నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ | Today Ration Rice Distribution to Begin | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రేషన్ బియ్యం పంపిణీ

Nov 2 2026 7:26 AM | Updated on Nov 2 2026 7:26 AM

Today Ration Rice Distribution to Begin

నల్లగొండ : మూడు నెలల విరామం తర్వాత మళ్లీ రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నవంబర్‌ నెల కోటాకు సంబంధించిన బియ్యాన్ని సోమవారం నుంచి కార్డుదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ జిల్లాల వారీగా రేషన్‌ కార్డుల సంఖ్య ఆధారంగా బియ్యాన్ని కేటాయించింది. అందులో భాగంగా నల్లగొండ జిల్లాకు సుమారు 7 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని కేటాయించారు. జిల్లాలోని 7.42 లక్షల కుటుంబాలకు బియ్యం అందించనున్నారు. ఇప్పటికే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి చౌకధరల దుకాణాలకు బియ్యం తరలింపు చేపట్టారు. రేషన్‌ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ తిరిగి ప్రారంభం కావడం పేద, మధ్యతరగతి కుటుంబాలకు కొంత ఊరటనివ్వనుంది. 

బియ్యం ధరలపై నిఘా..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బియ్యం ధరలు పెరిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు అక్రమ నిల్వలు, బ్లాక్‌ మార్కెట్‌కు పాల్పడే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్రమంగా బియ్యం నిల్వ చేసినా, నిబంధనలకు విరుద్ధంగా తరలించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తోంది. పౌరసరఫరాల శాఖ అధికారులు కూడా బియ్యం నిల్వలు, పంపిణీపై నిఘా ఉంచుతున్నారు. ఇప్పటికే మిర్యాలగూడలో తనిఖీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఒకవైపు మార్కెట్‌లో ధరల నియంత్రణకు చర్యలు, మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సన్నబియ్యం సరఫరా చేయడం ద్వారా పేదలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

రేషన్‌షాపులకు బియ్యం తరలిస్తున్నాం..
రేషన్‌ బియ్యం పంపిణీకి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నవంబర్‌ మాసానికి సంబంధించి ప్రభుత్వం బియ్యం అలాట్‌ చేసింది. దానికి అనుగుణంగా ఇప్పటికే గోదాముల నుంచి రేషన్‌ షాపులకు బియ్యాన్ని రవాణా చేస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపుల్లో బియ్యం నిల్వలు ఉన్నాయి. బియ్యం నిల్వ లేని షాపులకు ముందుగా బియ్యాన్ని పంపిస్తున్నాం. సోమవారం నుంచి లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం.
– రాంపతి, పౌర సరఫరాల శాఖ డీఎం  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement