‘ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి– మహబూబ్‌నగర్’ బీజేపీకే అనుకూలమంటూ నివేదిక
దీంతో రాష్ట్ర అధ్యక్షుడి వైపే జాతీయ నాయకత్వం మొగ్గు
ఇప్పటికైతే రేసులో లేను...నాయకత్వం ఆదేశిస్తే శిరసా వహిస్తానంటున్న రాంచందర్‌రావు
సాక్షి, హైదరాబాద్: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు పోటీ చేయనున్నారా? ఈ ప్రశ్నకు పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో ఉమ్మడి హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్, ఉమ్మడి వరంగల్–నల్లగొండ–ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు స్థానాలకు బీజేపీ జాతీయ ,రాష్ట్ర నాయకత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. సెపె్టంబర్ నెలలోనే కేంద్రం ఎన్నికల సంఘం నుంచి ఓటరు నమోదుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశాలున్నాయి. దీంతో ప్రధాన పార్టీల్లో ఆశావహులు, నేతలు ఈ రెండు సీట్లలో పోటీ కోసం అప్పుడే ప్రయత్నాలు మొదలు పెట్టారు.
కొత్త పట్టభద్ర ఓటర్లను చేర్చుకునే ప్రయత్నాలు మొదలు, మిగతా వారి వివరాలు, సమాచారం సేకరణ ఇలా ముందస్తు ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ స్థానం నుంచి పార్టీ టికెట్ కోసం పోటీలో ఇప్పటికే 26 మంది గట్టి ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ఈసారి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి బీజేపీ గెలిచేందుకు అన్ని అవకాశాలున్నాయని జాతీయ నాయకత్వానికి సైతం నివేదిక చేరిందట. అదీగాకుండా గతంలోనూ హైదరాబాద్ పట్టభద్రుల స్థానం నుంచి రాంచందర్‌రావు గెలిచిన సంగతి తెలిసిందే.
గత ఎన్నికల్లోనూ స్వల్ప ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి వాణీదేవి చేతుల్లో ఓడిపోయారు. ప్రస్తుతం మారిన రాజకీయ వాతావరణం, గత పార్లమెంట్ ఎన్నికల్లో 8 ఎంపీలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 సీట్లు, కరీంనగర్ కార్పొరేషన్ కైవసం, గతంతో పోలి్చతే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు ఇలా అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటు వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గెలుపొందడం పక్కా అనే అభిప్రాయం పార్టీనేతల్లో వ్యక్తమవుతోంది.
దీంతో రాంచందర్‌రావునే బరిలో నిలిపితే సరిపోతుందనే అభిప్రాయానికి బీజేపీ అగ్రనేతలు వచ్చినట్టుగా తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులుగా చట్టసభల్లో ప్రతినిధులు (ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు)కూడా ఉండడంతో ఇక్కడ కూడా రాంచందర్‌రావునే అభ్యర్ధిగా ఆ పార్టీ అధిష్టానం ఎంపిక చేయవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇప్పటికైతే తాను రేసులో లేనని, పోటీ చేయాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే మాత్రం దానిని శిరసా వహించక తప్పని పరిస్థితి ఉంటుందని రాంచందర్‌రావు ‘సాక్షి’కి వెల్లడించారు.


