డిపాజిట్లు రూ.3.17 లక్షల కోట్లు
అక్కౌంట్లలో సగటు నిల్వ రూ.5,356
సగానికి పైగా ఖాతాలు మహిళలవే
గ్రామీణ ప్రాంతాల వాటా 78 శాతం
41.29 కోట్ల మందికి రూపే డెబిట్ కార్డులు
పుష్కరకాలం పూర్తి చేసుకున్న పీఎంజేడీవై
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థిక సమ్మిళిత సాధనే లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన (పీఎంజేడీవై) విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్యాంకింగ్ సేవల పరిధిలో లేని వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి బ్యాంకింగ్, ఆర్థిక సేవలను అందించడమే లక్ష్యంగా 2014 ఆగస్టు 28న ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ఈ పుష్కర కాలంలో దేశవ్యాప్తంగా 59.09 కోట్ల బ్యాంకు ఖాతాలు మొదలయ్యాయి. ఈ ఖాతాల్లో మొత్తం రూ.3,.17 లక్షల కోట్ల సొమ్ము జమయిందని ఆర్థిక శాఖ గురువారం వెల్లడించింది.
మహిళలదే పైచేయి
ఈ ఏడాది ఆగస్టు 19వ తేదీ నాటికి అధికారిక గణాంకాల ప్రకారం మొత్తం 59.09 కోట్ల జన్‌ధన్ అకౌంట్లలో 55.7 శాతం (32.92 కోట్లు) ఖాతాలు మహిళల పేరిటే ఉన్నాయి. అలాగే 77.8 శాతం (45.95 కోట్లు) ఖాతాలు గ్రామీణ, సెమీ–అర్బన్ ప్రాంతాలకు చెందినవి కావడం విశేషం. ఈ లెక్కన ప్రతి జన్‌ధన్ ఖాతాలో సగటున రూ.5,356 డిపాజిట్ ఉన్నట్లు ఆర్థిక శాఖ తెలిపింది. గత 12 ఏళ్ల కాలంలో సగటు డిపాజిట్‌లో దాదాపు మూడు రెట్ల పెరుగుదల నమోదైందని వివరించింది. ఖాతాదారులు తమ అక్కౌంట్లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనేందుకు, వారిలో పొదుపు అలవాటు పెరుగుతోందనేందుకు సగటు డిపాజిట్‌లో పెరుగుదల ఓ నిదర్శనమని ఆర్థిక శాఖ పేర్కొంది. దీనిద్వారా ఈ ఖాతాదారులు ముద్ర లోన్స్ వంటి వాటిని పొందేందుకు అర్హత సాధించారని కూడా వెల్లడించింది.
జీరో బ్యాలెన్స్.. ఉచిత బీమా..
జన్‌ధన్ ఖాతాదారుల నుంచి బ్యాంకులు కనీస నగదు నిల్వ నిబంధన, నిర్వహణ చార్జీల వంటివి విధించవు. ఈ ఖాతాలతో పాటు ఉచితంగా అందించే రూపే డెబిట్ కార్డు ద్వారా ఖాతాదారులకు రూ.2 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది. అత్యవసర ఆర్థిక అవసరాల నిమిత్తం ఖాతాదారులు రూ.10వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్ (ఓడీ) సౌకర్యాన్ని ఎలాంటి పూచీకత్తు లేకుండా వినియోగించుకోవచ్చు.
దేశవ్యాప్తంగా ఖాతాదారులకు ఇప్పటివరకు 41.29 కోట్ల రూపే డెబిట్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. అసంఘటిత రంగ కారి్మకులకు ఉద్దేశించిన ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (పీఎంఎస్‌బీవై) తదితర బీమా, పెన్షన్ పథకాలు ప్రధానంగా ఈ ఖాతాల ద్వారానే అమలవుతున్నాయి. జన్‌ధన్, ఆధార్, మొబైల్ (జామ్) అనుసంధానం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమవుతోంది. దీనివల్ల దళారుల ప్రమేయం, జాప్యానికి అడ్డుకట్ట పడింది.


