'ఇది బీజేపీ పనే, సీసీటీవీ ఫుటేజీ ఇదిగో' | Abhishek Banerjee: This is what the BJP has done to my party office | Sakshi
Sakshi News home page

టీఎంసీ కార్యాలయంపై దుండగుల దాడి: అభిషేక్‌ బెనర్జీ

Sep 4 2026 3:04 PM | Updated on Sep 4 2026 3:33 PM

 Abhishek Banerjee: This is what the BJP has done to my party office

కోల్‌కతా: బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని కామాక్‌ స్ట్రీట్‌లో ఉన్న టీఎంసీ కార్యాలయంపై దుండగులు దాడి చేశారని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఈ ఘటన వెనుక బీజేపీ హస్తముందన్నారు. ‘విధ్వంసం, హింస, అరాచకం.. బీజేపీ కార్యకర్తలకు చట్టం, న్యాయవ్యవస్థ అంటే లెక్కలేనట్లుగా కనిపిస్తోంది’ అని అభిషేక్‌ వ్యాఖ్యానించారు. నెల రోజుల వ్యవధిలోనే బీజేపీ గూండాలు కోల్‌కతాలోని అమ్తాలా, కామాక్‌ స్ట్రీట్‌ పార్టీ కార్యాలయాలను నాశనం చేశారన్నారు. కోల్‌కతా పోలీసులు తమ ఫోన్‌కాల్స్‌కు, ఈమెయిల్స్‌కు దాడి జరిగిన రెండు గంటల వరకు స్పందించలేదని అభిషేక్‌ ఆరోపించారు.

గురువారం వేకువజామున 4.30 గంటల వేళ దుండగులు మాస్క్‌లు, హెల్మెట్లు ధరించి కార్యాలయంలోకి జొరబడ్డారని, సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేసి, లోపలున్న ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారన్నారు. సిబ్బంది వద్ద సెల్‌ఫోన్లు, లోపలున్న టీవీలను ఎత్తుకుపోయారని చెప్పారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను ఆయన ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

అభిషేక్‌ ఆరోపణలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామిక్‌ భట్టాచార్య కొట్టిపారేశారు. తాము ప్రతీకార రాజకీయాలకు పాల్పడబోమని, పార్టీ కార్యాలయాలపై దాడులకు మద్దతివ్వబోమని స్పష్టం చేశారు. ఈ విధ్వంసంతో బీజేపీ కార్యకర్తలకు ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు. కాగా, టీఎంసీ కార్యాలయంపై దాడి ఘటనకు సంబంధించి ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు వీరు టీఎంసీలోనే ఉన్నట్లు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని చెప్పారు.

బీజేపీ నేతల ఇళ్ల వద్ద ధర్నాలు చేస్తాం: మమతా బెనర్జీ 
కామాక్‌ స్ట్రీట్‌ టీఎంపీ కార్యాలయంపై దాడిని మాజీ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీ నేతలు, కార్యాలయాలపై ఇదే విధంగా దాడులు కొనసాగిన పక్షంలో తాము ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఢిల్లీలోని బీజేపీ నేతల నివాసాల ఎదుట ధర్నాకు దిగుతామని ఆమె హెచ్చరించారు. కామాక్‌ స్ట్రీట్‌ కార్యాలయంలోని పరికరాలు, పత్రాలను బీజేపీ మనుషులు ఎత్తుకుపోయారన్నారు. ఇదంతా కోల్‌కతా పోలీసులకు తెలిసే జరిగిందన్నారు. బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగుజారుతున్నాయనేందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ అని చెప్పారు. బెంగాల్‌లో బీజేపీ అరాచకత్వానికి తెరతీసిందని మమత విమర్శించారు.

ఇదీ చదవండి: కాక్రోచ్‌ జనతాపార్టీలో తిరుగుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement