breaking news
new routes
-
హర్ముజ్‌లో ఇక నో ఎంట్రీ!.. ఇరాన్ కొత్త రూట్
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ మార్గంలో నౌకల రాకపోకలు భారీగా తగ్గిపోయాయి. ఇప్పుడు మరింత కఠిన ఆంక్షలకు ఇరాన్ సిద్ధమవుతోంది. జలసంధి సమీపంలో కొత్తగా ‘నిషేధిత జోన్’ ఏర్పాటు చేయడంతోపాటు.. నౌకల కోసం ఒమన్‌తో కలిసి కొత్త షిప్పింగ్ రూట్‌ను ప్రకటించనున్నట్లు వెల్లడించింది.ఇరాన్ ప్రకటించబోయే కొత్త నిషేధిత ప్రాంతం హర్ముజ్ జలసంధికి వెలుపల గల గల్ఫ్ ప్రాంతాల్లో ఉంటుందని ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి మొహ్సెన్ రెజాయీ తెలిపారు. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళం ఏర్పాటు చేసిన దిగ్బంధ రేఖ నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. ఆ జోన్లోకి ప్రవేశించే నౌకలను ఇరాన్ ఆంక్షల జాబితాలో చేర్చనున్నట్లు హెచ్చరించారు.అయితే ఈ నిషేధిత ప్రాంతానికి సంబంధించిన ఖచ్చితమైన సరిహద్దులను ఇరాన్ ఇంకా వెల్లడించలేదు. రాబోయే రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.ఒమన్‌తో కలిసి కొత్త రూట్ఇదే సమయంలో హర్ముజ్ గుండా సాగే నౌకలకు ప్రత్యామ్నాయంగా కొత్త అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని ఇరాన్, ఒమన్ నిర్ణయించాయి. ఈ రూట్ ఇరాన్, ఒమన్ జలాల్లోనే ఉంటుంది. దీనికి సంబంధించిన మ్యాప్‌లు, ఏర్పాట్లపై ఇరు దేశాలు ఇప్పటికే అంగీకారానికి వచ్చినట్లు రెజాయీ వెల్లడించారు. త్వరలోనే దీనిపై అధికారికంగా సంతకాలు చేయనున్నారు.కొత్త మార్గాన్ని ఇరాన్ నిర్వహించనుంది. అయితే అమెరికా నుంచి తమపై కొనసాగుతున్న ‘దాడులు, బెదిరింపులు, విధ్వంసక చర్యలు’ ఆగే వరకు హర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉంటుందని హామీ ఇవ్వలేమని ఇరాన్ స్పష్టం చేసింది.రోజుకు పది నౌకలే!ప్రపంచ రవాణాకు కీలకమైన హర్ముజ్‌లో ఇరాన్-అమెరికా ఉద్రిక్తతల ప్రభావం ఇప్పటికే స్పష్టంగా కనిపిస్తోంది. గత పది రోజుల్లో ఈ జలసంధి గుండా రోజుకు సగటున కేవలం 10 సరుకు నౌకలు మాత్రమే ప్రయాణిస్తున్నాయి. మే తర్వాత ఇదే అత్యల్ప స్థాయి.శనివారం కేవలం రెండు నౌకలు, ఆదివారం ఆరు నౌకలు మాత్రమే ఈ మార్గంలో ప్రయాణించాయి. వాటిలో ఎక్కువ శాతం ఇరాన్ సూచించిన మార్గాన్నే ఉపయోగించినట్లు సమాచారం. సముద్ర రవాణా డేటా సంస్థ కేప్లర్ ప్రకారం.. బుధవారం తర్వాత హర్ముజ్ నుంచి ఒక్క భారీ ముడిచమురు రవాణా నౌక (వీఎల్సీసీ) కూడా బయటకు రాలేదు.చమురు మార్కెట్‌పై ప్రభావంహర్ముజ్ ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన మార్గం. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు ఈ జలసంధి గుండా రవాణా అయ్యేది. ఎల్ఎన్జీ సరఫరాకు కూడా ఇది ప్రధాన మార్గమే. నౌకల రాకపోకలు తగ్గడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో బ్రెంట్ క్రూడ్ ధర 0.8 శాతం పెరిగి బ్యారెల్‌కు 97 డాలర్లకు పైగా చేరింది.మూడు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడిమరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం అమెరికా దళాలు మూడు ఇరాన్ చమురు ట్యాంకర్లపై దాడులు చేశాయి. వీటిలో ఒకటి ఖార్గ్ ద్వీపం సమీపంలో ఉన్నట్లు సమాచారం. అంతకుముందు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అమెరికా యుద్ధ నౌకలపై దాడులు చేసినట్లు అమెరికా పేర్కొంది.అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకారం.. దిగ్బంధ నిబంధనలను అమలు చేసే క్రమంలో ఇప్పటికే 92 వాణిజ్య నౌకలను దారి మళ్లించారు. మూడు నౌకలను నిర్వీర్యం చేసి, మరో రెండు నౌకలను తనిఖీ కోసం అదుపులోకి తీసుకున్నారు.ఖార్గ్‌పై 550 దాడులా?ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఖార్గ్ ద్వీపం కూడా ఈ ఘర్షణల్లో ప్రధాన లక్ష్యంగా మారింది. గత కొన్ని నెలల్లో ఖార్గ్‌పై సుమారు 550 సార్లు దాడులు జరిగినప్పటికీ.. అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఇరాన్ ఇంధన శాఖ మంత్రి మొహ్సెన్ పక్ణేజాద్ తెలిపారు. యుద్ధానికి ముందు ఇరాన్ ఎగుమతి చేసే ముడిచమురులో దాదాపు 90 శాతం ఖార్గ్ ద్వీపం నుంచే వెళ్లేది. అయితే ఏప్రిల్ మధ్య నుంచి అమెరికా దిగ్బంధం కారణంగా ఈ సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.‘రోజుకు 90 లక్షల బ్యారెళ్లు వెళ్తున్నాయి’హర్ముజ్ పూర్తిగా మూసుకుపోయిందన్న వార్తలను అమెరికా ఖండిస్తోంది. రోజుకు సుమారు 90 లక్షల బ్యారెళ్ల చమురు ఇప్పటికీ ఈ జలసంధి గుండా వెళ్తోందని అమెరికా ఇంధనశాఖ మంత్రి క్రిస్ రైట్ తెలిపారు. పైప్లైన్ల ద్వారా ప్రత్యామ్నాయంగా తరలిస్తున్న చమురును కలుపుకుంటే యుద్ధానికి ముందు రవాణాలో మూడింట రెండొంతులు లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో సరఫరా కొనసాగుతోందని చెప్పారు. ఇరాన్ మాత్రం రోజుకు 10–15 లక్షల బ్యారెళ్ల చమురు విక్రయిస్తున్నామని చెబుతోంది. తమ ఉత్పత్తి, వాణిజ్యం సాధ్యమైనంత వరకు కొనసాగుతున్నాయని ఆ దేశం పేర్కొంటోంది.‘దాడి చేస్తే మరింత తీవ్రంగా స్పందిస్తాం’ఇదిలా ఉండగా.. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘెర్ ఖలీబాఫ్ అమెరికాను తీవ్రంగా హెచ్చరించారు. తమ దేశ ప్రయోజనాలు, భద్రతపై దాడులు జరిగితే ఇకపై స్పందన మరింత వేగంగా, భారీగా, బాధాకరంగా ఉంటుందని అన్నారు. ఇప్పటికే అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరిగింది. కరెన్సీ విలువలో హెచ్చుతగ్గులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి సమస్యలు తీవ్రంగా మారుతున్నాయి. అయినప్పటికీ ఆర్థిక సంస్కరణలు చేపట్టాల్సిన బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదెహ్ స్పష్టం చేశారు.చర్చలకు బ్రేక్.. మళ్లీ దాడులుఇరాన్-అమెరికా మధ్య దౌత్యపరమైన చర్చలు నిలిచిపోవడం, జూన్‌లో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. ఆ తర్వాత మళ్లీ పరస్పర దాడులు ప్రారంభం కావడంతో పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారింది. ఈ నేపథ్యంలో హర్ముజ్‌లో కొత్త నిషేధిత జోన్, ఇరాన్-ఒమన్ కొత్త షిప్పింగ్ రూట్ ప్రకటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హర్ముజ్ గుండా నౌకల రాకపోకలపై ఇరాన్ తీసుకునే తదుపరి నిర్ణయాలు.. చమురు ధరల నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.ఇదీ చదవండి: చైనా కాస్ట్లీ కలను చిదిమేసిన నేపాల్ వరద -
కొత్త మార్గాల్లో స్టార్ ఎయిర్ సర్వీసులు - ధరలు ఇలా!
బెంగళూరు: హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ రూట్లో సెప్టెంబర్ 30 నుంచి విమాన సేవలు ప్రారంభిస్తున్నట్లు సంజయ్ ఘొడావత్ గ్రూప్‌లో భాగమైన స్టార్ ఎయిర్ తెలిపింది. ప్రాంతీయ కనెక్టివిటీకి సంబంధించిన ఆర్సీఎస్–ఉడాన్ స్కీములో భాగంగా తమకు లభించిన 40 రూట్లలో ఇవి కూడా ఉన్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం హైదరాబాద్–నాగ్‌పూర్–అజ్మీర్ (కిషన్‌గఢ్) ఎకానమీ టికెట్టు ధర రూ. 5,499గా, బిజినెస్ క్లాస్ టికెట్టు రేటు రూ. 10,999గా ఉంటుంది. హైదరాబాద్–నాగ్‌పూర్ రూట్లో టికెట్ల రేట్లు వరుసగా రూ. 3,499 .. రూ. 8,999గా ఉంటాయి. -
కొత్త రూట్లలో సిటీ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పలు కొత్త రూట్లలో సిటీ బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ పురుషోత్తం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డిసెంబర్ 1 నుంచి సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. కోఠి–ఈసీఐఎల్ (40/16ఎన్) రూట్లో సెమీ లోఫ్లోర్ బస్సు అందుబాటులోకి రానుంది. ఇది ఏఎస్‌రావునగర్, సైనిక్‌పురి, నేరేడ్మెట్, సఫిల్‌గూడ, మల్కాజిగిరి, ఆలుగడ్డబావి, సికింద్రాబాద్, కవాడీగూడ, హిమాయత్‌నగర్ మార్గంలో కోఠి వరకు రాకపోకలు సాగిస్తుంది. బండ్లగూడ– జగద్గిరిగుట్ట (90బీ/30) మార్గంలో 3 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు బండ్లగూడ నుంచి ఉప్పల్ క్రాస్‌రోడ్స్ తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, ఐడీపీఎల్ మీదుగా జగద్గిరిగుట్టకు రాకపోకలు సాగించనుంది. ప్రణీత్ హౌసింగ్ కాలనీ నుంచి సికింద్రాబాద్ (10కె/పీ) రూట్లో 3 సెమీ లోఫ్లోర్ బస్సులు బాచుపల్లి, నిజాంపేట్, జేఎన్టీయూ, కేపీహెచ్‌బీ, ఎర్రగడ్డ, ఎస్ఆర్నగర్, బేగంపేట్ రూట్లో నడుస్తాయి. హయత్‌నగర్–గండిమైసమ్మ (290/272జీ) రూట్లో 2 మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, బాలానగర్, జీడిమెట్ల మీదుగా తిరుగనున్నాయి. జగద్గిరిగుట్ట– మెహదీపట్నం మార్గంలో (19కెజె) ఆర్డినరీ బస్సు ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, రోడ్‌నెంబర్ 1 బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్ మార్గంలో నడుస్తుంది. హయత్‌నగర్–సికింద్రాబాద్ (290), కోఠి–సికింద్రాబాద్(40), దిల్సుఖ్నగర్–సికింద్రాబాద్(107వీఆర్), ఇబ్రహీంపట్నం–దిల్సుఖన్ నగర్(277డి) రూట్లలో అదనపు బస్సులు నడుపనున్నట్లు వెల్లడించారు. బస్సు సర్వీసుల పొడిగింపు.... మరి కొన్ని బస్సుల రూట్లను పొడిగించనున్నారు. కోఠి–కొండాపూర్ మధ్య నడిచే (127కె),కోఠి–నందినగర్ (127ఎన్) బస్సులను ఎల్బీనగర్ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–ఎల్బీనగర్ మధ్య నడిచే (40 ఎల్) బస్సును ఎన్జీవోస్ కాలనీ వరకు, వీఎస్టీ–బీర్‌బాగ్ (137) బస్సును జియాగూడ వరకు పొడిగిస్తారు. సికింద్రాబాద్–జియాగూడ (86జె) బస్సును టోలీమసీద్ వరకు నడుపుతారు. చార్మినార్– కాటేదాన్ మధ్య నడిచే (178కె) మినీ బస్సులను శ్రీరామ్ కాలనీ వరకు నడుపుతారు. కేశవగిరి–సికింద్రాబాద్ (102/38) బస్సులను ఈస్ట్‌మారేడ్‌పల్లి వరకు, హయత్‌నగర్–మెహదీపట్నం (156/126) బస్సులను జేఎన్ టీయూ వరకు పోడిగించనున్నారు. ఉప్పల్–మెహదీపట్నం (113 ఐఎం/126) మధ్య నడిచే బస్సులను జేఎన్టీయూ వరకు నడుపుతారు. కోఠి–ఇందిరానగర్ (74) మధ్య నడిచే బస్సులను మెహిదీపట్నం వరకు పొడిగించనున్నారు.


