breaking news
PM KUSUM
-
‘పీఎం కుసుమ్’లో దళారీలు!
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుమ్) కింద ఒకటి, రెండు మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే అవకాశం పొందిన రాష్ట్ర రైతులపై దళారీలు గద్దల్లా వాలుతున్నారు. ఈ పథకం లాభదాయకం కాదని.. సాంకేతిక పరిజ్ఞానం లేనందున గిట్టుబాటుకాక నష్టపోతారని ప్రచారంచేస్తూ ఒత్తిడి తెస్తున్నారు. ఎకరాకు లీజు కింద రూ. 33 వేలు చెల్లిస్తామని.. ఏటా దాన్ని 10 శాతం పెంచుతామని ప్రలోభాలకు గురిచేస్తూ అనుమతులను తమకు ఇచ్చేయాలని దళారులతోపాటు సౌర ఫలకాల తయారీ సంస్థలు నేరుగా రైతులకే ఫోన్లు చేస్తున్నాయి. అర్హత ఉన్న వారికి ఉద్యోగం కూడా కల్పిస్తామని నమ్మబలుకుతున్నాయి. 3 వేల మెగావాట్లు కాస్తా.. వాయు కాలుష్యానికి కారణమయ్యే డీజిల్ పంపుసెట్ల స్థానంలో సౌరశక్తితో నడిచే పంపుసెట్లను రైతులు ఉపయోగించేలా ప్రోత్సహించడంతోపాటు వారు అదనపు ఆదాయం పొందేందుకు 2 మెగావాట్ల వరకు సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసే ఉద్దేశంతో కేంద్రం పీఎం కుసుమ్ పథకాన్ని తీసుకొచ్చింది. సోలార్ పంపుసెట్లపై 30 శాతం నుంచి 50 శాతం వరకు రాయితీ కూడా అందిస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 3,000 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందుకోసం మెగావాట్‌కు దాదాపు రూ. లక్ష వరకు ఈఎండీ (ఎర్నెస్ట్ మనీ డిపాజిట్) చెల్లించాలని పేర్కొంది. 25 ఏళ్లపాటు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్‌ను యూనిట్‌కు రూ. 3.13 చొప్పున కొనేలా ఒప్పందం (పీపీఏ) చేసుకుంటాయని వెల్లడించింది. ఇందుకోసం బ్యాంకులు రుణాలు కూడా మంజూరు చేస్తాయని వివరించింది. అయితే సొంత భూమి లేదా లీజుకు తీసుకున్న భూమి ఉంటేనే ఈ పథకం కింద రైతులు అర్హులని పేర్కొంది. దీంతో దాదాపు 6,000 మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులు వచ్చాయి. అయితే తాము నిర్దేశించిన గడువులోగా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించలేదంటూ కేంద్రం 3,000 మెగావాట్ల పథకాన్ని కాస్తా 1,000 మెగావాట్లకు కుదించింది. రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో చివరకు ఈ పథకాన్ని 1,450 మెగావాట్లకు పెంచింది. రైతులు, రైతు బృందాలు, స్వయం సహాయక బృందాలు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు, ప్రైవేటు వ్యక్తులు 6,000 మెగావాట్ల కోసం దరఖాస్తు చేసినా ఈఎండీ చెల్లించింది మాత్రం 1,600 మెగావాట్లకే కావడంతో ఈ ఏడాది 1,450 మెగావాట్లకు మాత్రమే అనుమతులిచ్చే అవకాశం ఉంది. 65 శాతం రైతుల నుంచే.. ప్రభుత్వానికి అందిన దరఖాస్తుల్లో సుమారు 65 శాతం రైతుల నుంచే వచ్చాయని విశ్వసనీయంగా తెలిసింది. అయితే ఎక్కువ మంది రైతులు ఒకటి, ఒకటిన్నర మెగావాట్ కోసం దరఖాస్తు చేసుకోగా కొందరు రెండు మెగావాట్లకు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ప్రభుత్వం నుంచి లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ పొందిన రైతుల వద్దకు దళారులు ప్రత్యక్షమవుతున్నారు. ఆయా రైతులు ఆది, సోమవారాల్లో దక్షిణ డిస్కంతో పీపీఏలు కుదుర్చుకోవడానికి రాగా అక్కడ కూడా వారిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. కొందరు ఉద్యోగులు కూడా దళారులకు వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. కాగా, విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పడానికి ఎక్కువగా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా నుంచి అధికంగా దరఖాస్తులు వచ్చినట్లు టీజీ రెడ్కో అధికారులు వివరించారు. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 70 నుంచి 80మంది రైతులతో పీపీఏలు కుదుర్చుకుంది. ఎస్పీడీసీఎల్ జూలై 7 వరకు పీపీఏ ప్రక్రియ కొనసాగుతుందని ఓ అధికారి వివరించారు. మెగావాట్‌కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుత్.. సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో ఒక మెగావాట్‌కు ఏడాదికి 16 లక్షల యూనిట్ల విద్యుదుత్పత్తి అవుతుందని అంచనా. సోలార్ ప్యానెల్స్ మేలు రకమైనవి అయితే ఇంకాస్త విద్యుత్ ఉత్పత్తి అవుతుందని అధికార వర్గాల సమాచారం. పీపీఏలు చేసుకున్న తర్వాతే బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నాయి. అయితే ఒక మెగావాట్‌కు మూడు కోట్ల వరకు వ్యయం అవుతుండగా బ్యాంకులు మాత్రం మెగావాట్‌కు రూ. 2 కోట్ల వరకు మాత్రమే రుణాలు ఇవ్వడానికి అంగీకరిస్తున్నాయని.. మిగిలిన నిధులకూ పూచీకత్తు ఇవ్వాలంటున్నారని ఔత్సాహిక రైతులు రఘురామ్, అర్జున్ వివరించారు. 25 ఏళ్ల వరకు పీపీఏలు ఉన్న నేపథ్యంలో మొదట్లో భారీగా ఆదాయం రాకపోయినా పదేళ్ల తరువాత నిర్వహణ వ్యయం పోనూ ఏటా రూ. 15–20 లక్షల వరకు ఆదాయం లభించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. -
పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ సౌలబ్యాన్ని రైతులకు అందించాలనే ఉద్దేశ్యంతో కేంద్ర ప్రభుత్వం 2019లో 'ప్రధాన్ మంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్' (పీఎం కుసుమ్) స్కీమ్ ప్రవేశపెట్టింది. ఈ పథకం ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉంది. రైతులకు దీని మీద పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ ఎక్కువగా అమలు కాలేదు. ఇప్పుడు రైతులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ ఏడాది ప్రారంభమైన 'పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన' మాదిరిగానే.. ఇప్పుడు రైతులు ఈ సోలార్ పంప్ ఇన్స్టాలేషన్ కోసం నేషనల్ పోర్టల్ ద్వారా విక్రేతలతో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇది రైతులు ఇష్టపడే సోలార్ పంపుల రకాన్ని ఎంచుకోవడంలో మాత్రమే కాకుండా ఇన్స్టాలేషన్ సమయాన్ని తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది.కుసుమ్ యోజన స్కీమ్ అనేది మూడు భాగాలుగా ఉంటుంది. అవి 10000 మెగావాట్ల సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయడం, 2 మిలియన్ స్టాండ్-అలోన్ సోలార్ అగ్రికల్చర్ పంపులను ఏర్పాటు చేయడం, 1.5 మిలియన్ వ్యవసాయ పంపులను సోలారైజ్ చేయడం. వ్యవసాయ పంపుల ఇన్స్టాలేషన్, సోలారైజేషన్ కోసం హేతుబద్ధీకరణ కోసం చర్చలు జరుగుతున్నాయి. కానీ సబ్సిడీలో ఎటువంటి మార్పులు లేదు. కేంద్రం దీనికోసం రూ.34,422 కోట్లు కేటాయించింది.సోలార్ పంప్ ఇన్స్టాలేషన్లు, సోలారైజేషన్ కోసం కేంద్రం 30% సబ్సిడీని అందిస్తుంది. రాష్ట్రాలు కూడా 30 శాతం సబ్సిడీ అందిస్తాయి. ఈ పథకం కోసం బ్యానుకులు కూడా తక్కువ వడ్డీకి లోన్స్ అందిస్తాయి. అయితే కేంద్రంతో పాటు రాష్ట్ర సబ్సిడీ కాంపోనెంట్ కూడా పోర్టల్‌లో పేర్కొనటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు.రైతు తాను ఏర్పాటు చేసుకున్న సోలార్ పంపుసెట్ నుంచీ తాను వాడుకోగా మిగిలిన సోలార్ పవర్‌ను డిస్కంలకు విక్రయించుకోవచ్చు. దీని ద్వారా రైతు డబ్బు కూడా సంపాదించుకోవచ్చు. అయితే దీనికోసం రైతులు ఆయా డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. డిస్కంలతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి 25 సంవత్సరాల వరకు రైతుల నుంచి కరెంటు కొంటారు.ఇదిలా ఉండగా.. ఫిబ్రవరిలో 10 మిలియన్ల గృహాలకు రూఫ్‌టాప్ సోలార్ యూనిట్లను ఇన్స్టాల్ చేయాలనే లక్ష్యంతో ప్రారంభమైన పీఎం సూర్యఘర్ ముఫ్ట్ బిజిలీ యోజన పథకానికి ఇప్పటి వరకు 8,00,000 దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.