రూ.50 వేల ట్రాన్స్‌ఫర్ వెనుక అసలు కథ ఏంటి? | Proddatur Police Controversy, New Twist In ₹5,000 Phone Transfer Case, Constables Under Probe | Sakshi
Sakshi News home page

రూ.50 వేల ట్రాన్స్‌ఫర్ వెనుక అసలు కథ ఏంటి?

Aug 4 2026 11:09 AM | Updated on Aug 4 2026 11:14 AM

New Twist In Rs 5000 Phone Transfer Constables Probe

ప్రొద్దుటూరు క్రైం : పోలీసులు మరో కథ అల్లారు. నిన్నటి వరకు మేం అడిగింది రూ.5 వేలే.. రూ. 50 వేలు కాదని చెబుతూ వచ్చిన ఆ కానిస్టేబుళ్లు.. ఇప్పుడు పోలీసు అధికారుల వద్ద మరో కథను వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు మహిళల వద్ద తాము డబ్బే తీసుకోలేదని చెబుతూనే.. ‘నగదు అవసరముందని అడిగితే ఫోన్‌పేకు డబ్బు బదిలీ చేయించుకొని మహిళకు ఇచ్చానని’ సదరు వ్యక్తితో చెప్పించినట్లు చర్చ జరుగుతోంది. వ్యభిచారం కేసులో పట్టుబడిన మహిళల నుంచి డబ్బు తీసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు కానిస్టేబుళ్లపై పోలీసు ఉన్నతాధికారులు వేగవంతమైన విచారణ చేస్తున్నారు. 

 వారు మహిళలను బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేశారనే ఆరోపణలు జిల్లాలో తీవ్ర చర్చకు దారి తీశాయి. మహిళల నుంచి నేరుగా నగదు తీసుకోకుండా ఓ వ్యక్తి ఫోన్‌పే ఖాతాకు పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ చేయించిన వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ ఘటన పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో ముగ్గురు కానిస్టేబుళ్లపై వచ్చిన ఆరోపణలపై విచారణ కొనసాగుతోందని, ఆరోపణలు రుజువైతే కఠిన చర్యలు తప్పవని ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ సోమవారం సాయంత్రం మీడియాకు తెలిపారు. విచారణను అన్ని కోణాల్లో నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.  

రూ.50 వేలు బదిలీపై కొత్త కథ 
ఇదిలా ఉండగా ఫోన్‌పే ద్వారా బదిలీ అయిన రూ.50 వేల విషయంలో మరో కథ వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మహిళ నుంచి ఫోన్‌ పే ఖాతాకు డబ్బు బదిలీ చేయించుకున్న వ్యక్తిని సోమవారం విచారణ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అతను చెప్పే మాటలకు జరిగిన దానికి పొంతన కుదరలేదని తెలుస్తోంది. కానిస్టేబుళ్ల సూచన మేరకు డబ్బు అందుకున్న వ్యక్తి “ఒక మహిళకు అత్యవసరంగా నగదు  అవసరం ఉండటంతో తన ఫోన్‌పే ఖాతాకు రూ.50 వేలు పంపించిందని, దానికి బదులుగా నగదు ఇచ్చానని’ అతను విచారణ అధికారులకు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వివరణపై విచారణ అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. 

డబ్బు బదిలీ జరిగిన సమయంలో జరిగిన ఫోన్‌ కాల్స్, సంబంధిత వ్యక్తుల కాల్‌ డేటా, కానిస్టేబుళ్లతో ఉన్న సంబంధాలపై సాంకేతిక అధారాలు సేకరిస్తూ అధికారులు విచారణను వేగవంతం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మహిళల నుంచి డబ్బు అందుకున్న వ్యక్తికి, ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల నుంచి ఎలాంటి సంప్రదింపులు జరిగాయనే అంశాన్ని కూడా పోలీసు అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలు ఏమిటన్నది విచారణ పూర్తయిన తర్వాతే తేలనుంది. అయితే పోలీసు శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే ఆరోపణలు రావడంతో ఉన్నతాధికారులు అత్యంత సీరియస్‌గా విచారణ చేపట్టినట్లు సమాచారం. 

మహిళలను పిలిపించే ప్రయత్నం 
పోలీసులు వెళ్లినప్పుడు ఘటనా స్థలంలో ఉన్న మహిళల కోసం పోలీసు అధికారులు ఆరా తీస్తున్నారు. వారు డబ్బు పంపిన ఫోన్‌ పే నంబర్‌ ఆధారంగా మహిళల ఆచూకీ కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. వారి ఫోన్‌ నంబర్‌కు ప్రయతి్నస్తే స్విచ్ఛాఫ్‌ వచ్చినట్లు తెలిసింది. కాగా ఈ కేసులో కానిస్టేబుళ్లపై వేటు పడటం ఖాయమని పోలీసు శాఖలో జోరుగా చర్చ సాగుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement