కై లాస్‌నగర్: జిల్లాలో మారుమూల మండలాల్లో ప్రయాణం ప్రాణసంకటంగా మారుతుంది. పాలకుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారులు పట్టింపులేనితనంతో రహదారులు అధ్వానంగా దర్శనమిస్తున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు మోకాళ్లోతు గుంతలు, బురదతో అడుగుతీసి అడుగు వేయలేని దుస్థితి. ప్రధానంగా ఏజెన్సీ పరిధిలోని గూడెలు, ఆదివాసీ గ్రామాల రోడ్ల పరిస్థితి మరీ అధ్వానం. గిరిపుత్రులు మట్టిరోడ్లపైనే ఏళ్ల తరబడి అవస్థల నడుమ ప్రయాణం సాగించాల్సి వస్తోంది. పలుచోట్ల తారురోడ్లు సైతం కంకర తేలి, గుంతలమయంగా మారాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ కాదు కదా.. కొన్ని గూడేలకు ద్విచక్రవాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో రోగులు, పురిటినొప్పులతో ఉన్న గర్భిణులను ఆసుపత్రులకు చేర్చడం కుటుంబీకులకు ఇబ్బందిగా మారుతోంది. మార్గమధ్యలోనే మృత్యుఒడి చేరుతున్న ఘటనలు ఇటీవల పరిపాటిగా మారాయి. రోడ్డు సౌకర్యం కల్పించాలంటూ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులను వేడుకుంటున్నప్పటికీ ఫలితం కనిపించడం లేదు.
నిమిషాల్లో చేరాల్సిన గమ్యస్థానానికి గంటల వ్యవధి ..
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, సిరికొండ, ఉట్నూర్, బజార్‌హత్నూర్ మండలాల్లోని ఆదివాసీ గ్రామాలకు సరైన రోడ్డు వసతి లేదు. పలు గ్రామాలను మండల, జిల్లా కేంద్రాలకు అనుసంధానిస్తూ ప్రభుత్వాలు బీటీ రోడ్ల నిర్మాణం చేపడుతున్నప్పటికీ పలు ఆదివాసీ పల్లెలకు కాలిబాట కూడా కరువవడం గమనార్హం. కాలమేదైనా గిరిపుత్రులకు మాత్రం ప్రయాణ కష్టాలు తప్పడం లేదు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు మట్టిరోడ్లన్నీ బురదమయంగా మారడంతో పాటు మోకాల్లోతు గుంతలు ఏర్పడుతున్నాయి. తారు రోడ్లపై ఉన్న కంకరతేలి గుంతలు పడ్డాయి. నిమిషాల వ్యవధిలో గమ్యస్థానానికి చేరాల్సి ఉండగా సక్రమంగా రోడ్లు లేని కారణంగా గంటల సమయం పడుతుండడం గమనార్హం.
గాదిగూడ మండలం మారేగాం నుంచి కొలామా గ్రామానికి వెళ్లే రోడ్డు ఇది..
గాదిగూడ మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన గర్భిణి ఆత్రం కవితకు ఈనెల 16న పురిటి నొప్పులు రావడంతో మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. రోడ్డు పూర్తిగా గుంతలమయంగా ఉండటంతో ఆలస్యమైంది. అక్కడి నుంచి జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించగా ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆమె పది నిమిషాలకే మృతి చెందింది.
ఏజెన్సీ పరిధిలోని మండలాల్లో అధ్వాన రహదారుల కారణంగా అత్యవసర పరిస్థితుల్లో దారిలోనే ప్రాణాలు పొతున్నాయనేందుకు ఈ ఘటనలే నిదర్శనం.


