ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఫటాపట్‌! | Sakshi special story about Fixed Deposit Online | Sakshi
Sakshi News home page

ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. ఫటాపట్‌!

Jun 8 2026 3:28 AM | Updated on Jun 8 2026 3:28 AM

Sakshi special story about Fixed Deposit Online

డిజిటల్‌గా నిమిషాల్లోనే పూర్తి... 

అధిక వడ్డీ రాబడికి మార్గం 

ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లపై సులభతర సేవలు 

కోరుకున్నప్పుడు వేగంగా ఉపసంహరణ 

రెన్యువల్‌ కూడా సులభమే

దశాబ్దాలుగా, కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయమైన పెట్టుబడి సాధనాల్లో మొదటి ఎంపిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ)కే. బ్యాంకు శాఖకు వెళ్లి ఎఫ్‌డీ వేయడం, కావాల్సినప్పుడు వెనక్కి తీసుకోవడం.. రాబడి తక్కువే అయినా అందులోని సౌలభ్యం, నమ్మకం ఎఫ్‌డీకి అంత ప్రాధాన్యాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడంతా డిజిటల్‌ సేవల యుగం. దాదాపు అన్ని బ్యాంకు సేవలు డిజిటల్‌గానే లభిస్తున్నాయి. ఎఫ్‌డీ కంటే అధిక రాబడినిచ్చే మ్యూచువల్‌ ఫండ్స్, ఏఐఎఫ్‌ తదితర సాధనాలను స్మార్ట్‌ఫోన్‌ నుంచే యాక్సెస్‌ చేసుకునే వెసులుబాటు. 

దీంతో గతంతో పోల్చితే ఎఫ్‌డీలకు డిమాండ్‌ కొంత తగ్గిందని చెప్పుకోవచ్చు. బ్యాంకుల్లో డిపాజిట్ల వృద్ధి వేగం నిదానించడం దీన్నే తెలియజేస్తోంది. దీంతో బ్యాంక్‌లు సైతం డిజిటల్‌ ఎఫ్‌డీలతో పోటీ పడుతున్నాయి. సొంత మొబైల్‌ అప్లికేషన్లు, నెట్‌బ్యాంకింగ్‌ ద్వారానే కాకుండా.. ఫిన్‌టెక్‌ల రూపంలోనూ డిజిటల్‌ ఎఫ్‌డీ సేవలను ఆఫర్‌ చేస్తున్నాయి. వీటికి డిమాండ్‌ కూడా బ్రహా్మండం. మొదటిసారి ఇన్వెస్టర్లు సైతం సులభంగా డిజిటల్‌ ఎఫ్‌డీ చేసుకోవచ్చు. వీటి సేవలను ఎలా పొందొచ్చో తెలియజేసే కథనమే ఇది.  

ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని బ్యాంక్‌లు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు (ఎన్‌బీఎఫ్‌సీలు) సొంతంగానూ డిజిటల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు వీటిని ఇన్వెస్టర్లకు మరింత చేరువ చేస్తున్నాయి. డిపాజిట్‌కు సరిపడా సొమ్మును స్వీకరించడం, ఎఫ్‌డీగా మార్చడం, ఉపసంహరణ తదితర సేవలన్నింటినీ ఫిన్‌టెక్‌ సంస్థలు అందిస్తాయి. డిపాజిట్‌ రిసీప్‌్టలు బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీల నుంచే జారీ అవుతాయి. అంటే డిపాజిట్‌ మొత్తం బ్యాంక్‌లు/ఎన్‌బీఎఫ్‌సీలకే వెళుతుంది.  

ఒకే చోట డిపాజిట్లన్నీ.. 
→ తమకు ఖాతా ఉన్న బ్యాంక్‌లోనే డిజిటల్‌ ఎఫ్‌డీ వేసుకోవచ్చు.  
→ అధిక రాబడిని (వడ్డీ రేటు) ఆఫర్‌ చేసే చోటే ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారికి ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు ఎంతో అనుకూలం. 
→ దాదాపు అన్ని ప్రముఖ బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిట్లను ఆఫర్‌ చేస్తున్నాయి. 
→ అన్ని డిపాజిట్లు ఒకే చోటు కనిపించడం వల్ల ఎక్కువ వడ్డీ రేటును ఆఫర్‌ చేసే డిపాజిట్లను సులభంగా గుర్తించొచ్చు.  
→ కనీసం రూ.1,000 నుంచి డిపాజిట్‌కు అవకాశం ఉంది. కావాలంటే అక్కడే రెన్యువల్‌ చేసుకోవచ్చు.

డిపాజిట్‌ చిటికెలో పని
→ డిజిటల్‌ ఎఫ్‌డీ కోసం పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. నిమిషాల్లోనే ఈ పని పూర్తి చేయొచ్చు. 
→ ఈ–కేవైసీ లేదా వీడియో కేవైసీ ద్వారా తమ గుర్తింపు వివరాలను ఇస్తే సరిపోతుంది.  
→ అనంతరం తమకు నచ్చిన సంస్థ డిపాజిట్‌ను ఎంపిక చేసుకుని, నిర్ణీత మొత్తాన్ని డిపాజిట్‌ చేయాలి.  
→ గడువు ముగిసిన తర్వాత ఉపసంహరణ కూడా సులభమే. నిమిషాల్లోనే డిపాజిట్‌ మొత్తం వడ్డీ సహా బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. 
→ కావాలంటే ఆ డిపాజిట్‌ను అక్కడికక్కడే రెన్యువల్‌ ( పునరుద్ధరణ) చేసుకోవచ్చు.  
→ ఈ సేవలన్నీ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ మొబైల్‌ అప్లికేషన్‌ లేదా వెబ్‌ పోర్టల్‌ నుంచి పొందొచ్చు.  

రెండూ ఒకటే.. 
→ భౌతికంగా బ్యాంకులో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్, ఆన్‌లైన్‌లో డిజిటల్‌గా చేసే ఎఫ్‌డీ రెండూ ఒక్కటే. వడ్డీ రేటు, భద్రత, పన్ను తదితర అంశాల్లో ఎలాంటి మార్పుల్లేవు.  
→ ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలో రెండింటి మధ్య ఎలాంటి వ్యత్యాసం కూడా లేదు. 
→ చాలా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో ముందస్తు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక డిపాజిట్‌ పథకాలలో ఈ సౌకర్యం ఉండకపోవచ్చు. 
→ ఆర్‌బీఐ అనుబంధ సంస్థ అయిన డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ (డీఐసీజీసీ) కింద ఒక బ్యాంకు పరిధిలో ఒక్కో ఇన్వెస్టర్‌కు గరిష్టంగా రూ.5. లక్షల ఎఫ్‌డీకి బీమా వర్తిస్తుంది.  

రిస్కుల్లేవా..
→ సాధారణంగా ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రిస్క్‌ చాలా తక్కువ. 
→ బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభంలో పడినప్పుడే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 
→ ఆర్‌బీఐ నియంత్రణల పరిధిలోని అన్ని వాణిజ్య బ్యాంక్‌లు, స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ల్లో ఒక్కో డిపాజిటర్‌కు గరిష్టంగా రూ.5 లక్షల మొత్తానికి బీమా ఉంటుంది.  
→ ఉదాహరణకు ఒక వ్యక్తి రెండు వేర్వేరు బ్యాంకుల్లో రూ.5 లక్షల చొప్పున డిపాజిట్‌ చేశాడనుకుందాం. రెండు బ్యాంకులూ సంక్షోభంలోకి వెళ్లాయనుకుంటే.. అప్పుడు రెండు బ్యాంకుల నుంచి డిపాజిటర్‌కు రూ.5 లక్షల చొప్పున వెనక్కి వస్తుంది.  
→ కనుక ఒక బ్యాంకు పరిధిలో గరిష్ట డిపాజిట్‌ను రూ.5 లక్షలకు పరిమితం చేయడం ద్వారా రిస్‌్క తగ్గించుకోవచ్చు. 
→ ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిట్లపై వడ్డీ రేటు బ్యాంకుల కంటే ఎక్కువగా ఉంటుంది. కానీ, బ్యాంకుల్లో మాదిరి ఎన్‌బీఎఫ్‌సీల డిపాజిట్లకు డీఐసీజీసీ బీమా సదుపాయం లేదు. ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభంలో పడితే డిపాజిట్‌ పూర్తిగా రిస్‌్కలోకి వెళ్లినట్లే. 
→ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ సేవలు మెరుగ్గా ఉన్నాయేమో విచారించుకోవాలి.  
→ మెచ్యూరిటీ అనంతరం ఆటో రెన్యువల్‌ అయినా, కొత్తగా అమల్లో ఉన్న వడ్డీ రేటే వర్తిస్తుంది. గతంలో పొందిన అధిక వడ్డీ రేటు కొనసాగదు. 
→ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ కేవలం మధ్యవర్తి గా మాత్రమే పనిచేస్తుంది. డిపాజిట్‌ భద్రత పూర్తిగా సంబంధిత బ్యాంక్‌ లేదా ఎన్‌బీఎఫ్‌సీ ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల పెట్టుబడి పెట్టే ముందే డిపాజిట్‌ ఏ సంస్థ వద్ద నమోదవుతోందో పరిశీలించాలి.

అధిక రాబడి
→ తమ ఖాతా ఉన్న బ్యాంకులో డిపాజిట్‌ అయితే, మెరుగైన రేటుపై చేసే అవకాశం ఉండదు.  
→ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా అయితే ఏ బ్యాంక్‌ ఎక్కువ రేటు ఆఫర్‌ చేస్తుందో తెలుసుకుని, అందులోనే డిపాజిట్‌ చేసుకోవచ్చు.  
→ కొన్ని స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌లు 0.5–2 శాతం వరకు అధిక రేటును ఆఫర్‌ చేస్తుంటాయి.  
→ గతంలో పోల్చితే డిపాజిట్లకు పోటీ పెరగడంతో ప్రముఖ బ్యాంకులు సైతం ఆకర్షణీయమైన రేటును అందిస్తున్నాయి.  
→ సీనియర్‌ సిటిజన్‌ (60 ఏళ్లు నిండిన) డిపాజిట్లపై అరశాతం వరకు అదనపు రాబడిని అందుకోవచ్చు.  
→ అధిక రాబడి కోసం దీర్ఘకాలాన్ని ఎంపిక చేసుకునే ముందు.. అంతకాలం పాటు వేచి ఉండగలమా? అన్నది ఆలోచించుకోవాలి.

డిపాజిట్‌పై రుణం 
→ చాలా బ్యాంకులు డిపాజిట్‌పై రుణం లేదా ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఎఫ్‌డీ విలువలో 75–80 శాతం మేర రుణంగా లభిస్తుంది. 
→ ఎఫ్‌డీ రేటు కంటే 1–3 శాతం అధికంగా రుణానికి చెల్లించాల్సి ఉంటుంది.  

ముందుగా వెనక్కి తీసుకుంటే.. 
→ డిపాజిట్లు ఏవైనా వాటి నిర్ణీత కాల వ్యవధికి ముందుగానే ఉపసంహరించుకుంటే రాబడి విషయంలో రాజీ పడక తప్పదు. 
→ ఉదాహరణకు రూ.3 ఏళ్లకు డిపాజిట్‌ చేసి, ఏడాదికే వెనక్కి తీసుకుంటే.. ఏడాది కాలానికి వర్తించే వడ్డీ రేటు ప్రకారమే చెల్లింపులు లభిస్తాయి. 
→ ఫిన్‌టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల్లో ముందస్తుగా డిపాజిట్‌ నుంచి తప్పుకుంటే 0.5–1 శాతం వరకు పెనాల్టీని కూడా చెల్లించాల్సి రావొచ్చు.  
→ కాలవ్యవధి ముగిసేలోపు అత్యవసరాల్లో తీసుకోవచ్చని భావించే వారు.. ఒకే డిపాజిట్‌ కాకుండా ఒకటికి మించి వేర్వేరు డిపాజిట్లుగా, వేర్వేరు కాల వ్యవధిపై చేసుకోవడం వల్ల రాబడి నష్టపోకుండా, పెనాల్టీ భారం ఎక్కువ లేకుండా చూసుకోవచ్చు.  

పన్ను భారం మరవొద్దు..
→ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై రాబడి పన్ను పరిధిలోకి వస్తుంది. ఇది ఇన్వెస్టర్‌ వార్షిక ఆదాయానికి వెళ్లి కలుస్తుంది. కనుక ఆదాయానికి అనుగుణంగా పన్ను రేటు చెల్లించాల్సి ఉంటుంది.  
→ ఉదాహరణకు 30 శాతం పన్ను శ్లాబులో ఉన్న వ్యక్తి 8.5 శాతం రేటుపై ఎఫ్‌డీ చేశాడని అనుకుందాం. అప్పుడు పన్ను పోను ఎఫ్‌డీపై నికర రాబడి 6 శాతం మించదు.  
→ బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ లేదా రికరింగ్‌ డిపాజిట్‌పై వడ్డీ ఆదాయం ఒక ఆర్థిక 
సంవత్సరంలో ఒక వ్యక్తికి రూ.50,000 మించితే (60 ఏళ్లలోపు), 60 ఏళ్లు నిండిన వారికి రూ.లక్ష మించితే టీడీఎస్‌ అమలు చేస్తారు. పాన్‌ నంబర్‌ సమరి్పంచిన వారికి 10 శాతం, అది లేని వారికి 20 శాతం టీడీఎస్‌ మినహాయిస్తారు.  
→ పన్ను వర్తించేంత ఆదాయం లేని వారు టీడీఎస్‌ అమలు చేయకుండా ఫారమ్‌ 15జీ (60 ఏళ్లలోపు), ఫారమ్‌ 15హెచ్‌ (60 ఏళ్లు నిండిన) సమర్పిస్తే సరిపోతుంది.  

డిజిటల్‌ ఎఫ్‌డీ వేదికలు..
→ జియోఫైనాన్స్‌    
→ స్టెబుల్‌ మనీ 
→ జెరోదా కాయిన్‌  
→ ఫైబ్‌ 
→ పైసా బజార్‌
→ ఐఎన్‌డీ మనీ 
→ క్రెడ్‌ 
→ ఫోన్‌పే 
→ నవీ 
→ పేటీఎం

Advertisement
 
Advertisement
Advertisement