తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేస్తున్న నిరుద్యోగులు
ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని వైఎస్ జగన్‌కు నిరుద్యోగుల విజ్ఞప్తి
సాక్షి, అమరావతి: గ్రూప్–1, గ్రూప్–2 ఉద్యోగాలకు అభ్యర్థుల వయోపరిమితిని 44 ఏళ్ల నుంచి 47 ఏళ్లకు పెంచేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావాలని కోరుతూ మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పలువురు నిరుద్యోగులు వినతిపత్రం అందజేశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని కేవలం రెండేళ్లు మాత్రమే సడలించడం వల్ల అనేక మంది అభ్యర్థులకు అవకాశం లేకుండా పోతోందని చెప్పారు. రెగ్యులర్‌గా ఉద్యోగ నోటిఫికేషన్లు రాకపోవడం వల్ల పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వయోపరిమితిని దాటిపోయారని వివరించారు.
వయోపరిమితిని 42 ఏళ్ల నుంచి 44 ఏళ్లకే పెంచారని.. దీనిని 47 ఏళ్లకు పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. గతంలో ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచినప్పుడు.. పోటీ పరీక్షల అభ్యర్థుల వయోపరిమితిని కూడా 47 ఏళ్లకు పెంచాలని టీడీపీ నేతలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేసిన విషయా న్ని వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వయోపరిమితి అంశంపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్‌ను కోరారు. జగన్ స్పందిస్తూ.. సమస్యను పరిశీలించి అవసరమైన విధంగా ప్రస్తావిస్తామని భరోసా ఇచ్చారు. జగన్‌ను కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, నిరుద్యోగ అభ్యర్థులు ఆర్.శ్రీనివాసరావు, కిరణ్‌కుమారి, కె.రాజ్‌కోటి తదితరులున్నారు.


