బౌద్ధ పట్టణాన్ని ‘దున్నేస్తున్నారు’..! | Nelakondapalli Buddhist site in Telangana | Sakshi
Sakshi News home page

బౌద్ధ పట్టణాన్ని ‘దున్నేస్తున్నారు’..!

Nov 2 2026 5:56 AM | Updated on Nov 2 2026 5:56 AM

Nelakondapalli Buddhist site in Telangana

సున్నపురాతి అవశేషాలను పరిశీలిస్తున్న పురావస్తు శాఖ అధికారులు , బౌద్ధ ప్యానెల్‌

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సమీప గ్రామాల్లో విధ్వంసం 

సాగు రూపంలో ధ్వంసమవుతున్న రెండు వేల ఏళ్లనాటి చరిత్ర 

ఇంతకాలం అక్కడ మహా స్తూపం ఒక్కటే తెలుసు.. కానీ, సమీపంలోని 2 కి.మీ. దూరంలో భూగర్భంలో భారీ నిర్మాణాలు 

పొలం పనుల్లో తరచూ వెలుగుచూస్తున్న సున్నపురాతి నిర్మాణ అవశేషాలు 

తాజాగా కొన్నింటి జాడ కనుక్కొని పరిశీలించిన అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: అది ఓ బౌద్ధ పట్టణం.. పలు గ్రామాల సముదాయం... మహా స్తూపం నిర్మాణానికి కేంద్రంగా గుర్తించిన ప్రాంతం. సాధారణ శకానికి పూర్వం ఒకటో శతాబ్దంలో నిర్మించిన భారీ బౌద్ధ మహా స్తూపం ... దాని ఆలంబనగా వెలిసిన చైత్యాలు, విహారాలు, ఆరామాలు ఎన్నో... శాతవాహన కాలం నుంచి ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో ఆ ప్రాంతం గొప్ప బౌద్ధ కేంద్రంగా వెలుగొందింది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు వీలుగా ఇక్కడ బుద్ధుడి శిల్పాలు, బౌద్ధ నిర్మాణాలకు వాడే సున్నపు రాతి ప్యానెల్స్‌ను ఇక్కడ తయారు చేసేవారు.

 అంటే అది ఓ భారీ బౌద్ధ శిల్ప తయారీ కేంద్రం. అక్కడికి వచ్చే విదేశీ బౌద్ధ భిక్షువులతో వెలుగొందిన అంతర్జాతీయ వాణిజ్యం... ఇదంతా చరిత్ర, కానీ, అలనాటి చారిత్రక ఆధారాలు ఇప్పటికీ భూమి పొరల్లో నిక్షిప్తమై ఉన్నాయి. కానీ, ప్రభుత్వం దాన్ని పట్టించుకోకపోవడంతో రైతులు సాగు రూపంలో ఆ పట్టణాన్ని దున్నేస్తున్నారు. 2 వేల ఏళ్ల గొప్ప చరిత్రకు సజీవసాక్ష్యంగా ఉన్న నాటి నిర్మాణాలు శరవేగంగా ధ్వంసమవుతున్నాయి. నాటి చరిత్ర శాశ్వతంగా కనుమరుగవుతోంది.  

నేలకొండపల్లి... ఖమ్మం జిల్లాలోని ఈ ఊరు పేరు వినగానే మనకు అంతర్జాతీయ స్థాయి బౌద్ధ మహా స్తూపం ఒక్కటే కనిపిస్తుంది. శాతవాహన కాలంలో రూపొందిన ఆ స్తూపమే కాకుండా, ఇక్ష్వాకులు, విష్ణుకుండినుల కాలంలో బౌద్ధం అక్కడ గొప్పగా అలరారింది. బౌద్ధ భిక్షువుల ప్రార్థనలతో మార్మోగింది. వారికి భిక్ష వేసే కుటుంబాలతో కూడిన గ్రామాలు వెలిశాయి. విహారాలు, చైత్యాలు, ఆరామాలు నిర్మితమయ్యాయి. ఇతర ప్రాంతాల నుంచి బౌద్ధ భిక్షువుల రాక, వారి అవసరాలకు వీలుగా మొదలైన వాణిజ్యం ఆ ప్రాంతంలో కొనసాగింది. 

అందుకే అక్కడ అలనాటి వస్తువులు, నాణేలు, విగ్రహాలు ఎన్నో లభించాయి. మహా స్తూపం వెలుగులోకి వచ్చిన తర్వాత చరిత్రకారులు కృష్ణశాస్త్రి ఆధ్వర్యంలో 1976–78 మధ్య సమీపంలోని బైరాగులగుట్ట, ముజ్జుగూడెం, వల్లభి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో బుద్ధుడి నిలువురూపంతో కూడిన భారీ శిల్పాలు వెలుగుచూశాయి. ఒకేచోట తొమ్మిది సున్నపురాతి శిల్పాలు కనిపించటంతో, అది భారీ శిల్ప తయారీ కేంద్రంగా తేల్చారు. కానీ, ఆ తవ్వకాలు అర్ధాంతరంగా ఆపేశారు. ఆ తర్వాత మళ్లీ పెద్దస్థాయి తవ్వకాలకు పూనుకోకపోవటంతో తదుపరి కొత్త కట్టడాల వివరాలు వెలుగుచూడలేదు. 

వెలుగుచూస్తున్న నిర్మాణ అవశేషాలు 
ఇటీవల మహాస్తూప ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్రప్రభుత్వం రూ.4.26 కోట్లు కేటాయించడంతో ఆ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర పురావస్తు శాఖ సంచాలకులు అర్జున్‌రావు, డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజులతో కూడిన బృందం వెళ్లింది. అక్కడికి 2 కి.మీ. దూరంలోని బైరాగులగుట్ట ప్రాంతంలో అలనాటి అవశేషాలున్నాయని తెలియడంతో అక్కడికి చేరుకున్నారు. పొలం దున్నుతుండగా సున్నపురాతితో చేసిన భారీ ప్యానెల్స్‌ బయటకు రావటంతో రైతులు వాటిని సమీపంలోని తుప్పల్లో వేశారు. 

వాటిని చూసి అవాక్కవడం అధికారుల వంతైంది. అవి మూడో శతాబ్దంలో ఇక్ష్వాకుల కాలంలో రూపొందిన బౌద్ధ ప్యానెల్స్‌. స్తూపాలు, విహారాల, ఆరామాల్లో వాటిని వినియోగిస్తారు. చాలా ప్రాంతాల్లో దున్నుతుండగా ఇలాంటి ఎన్నో నిర్మాణ అవశేషాలు వెలుగుచూస్తుండగా రైతులు వాటిని దూరంగా పారేస్తున్నారు. ఇంత కాలం ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో ఆ నిర్మా ణాలు మట్టి పొరల్లోనే ఉంటూ వస్తున్నాయి. ఇలాగే వదిలేస్తే, భవిష్యత్తులో తవ్వనా దొరికేందుకు ఏవీ మిగలవు. వెంటనే ప్రభుత్వం లైడార్‌ సర్వే ద్వారా వేల ఏళ్లనాటి చారిత్రక సాక్ష్యాలను వెలుగులోకి తేవాలని చరిత్ర పరిశోధకులు కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement