పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తాం | Pension cuts Persons with Disabilities in Nalgonda | Sakshi
Sakshi News home page

పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తాం

Nov 21 2014 1:46 AM | Updated on Sep 2 2017 4:49 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తామని

 నల్లగొండ టౌన్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సర్వేల పేరుతో వికలాంగులు, వితంతువులు, వృద్ధుల పింఛన్లలో కోత విధిస్తే ఉద్యమిస్తామని వికలాంగులహక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జేరిపోతుల పరుశరాం హెచ్చరించారు. గురువారం స్థానిక టౌన్‌హాల్‌లో నిర్వహించిన.. సమితి నల్లగొండ డివిజన్ సదస్సులో ఆయన మాట్లాడారు. పింఛన్లను పెంచుతామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత  వికలాంగులను విభజించి 40 శాతం నుంచి 79 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1000, 80 శాతం నుంచి 100 శాతం వికలత్వం ఉన్నవారికి రూ.1500 పింఛన్ ఇస్తామని చెప్పడం అన్యాయమన్నారు. శాతాలతో సంబంధంలేకుండా అర్హులైన వికలాంగులందరికీ రూ.1500 పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎలాంటి షరతులు లేకుండా గతంలో ఉన్న వృద్ధులు,వితంతువులు, ఒంటరి స్త్రీల పెన్షన్‌లను యథావిధిగా కొనసాగించాలన్నారు.
 
 కలెక్టర్ బంగ్లా ఎదుట ధర్నా
 సమావేశం అనంతరం వికలాంగులు, వితంతువులు, వృద్ధులు కలిసి కలెక్టర్ బంగ్లా ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. హైదరాబాద్‌లో ఉన్న కలెక్టర్ చిరంజీవులు ఫోన్‌ద్వారా వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులతో మాట్లాడారు. అర్హులైన వికలాంగుల పెన్షన్‌లను ఒక్కటి కూడా తొలగించమని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర కార్యదర్శి పువ్వాల్ వెంకట్‌సింగ్, జిల్లా అధ్యక్షుడు చింతల సైదులు, గడ్డం కాశీం, బొల్లెపల్లి గోపరాజు, సైదులు, జలందర్,  ఇందిర, సుధాకర్,  యాదగిరి, బోగరి రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement