దుక్కి లేని ఎస్‌ఆర్‌టీ సాగు! | Success Story About Saguna Regenerative Technique | Sakshi
Sakshi News home page

దుక్కి లేని ఎస్‌ఆర్‌టీ సాగు!

Aug 25 2026 1:42 AM | Updated on Aug 25 2026 1:42 AM

Success Story About Saguna Regenerative Technique

నేల తల్లికి మేలు చేస్తూ రైతులకు లాభాలనిచ్చే ‘సగుణా రీజెనరేటివ్‌ టెక్నిక్‌’ (ఎస్‌ఆర్‌టీ) సాగు పద్ధతి

ఎత్తు మడులు ఒక్కసారి తయారు చేస్తే పాతికేళ్లు దున్నే పని లేదు 

ఈ మడులపై ఆరుతడి వరి సహా 35 పంటలు ఏడాది పొడవునా సాగు చేసుకోవచ్చు

40% నీరు, ఖర్చు ఆదా.. 50% తక్కువ శ్రమ.. అధిక దిగుబడులు

అంతర్జాతీయ గుర్తింపు పొందిన నూతన సాంకేతికత

రైతాంగానికి సాగు ఖర్చులు పెరిగిపోవటం, కూలీల కొరత, మారుతున్న వాతావరణ పరిస్థితులు సవాళ్లుగా మారిన తరుణంలో సగుణా రీజెనరేటివ్‌ టెక్నిక్‌ (ఎస్‌ఆర్‌టీ) వ్యవసాయ రంగంలో ఒక కొత్త ఆశాకిరణంగా నిలుస్తోంది. నేలను మొదట ఎత్తుమడులు చేసేటప్పుడు తప్ప తర్వాత దున్నే అవసరం లేదు. దమ్ము చేసి నాట్లు వేసే శ్రమ లేదు. నేరుగా విత్తనం వెయ్యటమే. అత్యంత తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించే ఈ వినూత్న సాగు విధానం ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) ఆమోదించింది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 7 ప్రధాన లక్ష్యాలను నెరవేర్చే సాంకేతికతగా దీన్ని ధృవీకరించటం విశేషం.

మహారాష్ట్రలోని రాయగఢ్‌ జిల్లా నేరళ్‌ వద్దగల సగుణా బాగ్‌లో వ్యవసాయ శాస్త్రవేత్త చంద్రశేఖర్‌ హరిభావూ భడ్సావాలే 2011లో ఈ సాగు పద్ధతిని రూపొందించారు. సగుణా రూరల్‌ ఫౌండేషన్‌ ద్వారా విస్తృత ప్రచారంలోకి తెచ్చారు. ఈ పద్ధతి మొదట బెడ్స్‌పై ఆరుతడి వరి సాగుకే పరిమితమైనప్పటికీ, ప్రస్తుతం ఏటా 30 నుండి 35 రకాల విభిన్న పంటలను విజయవంతంగా పండించే స్థాయికి చేరింది.

ఏమిటీ ఎస్‌ఆర్‌టీ ప్రత్యేకత?
సాధారణ వ్యవసాయంలో ప్రతి సీజన్‌లో పంట విత్తే/నాటే ముందు పొలాన్ని దున్నటం, నేలను చదును చేయటం అత్యంత ఖర్చుతో కూడుకున్న పని. కానీ ఎస్‌ఆర్‌టీ విధానంలో ఒకసారి తయారుచేసిన ఎత్తయిన శాశ్వత మడులపై తర్వాత 25 సంవత్సరాల వరకు పొలం దున్నాల్సిన అవసరమే ఉండదు. 136 సెం.మీ వెడల్పుతో తయారు చేసే ఈ మడుల వల్ల మొక్కల వేర్లకు ఆక్సిజన్, తగినంత తేమ  సమృద్ధిగా అందుతాయి. ఫలితంగా తెల్లని వేర్ల వ్యవస్థ బాగా అభివృద్ధి చెంది, పంట ఏకరీతిగా ఎదుగుతుంది. ఈ–జెబు మినీ ట్రాక్టర్‌ ద్వారా సరియైన రూరంలో (ఉదాహరణకు వరిలో 25 “ 25 సెం.మీ) విత్తనాలను నేరుగా నాటుతారు. దీనివల్ల ఎకరాకు కావలసిన సరైన మొక్కల సంఖ్య నిర్వహించబడుతుంది. ముందటి పంట కోత తర్వాత పాత వేర్లను నేలలోనే వదిలేసి, గడ్డిమందు పిచికారీ ద్వారా వాటిని కుళ్ళింపజేస్తారు. ఇది నేలలో సేంద్రియ కర్బనాన్ని వేగంగా పెంచుతుంది.

40% నీరు, ఖర్చు ఆదా.. 50% తగ్గిన శ్రమ
సాంప్రదాయ వరి సాగుతో పోలిస్తే ఎస్‌ఆర్‌టీ విధానం వల్ల పంటకు అవసరమయ్యే నీటి వాడకం 40 శాతం వరకు తగ్గుతుంది. నాట్లు వేయడం, దుక్కి దున్నడం వంటి పనులు లేకపోవడం వల్ల ల్యాండ్‌ ప్రిపరేషన్‌ ఖర్చు తగ్గడమే కాకుండా ఉత్పత్తి ఖర్చు 40 శాతం, శ్రమ 50 శాతం వరకు ఆదా అవుతుంది.

చిగురిస్తున్న ఆశలు...
వ్యవసాయ రంగంలో నేలను దున్నాల్సిన అవసరం లేని నో టిల్‌ సమగ్ర సేద్య పద్ధతులకు ఆదరణ పెరుగుతోంది. నేల సారాన్ని పరిరక్షిస్తూ, సమర్థవంతమైన పంటల సాగుకు తోడ్పడే ఈ సాంకేతికతను మొదట వరి పంట కోసం అభివృద్ధి చేశారు. అయితే ప్రస్తుతం దీని ద్వారా దాదాపు 30 నుంచి 35 రకాల విభిన్న పంటలను విజయవంతంగా పండిస్తున్నారు.

ఎస్‌ఆర్‌టీ శాశ్వత ఎత్తు మడులపై ఏడాది పొడవునా పండించగల పంటలు:
→ ఖరీఫ్‌ కాలం (జూన్‌ – అక్టోబర్‌): వరి, రాగులు (చోళ్ళు), జొన్నలు, వేరుశనగ, పత్తి, సోయాబీన్, కందులు, మినుములు వంటి ప్రధాన పంటలను సాగు చేయవచ్చు. → రబీ కాలం (నవంబర్‌ – ఫిబ్రవరి): అనుములు, శనగలు, అలసందలు (బొబ్బర్లు), నల్ల పెసలు, ఉలవలు, బఠానీ, మసూర్‌ పప్పు వంటి పప్పుధాన్యాలతో పాటు ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, బెండ, మొక్కజొన్న, ప్రొద్దుతిరుగుడు, గోధుమ, జొన్నలు, పలు రకాల ఆకుకూరలు పండించడానికి ఇది అనుకూలం. 
→ వేసవి కాలం (జనవరి – మే): పంట మార్పిడిలో వైశాఖి పెసలు, వేరుశనగ, బెండ, ప్రొద్దుతిరుగుడు, సజ్జలు సాగు చేసుకోవచ్చు.

15–25 రోజుల ముందే కోతలు
మట్టి కోతను పూర్తిగా నివారించడం, నేలలో కార్బన్‌ నిర్బంధం(సేకరణ) ద్వారా గ్రీన్‌ హౌస్‌ వాయువుల ఉద్గారాలను అడ్డుకోవడం ఈ పద్ధతిలో అతిపెద్ద పర్యావరణ ప్రయోజనం. నేలను దున్నకపోవడం వల్ల వానపాములు, మిత్ర బూజులు, ఉపయోగకరమైన సూక్ష్మజీవులు పెరిగి నేల సారం స్వయంచాలకంగా పెరుగుతుంది. నాట్లు వేయడానికి నీరు, ఎద్దులు లేదా ట్రాక్టర్లు, కూలీలపై ఆధారపడే భయం పూర్తిగా తొలగిపోయింది. 

వరి పంటను ఇతర రైతుల కంటే 15– 25 రోజుల ముందే మార్కెట్‌లో విక్రయించగలుగుతున్నాము అని ఎస్‌ఆర్‌టీ విధానాన్ని అనుసరిస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి విపత్తులు, అతివృష్టి లేదా వర్షాభావ పరిస్థితులను తట్టుకుని స్థిరమైన దిగుబడినిచ్చే ఈ పరిరక్షణ వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా గిరిజన కుటుంబాల వార్షిక ఆదాయాన్ని 4 రెట్లు పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రకృతికి హాని చేయకుండా రూపకల్పన చేసిన ఎస్‌ఆర్‌టీ సాంకేతికత రాబోయే రోజుల్లో దేశీయ వ్యవసాయ రంగానికి దిశా నిర్దేశం చేయనుంది. 
 

పత్తి, మొక్కజొన్న అధిక దిగుబడి!
శాస్త్రవేత్తల సూచనలు, క్షేత్రస్థాయి మార్గదర్శకత్వంలో ఎస్‌ఆర్‌టీ విధానంపై అవగాహన పెంచుకొని గత సంవత్సరం నుంచి ఒక ఎకరంలో బెడ్స్‌పైనే వానాకాలం పత్తి, యాసంగిలో మొక్కజొన్న పండించా. పత్తి 12 క్వింటాళ్లు, మొక్కజొన్న 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆ బెడ్స్‌పైనే ఈ ఏడాది పత్తి విత్తాను. పంట బాగుంది. మామూలు పొలాల్లో మొక్కల కన్నా మా పత్తి మొక్కలు ఎత్తుగా పెరుగుతున్నాయి. తడి తక్కువ వున్నా పంటకు ఇబ్బంది లేదు. స్ప్రింక్లర్‌ పైపులతో నీరు పారిస్తున్నా. ప్రభుత్వం డ్రిప్‌ ఇస్తే ఇంకా బాగుంటుంది. మమ్మల్ని చూసి 25 ఎకరాల్లో రైతులు ఎస్‌ఆర్‌టీ పద్ధతిలో పంటలు ఈ సంవత్సరం వేశారు. ఎస్‌ఆర్‌టీ విధానంలో నేలలో తేమ నిల్వ ఉండటం, పొలంలో పంట అవశేషాలను ఉపయోగించుకోవటం వంటి అంశాలు ఉపయోగకరంగా అనిపించాయి.  
– సంది భగవాన్‌రెడ్డి (98491 25635), ఎల్లమ్‌పల్లి, సైదాపూర్‌

ఎకరంలో ఎస్‌ఆర్‌టీ వరి సాగు చేస్తున్నా
నాకు ఐదెకరాల భూమి, 4 ఆవులు ఉన్నాయి. కేవీకే శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఈ సంవత్సరం ఒక ఎకరంలో ఎస్‌ఆర్‌టీ వరి పంట సాగు చేస్తున్నాను. ఒక ఎకరంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో, మరో ఎకరంలో రసాయనిక వ్యవసాయంలో నాట్లు వేసి సాగు చేస్తున్నా. మూడు పద్ధతుల్లో పంట ఎట్లా ఉంటుందో చూద్దామని పక్క పక్కనే సాగు చేస్తున్నా. రెండెకరాల్లో పామాయిల్‌ మొక్కలు వేశాను. ఎస్‌ఆర్‌టీ పద్ధతిలో సాగు ఖర్చులు తగ్గటంతో పాటు నేల ఆరోగ్యం మెరుగుపడుతుందని ఆశిస్తున్నాను. 
– నీళ్ళ సమ్మయ్య (95506 29004), రంగంపల్లి, జమ్మికుంట మం., కరీంనగర్‌ జిల్లా

ఎస్‌ఆర్‌టీ విధానం రైతులకు ఉపయోగకరం
కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నాబార్డ్‌ వారి ఆర్థిక సహకారంతో సగుణ పునరుత్పాదక వ్యవసాయ పద్ధతిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ౖక్షేత్రస్థాయి ప్రదర్శనలు, రైతుల అనుభవాల ఆధారంగా ఈ విధానంపై మరింత అవగాహన కల్పిస్తున్నాం. రెతులు తమ పొలాల పరిస్థితులు, పంట రకం, నీటి లభ్యత, నేల స్వభావాన్ని పరిగణనలోకి తీసుకొని ఎస్‌ఆర్‌టీ విధానంలోని సాంకేతిక అంశాలను క్రమపద్ధతిలో అమలు చేస్తే సత్ఫలితాలు వస్తాయి. సాగు ఖర్చులను తగ్గించటం, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచటం, సహజ వనరులను సమర్థవంతంగా వినియోగించటం వంటి లక్ష్యాలతో ఎస్‌ఆర్‌టీ వంటి పునరుత్పత్తి వ్యవసాయ పద్ధతులు భవిష్యత్తులో రైతులకు ఉపయోగకరంగా మారే అవకాశం ఉంది.
– డాక్టర్‌ ఎస్‌. వెంకటేశ్వర్‌ రావు 
(98485 73710), సీనియర్‌ సైంటిస్టు–
హెడ్, కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట, 
కరీంనగర్‌ జిల్లా

కథనం: డా. వెంకటేశం తుమ్మనగోటి, 
సాక్షి, రామగిరి (నల్లగొండ)
ఫొటోలు: కంది భజరంగ్‌ ప్రసాద్, 
సాక్షి ఫొటోగ్రాఫర్, నల్లగొండ

నిర్వహణ: పంతంగి రాంబాబు,  సాక్షి సాగుబడి డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement