్షపాతానికి అవకాశం – 0 సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం – 10 సాధారణ వర్షపాతం – 50 సాధారణం కంటే తక్కువ వర్షపాతం – 25 కరువు పరిస్థితులు – 15


