పాక్‌ను షేక్ చేస్తున్న కొత్త కేసు.. చిక్కుల్లో డిప్యూటీ పీఎం బంధువు | Pakistan Deputy PM Relative Crypto Dispute Surfaces In Lahore Case, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పాక్‌ను షేక్ చేస్తున్న కొత్త కేసు.. చిక్కుల్లో డిప్యూటీ పీఎం బంధువు

Jul 5 2026 7:17 AM | Updated on Jul 5 2026 10:26 AM

Pakistan Deputy PM relative Crypto dispute surfaces in Lahore Case

ఇస్లామాబాద్‌: దాయాది దేశం పాకిస్తాన్‌లో సంచలనం సృష్టించిన ఇద్దరు విదేశీ మహిళలపై కిడ్నాప్, సామూహిక అత్యాచార కేసు దర్యాప్తులో కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వెనుక క్రిప్టోకరెన్సీ వ్యాపార వివాదం ఉండి ఉండొచ్చని దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముహమ్మద్ రజా దార్, పాకిస్తాన్‌ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బంధువుగా మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

ఈ ఘటనపై పోలీసుల కథనం ప్రకారం.. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక మహిళ, వెనిజులాకు చెందిన మరో మహిళ వ్యాపార అవసరాల కోసం జూన్ 29న పాకిస్తాన్‌లోని లాహోర్‌కు చేరుకున్నారు. అయితే, వారికి ముందే పరిచయం ఉన్న ముహమ్మద్ రజా దార్.. ఇద్దరికి పాకిస్తాన్‌కు ఆహ్వానించినట్లు సమాచారం. అనంతరం వారిని ఒక ఇంటికి తీసుకెళ్లి బంధించి, పలువురు కలిసి లైంగిక దాడికి పాల్పడ్డారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

క్రిప్టోకరెన్సీ వివాదం ఏమిటి?
దర్యాప్తులో భాగంగా న్యాయమూర్తి ఎదుట బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. నిందితులు తమ వద్ద ఉన్న క్రిప్టోకరెన్సీ డిజిటల్ వాలెట్లు, పాస్‌వర్డులు, ఆర్థిక వివరాలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని, వాటిని అప్పగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించినట్లు ఆమె ఆరోపించింది. అలాగే, తమను విడుదల చేసే ముందు 1 లక్ష అమెరికన్ డాలర్లు (100,000 USD) అందాయని ప్రధాన నిందితుడు చెప్పినట్లు ఆమె వెల్లడించింది. ఈ అంశాలన్నీ ప్రస్తుతం దర్యాప్తులో ఉన్న ఆరోపణలు. కాగా, వాటిని అధికారులు నిర్ధారించలేదు.

ముందే వ్యాపార సంబంధాలు
ప్రాథమిక విచారణ ప్రకారం, ముహమ్మద్ రజా దార్ మరియు బాధిత మహిళలు గత ఏడాది సింగపూర్‌లో పరిచయం అయ్యారు. వారు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వ్యాపార ప్రాజెక్టులో కలిసి పనిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదే పరిచయంతో మహిళలకు పాకిస్థాన్‌కు వెళ్లేందుకు బిజినెస్ వీసాలు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. దీంతో వ్యాపార లావాదేవీల్లో తలెత్తిన విభేదాలే ఈ ఘటనకు దారితీశాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మరోవైపు.. ఈ కేసులో ఇప్పటివరకు నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది. కోర్టు నిందితులను పోలీసు కస్టడీకి పంపి విచారణకు అనుమతించింది.

రాజకీయ చర్చ..
ఈ ఘటన పాకిస్తాన్‌లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో ఏకంగా ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ బంధువు పేరు బయటకు రావడంతో తీవ్ర కలకలం సృష్టించింది. ప్రతిపక్ష పార్టీలు నిష్పాక్షిక దర్యాప్తు జరపాలని, రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కాగా, ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. బాధితులు చేసిన ఆరోపణలు, క్రిప్టోకరెన్సీ వివాదం, చెల్లింపు వంటి అంశాలపై ఇంకా కోర్టు ఎలాంటి తుది తీర్పు ఇవ్వలేదు. నిందితులపై ఉన్న ఆరోపణలు విచారణలో భాగంగా పరిశీలించబడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement