డేంజర్‌ బెల్స్‌.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్‌నినో సిగ్నల్! | El Nino Is Back 14500 km Monster Wave Is Crossing Pacific, Here's Everything You Need To Know About This | Sakshi
Sakshi News home page

డేంజర్‌ బెల్స్‌.. ప్రపంచాన్ని కుదిపేసే ఎల్‌నినో సిగ్నల్!

Jul 5 2026 7:52 AM | Updated on Jul 5 2026 10:49 AM

El Nino is back 14500 km monster wave is crossing Pacific Here Full Details

భూమిపై అతిపెద్ద మహాసముద్రం.. దాని లోతుల్లో వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా ప్రయాణిస్తున్న ఒక భారీ వేడి నీటి ప్రవాహం.. అదే ఇప్పుడు ప్రపంచ వాతావరణ శాస్త్రవేత్తలను అప్రమత్తం చేస్తోంది. ఏకంగా 14,500 కిలోమీటర్ల పొడవున్న ‘కెల్విన్ వేవ్ (Kelvin Wave)’ ప్రస్తుతం పసిఫిక్ మహాసముద్రం మీదుగా తూర్పు దిశగా కదులుతోంది. ఈ ఒక్క పరిణామం ప్రపంచ వాతావరణాన్ని నెలల తరబడి ప్రభావితం చేసే ఎల్‌నినో (El Nino) తిరిగి బలపడుతున్న సంకేతంగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

అమెరికా వాతావరణ సంస్థ NOAA ఇప్పటికే ఎల్‌నినో పరిస్థితులు తిరిగి ప్రారంభమైనట్లు ప్రకటించింది. ఈ భారీ వేడి నీటి అలను నాసా–యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సంయుక్తంగా నిర్వహిస్తున్న Sentinel-6 Michael Freilich ఉపగ్రహం అత్యంత స్పష్టంగా నమోదు చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.

మాన్‌స్టర్ వేవ్.. కానీ సునామీ కాదు!
సముద్రంలో 14,500 కిలోమీటర్ల అల అని వినగానే భయంకరమైన కెరటం కళ్ల ముందు మెదులుతుంది. కానీ ఇది అలాంటి అల కాదు. ఇది సముద్రం లోతుల్లో ప్రయాణించే వేడి నీటి ప్రవాహం. దీన్ని శాస్త్రవేత్తలు కెల్విన్ వేవ్ అంటారు. ఇది సముద్రం అడుగున వేల కిలోమీటర్ల మేర నిశ్శబ్దంగా కదులుతూ, ఉపరితలంలోని నీటిని కూడా వేడెక్కిస్తుంది. ఈ వేడి నీరు తూర్పు పసిఫిక్‌కు చేరుకున్నప్పుడు సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడతాయి.

ఎందకంత ప్రమాదకరం?
సాధారణంగా పసిఫిక్‌లో తూర్పు నుంచి పడమర వైపు వీచే ట్రేడ్ గాలులు వేడి నీటిని ఇండోనేషియా, ఆస్ట్రేలియా వైపు నెట్టేస్తాయి. అయితే ఆ గాలులు బలహీనపడితే, ఆ వేడి నీరు తిరిగి తూర్పు వైపు ప్రయాణిస్తుంది. ఈ ప్రయాణంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్ని ప్రాంతాల్లో సముద్ర మట్టం 15 సెంటీమీటర్ల వరకు ఎత్తు పెరిగినట్లు ఉపగ్రహాలు గుర్తించాయి. ఇది చిన్న మార్పుగా కనిపించినా, ప్రపంచ వాతావరణ వ్యవస్థకు ఇది ఒక పెద్ద సంకేతం.

ప్రపంచానికి ఎందుకు టెన్షన్?
ఎల్‌నినో అనేది ఒక దేశానికి లేదా ఒక సముద్రానికి మాత్రమే సంబంధించిన పరిణామం కాదు. ఇది భూమి మొత్తం వాతావరణ సమతుల్యాన్ని మార్చగల శక్తి. దీని కారణంగా ఒక దేశంలో రికార్డు స్థాయిలో వర్షాలు.. మరో దేశంలో తీవ్ర కరువు.. ఎక్కడో అడవి మంటలు.. మరెక్కడో శక్తివంతమైన తుఫాన్లు వస్తాయి. అలాగే, ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు కొత్త రికార్డులు నమోదు అవతాయి. ఇవన్నీ ఎల్‌నినోతో ముడిపడి ఉండే అవకాశాలు. అందుకే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ శాస్త్రవేత్తలు దీనిని అత్యంత నిశితంగా గమనిస్తుంటారు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం?
భారత్‌కు ఎల్‌నినో పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది రుతుపవనాలు. ఎల్‌నినో బలంగా ఉంటే సాధారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంటుంది. దాంతో కొన్ని రాష్ట్రాల్లో వర్షపాతం తగ్గవచ్చు. వ్యవసాయ రంగంపై ప్రభావం పడొచ్చు. జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గితే విద్యుత్ ఉత్పత్తి నుంచి తాగునీటి వరకు అనేక రంగాలపై ప్రభావం కనిపించవచ్చు. అయితే ఈసారి మరో అంశం కొత్త ఆశను కలిగిస్తోంది. అదే భారత మహాసముద్ర డైపోల్ (IOD). ఇది అనుకూలంగా ఉంటే ఎల్‌నినో ప్రభావాన్ని కొంత మేర తగ్గించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

‘సూపర్ ఎల్‌నినో’ వస్తుందా?
శాస్త్రవేత్తలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తున్న అంశం ఇదే. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగితే దాన్ని సూపర్ ఎల్‌నినోగా పరిగణిస్తారు. NOAA అంచనాల ప్రకారం, ఈసారి అలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం 63 శాతం వరకు ఉంది. అది జరిగితే ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ ఘటనలు పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement