జెడ్పీ ఛైర్మన్ పీఠం కోసం అర్ధరాత్రి రహస్య సమావేశం
తన భర్త రాజశేఖరరెడ్డి సోదరుడి కుమారుడికివ్వాలని వినతి
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును రహస్యంగా కలిశారు. ఈ భేటీలో రాజశేఖర్‌రెడ్డి సోదరుడైన శివప్రకాష్ రెడ్డి కుమారుడు ప్రదీప్ రెడ్డికి ఈ స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబుకు ఎంతగా ఉపయోగపడకపోతే ఆయనను కలసి జెడ్పీ ఛైర్మన్ పదవి అడగగలుగుతారని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
చంద్రబాబుతో సునీత దంపతుల రాజకీయ బంధం బట్టబయలయ్యిందని వారు పేర్కొంటున్నారు. కాగా ఈ విషయం బయటపడడంతో కడప జిల్లా కూటమిలోనూ అలజడి మొదలైంది. ఇన్నాళ్లూ పార్టీలో పనిచేసిన వారిని కాదని బయటివారికెలా ఇస్తారని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుతో తరచూ భేటీలు.. ఈసారి పదవి కోసం
సునీత దంపతులు మొన్నటి వరకు చంద్రబాబును కలిసి ఏంచేయాలి, ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలనే దానిపై సలహాలు, సూచనలు తీసుకుని అమలు చేసేవారు. ఈసారి మాత్రం నేరుగా జెడ్పీ ఛైర్మన్ పదవి కోసమే వెళ్లారు. మీకు అన్ని విధాలుగా ఉపయోగపడుతున్నాం కాబట్టి తమకు జెడ్పీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని వారు కోరినట్లు తెలిసింది. ఇన్నాళ్లూ చంద్రబాబు రాజకీయ అవసరాలకు ఉపయోగపడిన దానికి బదులుగా ఇప్పుడు పదవి అడుగుతున్నారన్నది దీంతో స్పష్టమైంది.
కడప టీడీపీలో అలజడి.. పార్టీలో లేనివారికి పదవా?
సునీత దంపతులు జెడ్పీ ఛైర్మన్ పదవి అడిగిన విషయం తెలియడంతో వైఎస్సార్ కడప జిల్లా కూటమి నేతలు మండిపడుతున్నారు. ఆ పదవి కోసం ఇప్పటికే కూటమిలో హోరాహోరీ పోటీ నెలకొంది. ఒకవైపు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసులరెడ్డి వర్గం.. మరోవైపు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గం ఆ పదవిని కోరుకుంటున్నాయి. తమ వర్గంలో ఒకరికి సీటు ఇప్పించుకోవాలని ఎవరికి వారు ప్రయతి్నస్తున్నారు. ఈ దశలో సునీత రంగ ప్రవేశం చేసి ఆ పదవిని ఎగరేసుకుపోవాలని చూస్తుండటం వారికి మింగుడుపడటం లేదు. అసలు పార్టీలోనే లేనివారు జెడ్పీ ఛైర్మన్ పదవి ఎలా అడుగుతారని కూటమి నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని బయటి వ్యక్తులకు జెడ్పీ ఛైర్మన్ పదవి ఇస్తే కుదరదని తేల్చిచెబుతున్నట్లు తెలిసింది. కార్యకర్తలు కష్టపడితే పదవులు మాత్రం సిఫార్సులతో వచ్చినవారికి అంటూ ద్వితీయ శ్రేణి నాయకులు సైతం బాహాటంగానే విమర్శిస్తున్నారు. వివేకా హత్యను సునీత రాజకీయ పెట్టుబడిగా మార్చుకున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న కడప టీడీపీలో ఈ వ్యవహారం చిచ్చు రాజేసింది.
జగన్‌పై బురద జల్లేందుకు ఇన్నాళ్లూ సునీతను ఉపయోగించుకున్న చంద్రబాబు ఇప్పుడు ఏం చేయాలనే దానిపై సందిగ్ధంలో పడినట్లు తెలిసింది. ఆమె కోరిక తీరిస్తే జిల్లా టీడీపీ శ్రేణుల ఆగ్రహం తప్పదు. కాదంటే ఇన్నాళ్లూ సాగిన ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారం బెడిసికొడుతుంది. చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారన్నది పక్కనపెడితే ఒక్క విషయం మాత్రం తేలిపోయింది. సునీత పోరాటం వెనుక ఉన్నది రాజకీయ ఎజెండా. ఆ ఎజెండాకు అండగా నిలిచింది చంద్రబాబు.


