కుప్పం: గంగమ్మ గర్భగుడి మార్పుపై ఆగ్రహం | Kuppam Temple Row: Anger Over Shifting of Sanctum Sanctorum | Sakshi
Sakshi News home page

కుప్పం: గంగమ్మ గర్భగుడి మార్పుపై ఆగ్రహం

Aug 4 2026 10:03 AM | Updated on Aug 4 2026 11:01 AM

Kuppam Temple Row: Anger Over Shifting of Sanctum Sanctorum

సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో గ్రామ దేవత తిరుపతి గంగమ్మ ఆలయ పునర్నిర్మాణం వివాదానికి దారితీసింది. గర్భగుడిని దక్షిణం వైపు రెండు అడుగులు జరిపేందుకు అధికారులు చేపట్టిన చర్యలను ఆలయ అర్చకులు, భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో స్థానికంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది.

పురాతన ఆలయాన్ని కొత్తగా నిర్మించే క్రమంలో భాగంగా అధికారులు పలు మార్పులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆలయాన్ని కొంతమేరకు దక్షిణం వైపు జరిపి నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ముఖ్యంగా గర్భగుడి స్థానాన్ని మార్చడంపై అర్చకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ సంప్రదాయాలు, ఆగమ నియమాలకు విరుద్ధంగా గర్భగుడిని పక్కకు జరపడం సరికాదని వారు చెబుతున్నారు. గర్భగుడి ఉన్న ప్రదేశానికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుందని.. దానిని మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

సమీక్ష సమావేశంలో వాగ్వాదం
ఆలయ పునర్నిర్మాణ పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ అంశం తీవ్ర చర్చకు దారితీసింది. అధికారులు, ఆలయ అర్చకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. గర్భగుడిని తరలించే ప్రతిపాదనపై అర్చకులు తమ అభ్యంతరాలను స్పష్టం చేశారు. అయితే ఆలయ అభివృద్ధి, నిర్మాణ అవసరాల దృష్ట్యా మార్పులు చేస్తున్నామని అధికారులు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఆందోళనకు సిద్ధమవుతున్న స్థానికులు
ఆలయ నిర్మాణ వ్యవహారంలో అధికారులు, టీడీపీ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గ్రామ దేవత ఆలయ విషయంలో సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కుప్పం ప్రాంతంలో గంగమ్మ ఆలయానికి భక్తుల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. గ్రామ ప్రజల విశ్వాసాలతో ముడిపడిన ఆలయ నిర్మాణంలో ఎలాంటి మార్పులు చేయాలన్నా అందరి అభిప్రాయాలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సీఎం నియోజకవర్గంలో రాజకీయ వేడి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఈ వివాదం తెరపైకి రావడం రాజకీయంగానూ చర్చకు దారితీస్తోంది. ఆలయ పునర్నిర్మాణం అభివృద్ధి కార్యక్రమంగా భావిస్తున్న అధికారులకు.. సంప్రదాయ పరిరక్షణ అంశం కొత్త సవాల్‌గా మారింది. ప్రస్తుతం గర్భగుడి తరలింపు అంశంపై అర్చకులు, అధికారులు, స్థానికుల మధ్య నెలకొన్న విభేదాలు ఎలా పరిష్కారమవుతాయన్నది ఆసక్తికరంగా మారింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement