భారత్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ‘వియోనా’ యూపీఐ స్విచ్‌ సేవలు | Viyona Fintech Goes Live with UPI Switch at Bharat Cooperative Bank | Sakshi
Sakshi News home page

భారత్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో ‘వియోనా’ యూపీఐ స్విచ్‌ సేవలు

Sep 4 2026 12:35 PM | Updated on Sep 4 2026 12:45 PM

Viyona Fintech Goes Live with UPI Switch at Bharat Cooperative Bank

దేశీయ డిజిటల్ చెల్లింపుల మౌలిక సదుపాయాల రంగంలో హైదరాబాద్‌కు చెందిన ఫిన్‌టెక్‌ సంస్థ వియోనా ఫిన్‌టెక్‌ కీలక మైలురాయిని అధిగమించింది. భారత్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌లో తన యూపీఐ స్విచ్‌ (UPI Switch) సాంకేతికతను విజయవంతంగా అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. ఈ సాంకేతిక అనుసంధానం ద్వారా భారత్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇకపై నేరుగా యూపీఐ నెట్‌వర్క్‌తో అనుసంధానమై లావాదేవీల రూటింగ్, పర్యవేక్షణ, ఆపరేషనల్ కంట్రోల్స్ నిర్వహించనుంది.

కేవలం యాప్‌లు నిర్మించడమే కాకుండా బ్యాంకింగ్ రంగానికి అవసరమైన సాంకేతిక మౌలిక వసతులను అందించడంపై వియోనా దృష్టి సారించింది. యూపీఐ, ఐఎంపీఎస్ స్విచింగ్, ఇంటర్నెట్-మొబైల్ బ్యాంకింగ్, భారత్ కనెక్ట్ (బీబీపీఎస్‌) సహా మర్చంట్ పేమెంట్స్, రికవరీలకు సంబంధించిన సమగ్ర సేవలను ఈ సంస్థ అందిస్తోంది.

‘సాంకేతికతను అభివృద్ధి చేసి సర్టిఫికేషన్ పొందడం ఒక ఎత్తైతే, ఒక ప్రధాన బ్యాంకింగ్ వ్యవస్థలో ప్రత్యక్ష లావాదేవీలను సమర్థవంతంగా నిర్వహించడం మరో ఎత్తు. ఈ విజయంతో మరింత విస్తృతంగా సేవలు అందించే అవకాశం లభించింది’ అని వియోనా ఫిన్‌టెక్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ రవీంద్రనాథ్ యార్లగడ్డ తెలిపారు. కస్టమర్ క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి చెల్లింపు చేసే కొద్ది సెకన్ల వ్యవధిలో వ్యవస్థ వెనుక జరిగే సురక్షిత లావాదేవీల ప్రక్రియే డిజిటల్ చెల్లింపుల విశ్వసనీయతను నిర్దేశిస్తుందని ఆయన పేర్కొన్నారు.

భద్రత, నియంత్రణ నిబంధనలకు లోబడి తమ సాంకేతికతను ఆధునీకరించుకోవాలనుకునే కో-ఆపరేటివ్, ప్రాంతీయ బ్యాంకులను ప్రధాన అవకాశంగా వియోనా భావిస్తోంది. దేశీయ ఇంజినీర్లతో రూపొందించిన ఈ యూపీఐ స్విచింగ్ సాంకేతికత రాబోయే రోజుల్లో ఇతర బ్యాంకులను ఆకర్షిస్తుందని కంపెనీ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: డిజిటల్ విప్లవంలో జియో పదేళ్ల ప్రస్థానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement