సాక్షి, కాకినాడ: కూటమి ప్రభుత్వం చేతిలో మోసపోయామంటూ నిరుద్యోగులు, రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఆశ్రయిస్తున్నారని మాజీ మంత్రి కన్నబాబు అన్నారు. శనివారం కాకినాడలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు తీర్చడంతో ప్రభుత్వం విఫలమవడం వల్లే.. అమరావతి రైతులు మొదలుకుని డీఎస్సీ అభ్యర్థుల వరకు ప్రతి ఒక్కరూ వైఎస్ జగన్ ముందే గోడు వెళ్లబోసుకుంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ప్రజల సమస్యలు పరిష్కరిస్తే తండోపతండాలుగా జగన్ వద్దకు ఎందుకు వస్తారో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రస్తుతం బీజేపీ, జనసేన కూటమిలో భాగస్వామ్యులైతే కాంగ్రెసేమో వారికి రహస్య మిత్రులని ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీసే ఏకైక మెునగాడు వైఎస్ జగన్ అన్నారు. వామపక్షాలు స్పందిస్తున్నా.. ప్రభుత్వాన్ని ఉధృతంగా నిలదీసే శక్తి కేవలం వైయస్ జగన్‌కే ఉంది. మూడు ప్రాంతాల్లో మూడు సభలు పెడతామంటున్న కూటమి నేతలు, ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చామని గుండెల మీద చేయి వేసుకుని, దేవుడిపై ప్రమాణం చేసి చెప్పగలరా? ఆడబిడ్డ నిధి కింద 18 నుండి 50 ఏళ్ల మహిళలకు ప్రతి నెలా రూ.1500 ఇస్తామన్న హామీ ఏమైంది? నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతిని ఇవాల్టికి ఒక్క నిరుద్యోగికైనా ఇచ్చామని చెప్పగలరా? అని అడిగారు.
జగన్ ఇచ్చిన 'అమ్మఒడి'ని కాపీ కొట్టి 'తల్లికి వందనం' అని పేరు మార్చారని అయినప్పటికీ పథకం అమలులో కనీసం పాస్ మార్కులు తెచ్చుకోలేదన్నారు. ఎంత మంది పిల్లలుంటే అంత మందికీ 'తల్లికి వందనం' ఇస్తామన్న మాటను తుంగలో తొక్కారు. తల్లికి వందనం పథకంలో ఏకంగా 20 లక్షల మంది విద్యార్థులకు కూటమి ప్రభుత్వం మొండిచేయి చూపింది. రూ.13,112 కోట్ల బడ్జెట్ అవసరమైతే.. కూటమి ప్రభుత్వం కేటాయించింది కేవలం రూ.8,456 కోట్లే అన్నారు. ఆక్వా రైతులను ఆదుకోకుండా.. నిన్న ఎక్స్‌పోలో 'బ్లూ ఎకానమీ' అంటూ బాబు గొప్పలు చెప్తున్నారు.
జగన్ హయాంలో ఆక్వా రైతులకు కరెంట్ సబ్సిడీ ఇచ్చి, రొయ్యల మేత ధరలు పెరగకుండా నిలబెట్టాం. కూటమి రాగానే రొయ్యల మేత ధరలు ఎందుకు పెరిగాయి?.. సీజన్ వచ్చేసరికి రొయ్యల ధరలు ఎందుకు పడిపోతున్నాయని మాజీ మంత్రి కన్నబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.


