భారత్‌కు చైనా బిగ్ షాక్.. చేజారిన ‘మోంగ్లా’ డ్రీమ్ ప్రాజెక్ట్! | How China Snatched Bangladeshs Strategic Mongla Port From India, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

భారత్‌కు చైనా బిగ్ షాక్.. చేజారిన ‘మోంగ్లా’ డ్రీమ్ ప్రాజెక్ట్!

Jul 5 2026 7:17 AM | Updated on Jul 5 2026 10:23 AM

How China Snatched Bangladeshs Strategic Mongla Port from India

భారతదేశానికి అత్యంత సమీపంలో సుందరబన్‌ వనాలకు ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ రెండవ అతిపెద్ద నౌకాశ్రయం ‘మోంగ్లా’ ఇప్పుడు చైనా గుప్పిట్లోకి వెళ్లిపోయింది. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఇటీవల బీజింగ్‌లో జరిపిన తొలి అధికారిక పర్యటనలో చైనాతో కుదుర్చుకున్న ఒక ‘అవగాహనా ఒప్పందం’ సరిహద్దుల్లో సరికొత్త వ్యూహాత్మక ఉత్కంఠకు తెరలేపింది. ‘చైనా-బంగ్లాదేశ్ మోంగ్లా పోర్ట్ ఎకనామిక్ జోన్’ అభివృద్ధి కోసం చైనా ప్రభుత్వ రంగానికి చెందిన ‘చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్’తో ఈ ఒప్పందం కుదిరింది. గతంలో భారత్ దక్కించుకున్న ప్రాజెక్టును కాదని, బంగ్లాదేశ్ ఈ నిర్ణయం తీసుకోవడం భారత రక్షణ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.

చేజారిన భారత్ డ్రీమ్ ప్రాజెక్ట్
2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢాకా పర్యటన సందర్భంగా ఈ మోంగ్లా పోర్ట్ పరిధిలోని 110 ఎకరాల భూమిలో ప్రత్యేక ఆర్థిక మండలి (ఎకనామిక్ జోన్) అభివృద్ధి చేసేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కుదిరింది. అప్పట్లో షేక్ హసీనా ప్రభుత్వం భారత్‌కు ఈ ప్రాజెక్టును కేటాయించింది. దీనికోసం భారత్ భారీగా రుణ సహాయం (లైన్ ఆఫ్ క్రెడిట్) అందించడమే కాకుండా, రవాణా సులభతరం చేయడానికి మోంగ్లా పోర్ట్ నుంచి ఖుల్నా వరకు సరికొత్త రైల్వే లైన్‌ను కూడా నిర్మించింది. అయితే, 2024లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న రాజకీయ తిరుగుబాటు, షేక్ హసీనా ప్రభుత్వం పతనం తర్వాత సమీకరణలు వేగంగా మారిపోయాయి.

చైనాకు దక్కిన సువర్ణావకాశం
భారత డెవలపర్ అయిన హీరానందానీ గ్రూప్ నిర్ణీత గడువులోగా పనులు ప్రారంభించలేకపోయిందనే కారణాన్ని చూపుతూ, 2025లో బంగ్లాదేశ్‌లోని మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నుంచి భారత్‌ను తొలగించింది. భారత్ తప్పుకున్న తరుణం కోసమే ఎదురుచూసిన చైనా, తారిఖ్ రెహమాన్ నూతన ప్రభుత్వం రాగానే ఈ అవకాశాన్ని చేజిక్కించుకుంది. ఇప్పుడు చైనా ప్రభుత్వ సంస్థ ఇదే 110 ఎకరాల భూమిలో ‘చైనీస్ ఎకనామిక్ జోన్’ నిర్మించనుంది. ఇక్కడ ఎలక్ట్రానిక్స్, టెలికాం మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతో పాటు భారీ లాజిస్టిక్స్ గోదాములను చైనా ఏర్పాటు చేయబోతోంది.

భారత్‌కు తగిలిన డబుల్ స్ట్రోక్
ఈ రేవు పట్టణం కేవలం బంగ్లాదేశ్‌కే కాకుండా భారత ఈశాన్య రాష్ట్రాలు (నార్త్-ఈస్ట్ స్టేట్స్), నేపాల్, భూటాన్ దేశాల వాణిజ్యానికి ఒక వ్యూహాత్మక హబ్‌గా మారే సత్తా ఉన్నది. 2024 మే నెలలో ‘ఇండియా పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్’ ద్వారా మోంగ్లా పోర్ట్ టెర్మినల్ నిర్వహణ హక్కులను భారత్ సాధించి బెంగాల్ ఖాళీలో చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ చైనా ఆర్థిక, పారిశ్రామిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తుండటంతో భారత్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతాకు ఇంత దగ్గరగా చైనా రావడం భారత తీరప్రాంత భద్రతకు పెను సవాలుగా మారనుంది.

గూఢచర్యమే అతిపెద్ద ముప్పు
ఈ ప్రాజెక్టును చైనా కేవలం వాణిజ్యపరమైనదని చెబుతున్నప్పటికీ, రక్షణ నిపుణుల విశ్లేషణల ప్రకారం ఇది తీవ్రమైన నిఘా ముప్పును తెచ్చిపెట్టనుంది. గతంలో శ్రీలంకలోని హంబన్‌తోట, పాకిస్తాన్‌లోని గ్వాదర్ పోర్టులను కూడా చైనా ఇలాగే వాణిజ్య అవసరాల కోసమని చెప్పి, ఆ తర్వాత తన నౌకాదళ యుద్ధ నౌకలను, జలాంతర్గాములను (సబ్‌మెరైన్లను) మొహరించడానికి ఉపయోగించుకుంది. ఇప్పుడు మోంగ్లా పోర్ట్ ద్వారా భారత నౌకాదళ (ఇండియన్ నేవీ) కదలికలపై నిఘా ఉంచడానికి, ఇంటెలిజెన్స్ సమాచారాన్ని సేకరించడానికి చైనా దీనిని ఒక గూఢచర్య కేంద్రంగా మార్చే ప్రమాదం ఉంది.

సిలిగురి కారిడార్‌కూ సెక్యూరిటీ థ్రెట్
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి చైనా పర్యటనలో కేవలం మోంగ్లా పోర్ట్ మాత్రమే కాకుండా, తీస్తా నది నిర్వహణ ప్రాజెక్టులోనూ చైనా సహకారాన్ని కోరడం భారత్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. తీస్తా నది ప్రాంతం భారతదేశానికి అత్యంత సున్నితమైన, వ్యూహాత్మకమైన ‘సిలిగురి కారిడార్’ (చికెన్స్ నెక్) కు అతి సమీపంలో ఉంటుంది. ఈ కారిడార్ దేశ ప్రధాన భూభాగాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలుపుతుంది. దీనికి తోడు బంగ్లాదేశ్-చైనా దేశాలు విదేశీ, రక్షణ వ్యవహారాలను సమన్వయం చేసుకునేందుకు '2+2 డైలాగ్' ప్రారంభించాలని నిర్ణయించడం బంగ్లాదేశ్ పూర్తిగా చైనా వైపు మొగ్గు చూపుతోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ వ్యూహం ఉచ్చు
భారతదేశాన్ని సముద్ర మార్గాల్లో చుట్టుముట్టేందుకు చైనా ఎప్పటినుంచో వ్యూహాత్మక ‘స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్’ (ముత్యాల హారం) విధానాన్ని అమలు చేస్తోంది. దీని కింద ఇప్పటికే హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దాదాపు 17 పోర్ట్ ప్రాజెక్టులలో చైనా భాగస్వామ్యం వహిస్తోంది. ఇప్పుడు అందులోకి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యూహాత్మక మోంగ్లా పోర్ట్ కూడా చేరిపోవడంతో, భారత్‌ను తూర్పు వైపు నుంచి కూడా ఒత్తిడిలోకి నెట్టడానికి చైనాకు ఒక బలమైన స్థావరం దొరికినట్లయింది. భౌగోళిక రాజకీయాల పరంగా ఇది బంగాళాఖాతంలో భారత ఆధిపత్యానికి పెను సవాలుగా నిలవనుంది.

ఇది కూడా చదవండి: తరం మారినా.. ముంబై వాన పాట మారలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement