30 రోజులు.. 24 గంటలూ పనులు! | CM Revanth reviews construction of Warangal Super Speciality Hospital | Sakshi
Sakshi News home page

30 రోజులు.. 24 గంటలూ పనులు!

Sep 22 2026 2:32 AM | Updated on Sep 22 2026 2:32 AM

CM Revanth reviews construction of Warangal Super Speciality Hospital

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి, క్రిస్టినా చోంగ్తూ తదితరులు

వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణంపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

నిధులు మంజూరు చేస్తున్నా పనుల్లో జాప్యంపై అసంతృప్తి 

జిల్లా కలెక్టర్‌ రోజూ పర్యవేక్షించాలని ఆదేశం 

త్వరలో ఓపీ సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులకు సూచన

సాక్షి, హైదరాబాద్‌: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం గ్రీన్‌చానల్‌లో నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పనులు ఆశించిన స్థాయిలో వేగంగా సాగకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే 30 రోజులు అత్యంత కీలకమని, ఈ కాలంలో 24 గంటలూ పనులు జరిగేలా కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు. ప్రతి పనికి ఒక ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించి, నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సోమవారం వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం, ఓపీ సేవల ఏర్పాటుపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్, ఆర్‌అండ్‌బీ స్పెషల్‌ సీఎస్‌ వికాస్‌రాజ్, సీఎంఓ కార్యదర్శి మాణిక్‌రాజ్, వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్తూ, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, వరంగల్‌ కలెక్టర్‌ సత్యశారదాదేవి, హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

వర్క్‌ షెడ్యూల్‌ రూపొందించండి 
‘ఆస్పత్రి నిర్మాణ పనులకు సంబంధించి స్పష్టమైన వర్క్‌షెడ్యూల్‌ రూపొందించుకుని ముందుకు వెళ్లాలి. వచ్చే 30 రోజుల్లో పనులు వేగంగా పూర్తయ్యేలా అవసరమైన మానవ వనరులు, యంత్రాలు, ఇతర వనరులను సమీకరించాలి. పనులు రాత్రింబవళ్లు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి. సీఎంఓ అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించాలి. నిర్మాణంలోని ప్రతి అంశానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి బాధ్యత అప్పగించాలి. సంబంధిత అధికారి ఆ పనిని నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా పర్యవేక్షించాలి. ఇక నుంచి వరంగల్‌ కలెక్టర్‌ ప్రతిరోజూ ఆస్పత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించాలి. వివిధ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల పనుల్లో జాప్యం జరగకుండా ప్రత్యేక కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లాలి. నిర్మాణ సంస్థలు, ఆర్‌అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ శాఖ తదితర విభాగాలు సమన్వయంతో పనిచేయాలి. 

ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి 
వరంగల్‌ ప్రజలకు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి సేవలు వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలి. పూర్తిస్థాయి ఆస్పత్రి నిర్మాణం కొనసాగుతున్న సమయంలోనే సాధ్యమైన మేరకు ఓపీ సేవలను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్‌ సనత్‌నగర్‌ టిమ్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చిన తరహాలో వరంగల్‌లోనూ ఓపీ సేవలను ప్రారంభించే విధంగా ఏర్పాట్లు చేయాలి. ఆస్పత్రి భవనం మాత్రమే కాకుండా దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి. రోగులు, వారి సహాయకులకు అనుకూలంగా ఉండేలా ఆస్పత్రి పరిసరాల్లో పారిశుధ్యం, పచ్చదనం, రహదారులు, ఇతర మౌలిక వసతులపై దృష్టి పెట్టాలి. ఆస్పత్రి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వైద్యులు, ఇతర సిబ్బందికి అవసరమైన సౌకర్యాలపై కూడా దృష్టి పెట్టాలి. సనత్‌నగర్‌ టిమ్స్‌కు సంబంధించి స్టాఫ్‌ క్వార్టర్స్‌ ఏర్పాటు చేయాలి. ఇందుకు సంబంధించిన పనులను తక్షణమే ప్రారంభించాలి. వైద్యులు, నర్సింగ్, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండేలా అవసరమైన వసతి సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలి. 

నిర్వహణకు ప్రత్యేక ఏజెన్సీ 
వరంగల్‌ ఆస్పత్రి నిర్వహణ, మెయింటినెన్స్‌ను ప్రత్యేక ఏజెన్సీకి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆస్పత్రి కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత నిర్వహణలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే విధివిధానాలను ఖరారు చేయాలి. ఆస్పత్రి నిర్మాణం, ఓపీ సేవల ప్రారంభం, సిబ్బంది వసతి, నిర్వహణ తదితర అంశాలపై నిర్దిష్ట గడువులతో కార్యాచరణ రూపొందించి, తదుపరి సమీక్షకు పురోగతి నివేదికతో రావాలి..’అని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement