12న మోదీ-జిన్‌పింగ్‌ భేటీ! | Modi, Xi Bilateral Talks Likely at BRICS | Sakshi
Sakshi News home page

12న మోదీ-జిన్‌పింగ్‌ భేటీ!

Sep 10 2026 10:53 AM | Updated on Sep 10 2026 10:57 AM

Modi, Xi Bilateral Talks Likely at BRICS

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ మధ్య సెప్టెంబరు 12న న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్‌ సదస్సు సందర్భంగా భేటీ జరిగే అవకాశముంది. 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ అనంతరం ఇరువురు నేతలు ముఖాముఖిగా ద్వైపాక్షిక చర్చలు జరపడం ఇదే తొలిసారి కానుంది. అయితే ఈ భేటీపై భారత్‌, చైనా ఇప్పటివరకు అధికారిక ప్రకటన చేయలేదు. 18వ బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు సెప్టెంబరు 12, 13 తేదీల్లో భారత్‌ ఆతిథ్యంలో జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు జిన్‌పింగ్‌ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు. ఏడేళ్ల తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఇటీవల కిర్గిజిస్థాన్‌లోని బిష్కెక్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సులో మోదీ, జిన్‌పింగ్‌ కలుసుకుని కరచాలనం చేసినప్పటికీ, అధికారిక ద్వైపాక్షిక సమావేశం నిర్వహించలేదు.

జిన్‌పింగ్‌ పర్యటనకు ముందు జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ చైనాలో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. భారత్‌-చైనా సరిహద్దు వ్యవహారాలపై వర్కింగ్‌ మెకానిజం ఫర్‌ కన్సల్టేషన్‌ అండ్‌ కోఆర్డినేషన్‌ (డబ్ల్యూఎంసీసీ) సమావేశం కూడా జరిగింది. అనంతరం సరిహద్దు అంశంపై ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు చర్చించారు. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి పలు ఘర్షణ ప్రాంతాల నుంచి సైన్యాల ఉపసంహరణతో సంబంధాల్లో క్రమంగా స్థిరత్వం కనిపిస్తోంది.

2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. చైనా తన నలుగురు సైనికులు మరణించినట్లు తర్వాత వెల్లడించింది. ఈ ఘటనతో ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన, రాజకీయ, ఆర్థిక, దౌత్య సంబంధాల్లో తీవ్ర ఒత్తిడి ఏర్పడింది. సైనిక, దౌత్య చర్చల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ విస్తృత సరిహద్దు వివాదం ఇంకా పరిష్కారం కాలేదు.

అరుణాచల్‌ప్రదేశ్‌ అంశం కూడా ఇరు దేశాల మధ్య కీలక వివాదంగా కొనసాగుతోంది. మొత్తం అరుణాచల్‌ను చైనా ‘జాంగ్నాన్‌’ లేదా దక్షిణ టిబెట్‌గా పేర్కొంటూ హక్కు కోరుతోంది. భారత్‌ ఆ వాదనను తిరస్కరిస్తూ అరుణాచల్‌ప్రదేశ్‌ దేశంలో అంతర్భాగమని స్పష్టం చేస్తోంది. ఇటీవల అప్పర్‌ సుబన్‌సిరి ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు, దూకుడు వైఖరిపై వచ్చిన నివేదికలు ఆందోళన పెంచాయి.

మోదీ-జిన్‌పింగ్‌ భేటీలో సరిహద్దు సమస్య, ప్రాంతీయ భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజల మధ్య సంబంధాలు, ఎల్‌ఏసీ వెంబడి మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలు చర్చకు వచ్చే అవకాశముంది. బ్రిక్స్‌ సహా బహుపాక్షిక వేదికల్లో సహకారం పెంపుపైనా ఇరువురు నేతలు దృష్టి సారించే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement