సూపర్‌ ఎల్‌నినో వస్తోందా? | Scientists predict super el nino developing for late 2026 | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఎల్‌నినో వస్తోందా?

May 10 2026 7:37 AM | Updated on May 10 2026 7:37 AM

Scientists predict super el nino developing for late 2026

పది సంవత్సరాల కాలంలో మొదటిసారిగా బహుశా ‘సూపర్‌ ఎల్‌నినో’ అనే వాతావరణ సన్నివేశం వస్తున్నదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. గత కొంతకాలంగా వాతావరణం గురించి పరిశోధనలు జరుగుతున్న చోట్ల చాలా బలమైన ఎల్‌ నినో పరిస్థితి ఈ ఏడాది రెండవ అర్ధభాగంలో రావచ్చు అన్న సూచనలు అందుతున్నాయి.అది మరి ముందు ఎప్పుడూ లేనంతగా బలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. 

ఈ పరిస్థితిని కొందరు ‘గాడ్జిల్లా ఎల్‌ నినో’ అని కూడా అంటున్నారు. దాని కారణంగా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కరవులు, మరికొన్ని చోట్ల వరదలు పెద్ద ఎత్తున వచ్చి మొత్తం మీద ఈ సంవ త్సరాన్ని ముందెన్నడూ లేనంత వేడి సంవత్సరంగా మార్చనున్నట్టు వారి అంచనా. అసాధారణమైన వాతా వరణ పరిస్థితులు రాబోతున్నాయని ఈ విషయం గురించి వ్యాఖ్యానించిన యునైటెడ్‌ కింగ్‌డమ్‌ వారి నేషనల్‌ వెదర్‌ సర్వీసెస్‌ పరిశోధకులు ఆడం స్కైఫే అంటున్నారు.  

ఎల్‌నినో అన్నది ప్రపంచ వాతావరణంలో మామూలుగా వచ్చే పరిస్థితి. దాని కారణంగా ప్రపంచమంతా వాతావరణంలో వింత పరిస్థితులు కనబడతాయి. ఎల్‌నినో అనే పరిస్థితి తరచుగా వస్తూనే ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తుంది అనుకుంటున్న సూపర్‌ ఎల్‌నినో పరిస్థితి అప్పుడపుడూ వస్తూ ఉంటుంది. 1982–83, 1997–98 ఆ తరువాత 2015–16లలో వచ్చింది ఇందుకు ఉదాహరణగా చెప్ప వచ్చు. ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు పెరిగితే దానిని సూపర్‌ ఎల్‌నినోగా భావిస్తారు. మార్చి నెలలోనూ, ఏప్రిల్‌ మొదటి భాగంలోనూ పడమటి దిక్కుగా వీస్తున్న గాలుల కారణంగా పెద్ద ఎత్తున వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్‌ ప్రాంతాలకు బలంగా కదులుతున్నది. బలమైన ఎల్‌నినో రావడానికి ఇది ప్రాతిపదికగా చెప్పుకోవచ్చు.

సెప్టెంబర్‌ మాసం కల్లా ఉష్ణోగ్రతలో తేడా రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌ స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టు పరిశోధకులు గమనించారు. ‘యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌క్యాస్ట్‌’ వారు బలమైన ఎల్‌ నినో వచ్చే పరిస్థితి 50 శాతం వరకు ఉండవచ్చు అని అనుమానిస్తున్నారు. యూఎస్‌ నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ వారు ఆ అవకాశం 25 శాతం మాత్రమే అంటున్నారు. యూరప్‌లోని గ్రూపులు మరింత తీవ్రమైన ఉష్ణోగ్రతా మార్పులు వస్తాయనీ, వేడి మూడు డిగ్రీల సెంటీగ్రేడ్‌కు చేరుతుందనీ అంటున్నారు. ఇదే గనక నిజమైతే ఈసారి ఎల్‌నినో తీరు ఎన్నడూ లేనంత బలంగా ఉంటుంది. జూన్‌ మాసం సగం గడిచిన తరువాత ఈ విషయం గురించి కచ్చితంగా చెప్పే వీలు ఉంటుంది.

ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రపంచమంతా శీతోష్ణ స్థితులు బాగా మారిపోతాయి. ఫలితంగా పంటలు సరిగా పండకపోవడం, సముద్ర తీరాలలోని పగడపు కొండలు బ్లీచ్‌ కావడం మొదలు... ఆ యా ప్రాంతాలలో ప్రజలలో వ్యాధులు ప్రబలడం వరకు ప్రభావాలు రకరకాలుగా ఉంటాయి. ‘పరిస్థితి కొంచెం గందరగోళంగా ఉంది. మామూలుగా మాత్రం లేదు అని చెప్పవచ్చు’ అంటారు పరిశోధకులు టిమ్‌ స్టాక్‌డేల్‌. ‘పెద్ద ఎత్తున తుపానులు, వర్షాలు రావాలని లేదు. అయితే ఇటువంటి పరిస్థితులు అంతకు ముందు లేని చోట్ల ఏర్పడితే ఆశ్చర్యం లేదు’ అంటారాయన.

ఉత్తర, దక్షిణ అమెరికాలలో, అటు ఆఫ్రికా, చైనా లలో వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమ యంలో ఆస్ట్రేలియా, ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికాలోని మధ్య, దక్షిణ ప్రాంతాలు, భారతదేశం, అమెజాన్‌ ప్రాంతాల్లో పొడి వాతావరణం బాగా పెరిగి కరవులు, హీట్‌ వేవ్‌లు, అడవులు తగలబడటం లాంటివెన్నో జరగవచ్చు. యూకే, ఇతర యూరప్‌ దేశాలలో ప్రభావాలు మరింత బలంగా ఉంటాయి. అక్కడ వేసవి వేడి మరింత తీవ్రంగా ఉండే వీలుంది. చలికాలంలో తేమ ఎక్కువయ్యి అననుకూల పరిస్థితులు ఎదురు కావచ్చు. వాతావరణం మారుతున్నది, ప్రపంచం వేడెక్కుతున్నది అన్న సంగతి ఇప్పటికే తెలుసు. ఈ పరిస్థితి సముద్రంలో తీరానికి తోసుకువస్తున్న ఒక అల లాంటిది అయితే, ఈ ఎల్‌ నినో అన్నది ఉవ్వెత్తున వచ్చి ముంచెత్తే చాలా పెద్ద అల అని చెప్పవచ్చు.
వ్యాసకర్త సైన్స్‌ అంశాల రచయిత.

Advertisement
 
Advertisement
Advertisement