‘ఎఫ్‌బీఐ’ పేరుతో ఆగని ఆగడాలు | Guntur police complaint citing the FBI regarding post by journalist Dhanya Rajendran | Sakshi
Sakshi News home page

‘ఎఫ్‌బీఐ’ పేరుతో ఆగని ఆగడాలు

Sep 18 2026 5:36 AM | Updated on Sep 18 2026 5:36 AM

Guntur police complaint citing the FBI regarding post by journalist Dhanya Rajendran

చంద్రబాబు సర్కారు రెడ్‌బుక్‌ అరాచకాలకు పోలీసులు జీ హుజూర్‌ 

జర్నలిస్ట్‌ ధన్య రాజేంద్రన్‌ పోస్టుపై ఎఫ్‌బీఐ పేరుతో గుంటూరు పోలీసుల ఫిర్యాదు

దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు తెరతీసిన గుంటూరు పోలీసుల ఎఫ్‌బీఐ అవతారం

రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌తోపాటు సీనియర్‌ జర్నలిస్టులు, మేధావుల ప్రశ్నల వర్షం

వార్త రాస్తే నేరమా? గుంటూరులో ఎఫ్‌బీఐ ఎప్పుడు పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరువు పోతున్నా ఖాతరు చేయకుండా గుంటూరు పోలీసులు మరింత బరి తెగిస్తున్నారు! ప్రఖ్యాత దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) పేరును దుర్వినియోగం చేయడానికి ఏమాత్రం సిగ్గు పడటంలేదు. ఎక్స్‌ ఖాతాల్లో వందలాది పోస్టుల తొలగింపే లక్ష్యంగా ఎఫ్‌బీఐ పేరుతో దొంగ ఫిర్యాదులు చేస్తున్న గుంటూరు పోలీసుల నిర్వాకం గురువారం మరొకటి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ జర్నలిస్ట్, ది న్యూస్‌ మినిట్‌ ప్రధాన సంపాదకురాలు ధన్య రాజేంద్రన్‌ ఎక్స్‌ ఖాతాపై గుంటూరు పోలీసులు చేసిన ఫిర్యాదులో ఎఫ్‌బీఐగా పేర్కొనడం మరోసారి జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతోంది.

దేశవ్యాప్తంగా మరోసారి చర్చకు తెరతీసిన గుంటూరు పోలీసుల ఎఫ్‌బీఐ అవతారం నవ్వులపాలు చేసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ పీవీ రమేష్‌తోపాటు దేశవ్యాప్తంగా సీనియర్‌ జర్నలిస్టులు, మేధావులు దీనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. విమర్శిస్తే టేక్‌డౌన్‌ ఫిర్యాదులా?... పోలీసుల పని ఇదేనా? అంటూ నిలదీస్తున్నారు. గుంటూరులో ఎఫ్‌బీఐ ఎప్పుడు పెట్టారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తు­న్నారు. వార్త రాస్తే నేరమా? అంటూ మండిపడుతున్నారు.

గుంటూరుకు సంబంధించిన ఓ ఘటనపై ధన్య రాజేంద్రన్‌ పెట్టిన పోస్టును తొలగించాలంటూ పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో ‘ఎక్స్‌’కు ఫిర్యాదు చేశారన్న వార్త వెలుగులోకి రావడంతో.. ఇది కేవలం ఒక పోస్టు వ్యవహారం కాదని, ఏపీ పోలీసులు తమ అధికారాన్ని సామాజిక మాధ్యమాలపై ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు అద్దం పడుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ విధులు నిర్వర్తించాల్సిన పోలీసులు సామాజిక మాధ్యమాల్లో విమర్శలను ఎదుర్కోలేక నకిలీ పేర్లతో ఫిర్యాదు చేయటాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు.

ఒక్క పోస్టు.. దేశవ్యాప్త చర్చ..
గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐగా మారారా..? అంటూ బెంగళూరుకు చెందిన జర్నలిస్ట్‌ ధన్య రాజేంద్రన్‌ పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. తన ఖాతాలోని ఓ పోస్టుపై గుంటూరు అర్బన్‌ ఎస్పీ మెయిల్‌ నుంచి సీఐ ఏవీ బ్రహ్మం పేరుతో ఎక్స్‌కు చేసిన ఫిర్యాదులో వాస్తవాలను మరుగునపరిచి అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐగా పేర్కొనడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈమేరకు గుంటూరు పోలీసుల ఫిర్యాదును ట్యాగ్‌ చేస్తూ ధన్య రాజేంద్రన్‌ పోస్టు పెట్టారు.

ది న్యూస్‌ మినిట్‌ ప్రధాన సంపాదకురాలిగా ధన్య రాజేంద్రన్‌ చమేలి దేవి జైన్‌ అవార్డు, రెడ్‌ ఇంక్‌ జర్నలిస్ట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ పురస్కారాలు అందుకున్నారు. 3.37 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న ఆమె ఎక్స్‌ ఖాతాలో ఏపీ పోలీసులపై పెట్టిన పోస్టు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, మాజీ అధికారులు ఘాటుగా స్పందించారు. 

‘ఇదేనా మీ పని?’
ఏపీ పోలీస్‌ 100ను ట్యాగ్‌ చేస్తూ సీనియర్‌ జర్నలిస్ట్‌ ధన్య రాజేంద్రన్‌ ఘాటుగా స్పందించారు. ‘‘హాయ్‌ ఏపీ పోలీస్‌ 100.. ఇదేనా మీ పని? కథనాలను తొలగించాలని అభ్యర్థనలు పంపడమా? అదీ ఒక సాధారణ స్థాయి టీడీపీ వ్యక్తికి సంబంధించిన విషయంపై? సిగ్గుచేటు.. దానికి బదులుగా నిజంగా ప్రజలకు సహాయపడేందుకు మీ సమయాన్ని వెచ్చించండి’’ అని సూచిస్తూ, గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో చేసిన ఫిర్యాదును పోస్టు చేశారు. అసమ్మతిని తెలిపే పోస్టులను భారత చట్టాల ఉల్లంఘనలుగా పేర్కొంటూ ఎక్స్‌కు ఫిర్యాదులు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఫిర్యాదు అందిన కంటెంట్‌ను కేవలం భారత్‌లోనే తొలగించేలా చర్యలు కోరుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘ఎఫ్‌బీఐ–గుంటూరు’ అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌కు ఘాటుగా బదులిచ్చిన ధన్య రాజేంద్రన్‌
గుంటూరులో ఓ మహిళ వస్త్రాపహరణ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని బాధిత మహిళ, ఆమె కుమారుడిని కలిసినప్పుడు విజ్ఞప్తి చేసినట్లు ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ పేర్కొన్నారు. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఆమె చేసిన పోస్టుపై ధన్య రాజేంద్రన్‌ ఘాటుగా బదులి­చ్చారు.‘‘నేను ఎలాంటి వీడియో పోస్ట్‌ చేయలేదు. ఆ కథనంలో కూడా ఎటువంటి వీడియో లేదు. ఇలాంటి ఘటనల గురించి మేం వార్తలు రాయకూడదని మీరు అంటున్నారా? లైంగిక హింసకు గురైన బాధితులందరూ తమ గురించి వార్తలు వచ్చేటప్పుడు గౌరవం దక్కాలని కోరుకుంటారు. ఆ విషయంలో మేం ఎప్పుడూ రాజీ పడం’’ అని ఆమె స్పష్టం చేశారు.

‘మీడియాను వేధించడమే  పనిగా పెట్టుకున్నారా?’
ధన్య రాజేంద్రన్‌ పోస్టును ట్యాగ్‌ చేస్తూ సీనియర్‌ జర్నలిస్టు చిత్రా సుబ్రమణ్యం ఏపీ పోలీసుల తీరును ప్రశ్నించారు. మీడియాను వేధించేందుకు ఏపీ పోలీస్‌ 100 ఎప్పటి నుంచి నిర్ణయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జర్నలిస్టులు, ప్రతిపక్షాలకు టేక్‌డౌన్‌ నోటీసులు పంపుతున్నారంటూ విమర్శించారు.

ఎఫ్‌బీఐగా నటిస్తూ ఫిర్యాదు ఎందుకు?’
మాజీ ఐఏఎస్‌ అధికారి పీవీ రమేష్‌ ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు. ధన్య రాజేంద్రన్‌ పోస్టును ట్యాగ్‌ చేస్తూ..‘‘గుంటూరు అర్బన్‌ ఎస్పీ ఎందుకు ఎఫ్‌బీఐగా నటిస్తూ సీనియర్‌ జర్నలిస్టు ధన్య రాజేంద్రన్‌ ఖాతాను తొలగించాలని ఫిర్యాదు చేశారు?’’ అని ప్రశ్నించారు. ఈ చర్యను ‘స్పష్టమైన నేరపూరిత దుష్ప్రవర్తన’గా అభివర్ణించిన ఆయన.. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవా­ల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు పోలీసులు ఎఫ్‌బీఐ పేరుతో చేస్తున్న చర్యలకు సీఎం, హోంమంత్రి, మంత్రి నారా లోకేశ్, డీజీపీ, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌ అనుమతి ఉందా? అని సంబంధిత ఖాతాలను హ్యాష్‌ ట్యాగ్‌ చేస్తూ ప్రశ్నించారు. 

‘వాస్తవాలు చెబితే టేక్‌డౌన్‌ నోటీసులా?’
ఆల్ట్‌ న్యూస్‌ సహ వ్యవస్థాపకుడు, ఫ్యాక్ట్‌ చెక్కర్‌ మ­హ్మద్‌ జుబేర్‌ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పంది­ం­చారు. ‘జర్నలిస్టులకు, ప్రతిపక్షాలకు టేక్‌డౌన్‌ నోటీ­æ­సులను ఏపీ పోలీసులు ఎందుకు పంపుతు­న్నా­రు? హల్లో.. ఏపీ డీజీపీ, నారా లోకేశ్‌.. వాస్త­వా­లు చెప్పి­నందుకు ఏపీ పోలీసులు ఎక్స్‌ ద్వా­రా టేక్‌­డౌన్‌ నోటీ­సు­­ల­తో ఎందుకు బెదిరిస్తు­న్నారు?’’ అని ప్రశ్నించా­రు.

‘ఇది చాలా విచిత్రంగా ఉంది’
ది సౌత్‌ ఫస్ట్‌ డాట్‌కామ్‌ ఎడిటర్, సీనియర్‌ జర్నలిస్టు అనుష రవి సూద్‌ కూడా ధన్య రాజేంద్రన్‌ పోస్టును ట్యాగ్‌ చేస్తూ స్పందించారు. ఆమె పెట్టిన పోస్టును తొలగించాలని ఏపీ పోలీసులు ఎక్స్‌కు ఫిర్యాదు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు మరోసారి ఎఫ్‌బీఐగా వ్యవహరి­స్తున్నారని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఇలాంటి పద్ధతులను ఎందుకు ఆశ్రయిస్తున్నారని ప్రశ్నించారు. ఇది చాలా విచిత్రంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

టేక్‌డౌన్‌ ఫిర్యాదులపై స్పష్టత ఏదీ?
చంద్రబాబు సర్కారు ఆదేశాలతో చెలరేగిపోతున్న ఏపీ పోలీసుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జర్నలిస్టులు, మాజీ అధికారులు, సామాజిక కార్యకర్తల పోస్టులకు సంబంధించి పోలీసులు ఎక్స్‌కు చేసిన ఫిర్యాదుల స్వభావం, వాటికి ఆధారంగా చూపిన చట్టపరమైన నిబంధనలు, తొలగించాలని కోరిన కంటెంట్‌ వివరాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విమర్శలను అణచి­వేయడానికే చంద్రబాబు సర్కారు ఇలాంటి చర్యలకు దిగుతున్నట్లు మరోసారి స్పష్టమైందని పరిశీలకులు పేర్కొంటున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement