సాక్షి, తాడేపల్లి: రైతును గుడ్డికన్నుతో చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు విధానమని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. తాజాగా చంద్రబాబు మీడియా సమావేశంలో చేసిన ఆరోపణలు.. అసత్య ప్రచారాలపై పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
వ్యవసాయం, ధాన్యాగారంగా ఏపీకి బ్రాండ్ ఉండేది. అలాంటి బ్రాండ్‌ను దెబ్బ తీసింది చంద్రబాబే. చంద్రబాబు ఎప్పటికీ రైతు వ్యతిరేకే. గంటన్నర చంద్రబాబు ప్రసంగంలో అసత్యాలు, నిందలు, విషం వెదజల్లారు. రైతును గుడ్డికన్నుతో చూడడం చంద్రబాబు విధానం. ప్రభుత్వంలో ఎవరున్నా రైతుహితం కోసం పని చేశారు. కానీ చంద్రబాబు ఒక్కరే వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలేస్తారు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు..
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచింది. ఎన్నికల ముందు ఏపీ అప్పులు రూ.14 లక్ష కోట్లు అని చంద్రబాబు ప్రచారం చేశారు. తీరా ఎన్నికలయ్యాక రూ.3.33 లక్షల కోట్ల అప్పు అని రాతపూర్వకంగా అసెంబ్లీలో చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ రూ.10 లక్షల కోట్లని బొంకుతున్నారు. అప్పుల ప్రభుత్వం, దివాళా కోరు ప్రభుత్వం చంద్రబాబుదే. అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే 2 లక్షల 66 వేల 516 కోట్ల అప్పు చేశారు. చంద్రబాబుకు అప్పు ఇచ్చినవాళ్లు ప్రభుత్వ ఖజానాలో డైరెక్ట్‌గా చెయ్యి పెట్టి తీసుకొవచ్చు.
మోదీ, నీతీశ్‌కుమార్‌లు ఏనాడైనా తప్పుడుగా అప్పులు చేశారా?. రాష్ట్ర భవిష్యత్తు ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుది. లక్షా 91 వేల కోట్లను తాకట్టపెట్టి 9 వేల కోట్లు అప్పు తెచ్చారు. ప్రజల రక్తాన్ని తాగుతూ అప్పులు చేస్తున్నారు. మీ ముగ్గురు(చంద్రబాబు, పవన్, నారా లోకేష్‌లను ఉద్దేశిస్తూ..) అడుగు తీసి అడుగేస్తే హెలికాఫ్టర్లు ప్రత్యేక విమానాలా?. అప్పులు చేస్తోంది ప్రత్యేక విమానాల్లో తిరగడానికా?.. అప్పులు తెచ్చి డబ్బు ఎక్కడ పెడుతున్నావ్.. దేశ జీడీపీలో రాష్ట్ర ఎంతో చెప్పగలవా చంద్రబాబు? అని పేర్ని నాని నిలదీశారు.
ఉన్నత చదువులతోనే పేదరికం తగ్గుతుందని నమ్మిన నాయకుడు వైఎస్ జగన్. అందుకే వైఎస్సార్‌సీపీ హయాంలో స్కూల్స్ అభివృద్ధి చెందాయి. కానీ, స్కూళ్లపై చంద్రబాబు ప్రజలకు పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. సినిమా సెట్టింగులు వేసి.. స్టూడెంట్స్- పేరెంట్స్ మీటింగ్ పెట్టడం ఏంటి?. ఒక్క స్కూల్‌లో కూడా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయారు?. నేరుగా స్కూల్ కే వెళ్తే జగన్ హయాంలో బాగు పడిన విధానం కనపడుతుందని భయం కాబట్టి. కూటమి వచ్చాక ఎంత మందికి ట్యాబ్‌లు ఇస్తున్నారు?. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎందుకు తీసేశారు?. ప్రభుత్వ స్కూళ్‌లను నాశనం చేసింది.. చేస్తోంది ఎవరు?..
..వైఎస్సార్‌సీపీ హయాంలో ఏపీ జీడీపీ వేగంగా పెరిగింది. అభివృధ్ధి శరవేగంగా జరిగింది. 4 పోర్టులు, 10 హార్బర్లు, 17 మెడికల్ కాలేజీలు సహా గ్రామ వార్డు సచివాలయ నిర్మాణం ద్వారా జగన్ ఆదాయం సృష్టించారు. వైఎస్ జగన్ సంపద సృష్టిస్తే.. మీరు దానిని వాడుకుంటున్నారు. మూలధన పెట్టుడి ఎవరి హయాంలో ఎక్కువ ఉందో చర్చకు సిద్ధమా?.. బుగ్గన రాజేంద్రనాధ్(ఏపీ మాజీ ఆర్థిక మంత్రి)తో చర్చకు వచ్చే దమ్ముందా చంద్రబాబూ? అని చంద్రబాబుకి పేర్ని నాని సవాల్ విసిరారు.

చంద్రబాబు సంపద సృష్టి అనేది ఓ అభూత కల్పన. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అమలను ఎందుకు అమలు చేయడం లేదు?. ఏ పేదవాడికీ ఇప్పటి వరకు గజం స్థలం కూడా ఎందుకు ఇవ్వలేదు?. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లేదు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చారా?. ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తేవడంలో చంద్రబాబు ఫస్ట్ అని పేర్ని నాని ఎద్దేవా చేశారు.
టీడీపీలో కష్టపడే వారికి పదవులు దక్కటం లేదు. జంపింగ్ జపాంగులకే పదవులు ఇస్తున్నారు. అనంతపురం రైతులకు వ్యవసాయం నేర్పానని చంద్రబాబు బడాయి మాటలు చెప్పుకుంటున్నారు. ధాన్యం పండించకుండా జనం తినే ఆహారం పండించాలని చంద్రబాబు అంటున్నారు. మరి అరటి, మామిడి, టమోటా, దానిమ్మలాంటివి పండిస్తే వాటికి కూడా ఎందుకు ధరల్లేవు?. రైతులకు అత్యాశ అంటూ కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు. రైతుల సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి. ప్రజలందరికీ వాస్తవాలు తెలుస్తున్నాయి. వచ్చే ఎన్నికలలో తగిన బుద్ది చెప్పటానికి సిద్దంగా ఉన్నారు.. అని పేర్ని నాని అన్నారు.


