మంత్రి పదవికి లైన్‌క్లియర్‌! | - | Sakshi
Sakshi News home page

మంత్రి పదవికి లైన్‌క్లియర్‌!

Sep 5 2026 6:37 AM | Updated on Sep 5 2026 6:37 AM

రెండు, మూడు రోజుల్లోనే?

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి చర్చ జోరందుకుంది. కొండా సురేఖను కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ చేసిన నేపథ్యంలో ఖాళీ ఏర్పడటంతో కొత్తవారికి మంత్రి పదవుల అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది. మరోవైపు దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్‌ కూడా లంబాడా కోటాలో తనకు మంత్రి ఇవ్వాలని ఎప్పటినుంచో అడుగుతున్నారు. కేబినెట్‌ విస్తరణ జరిగితే ఒక ఎస్సీ, ఒక బీసీ, ఒక రెడ్డి సామాజికవర్గానికి మంత్రి పదవులు దక్కే అవకాశాలున్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో రెడ్డి సామాజికవర్గం నుంచి రాజగోపాల్‌రెడ్డికి అవకాశం దక్కవచ్చని ఆయన అనుచరులు, కాంగ్రెస్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌కు కూడా మంత్రి పదవులు ఇస్తారన్న చర్చ నేపథ్యంలో వారిద్దరికి ఇస్తే రెడ్డి సామాజికి వర్గం నుంచి రాజగోపాల్‌రెడ్డికి తప్పకుండా మంత్రి పదవి వస్తుందని భావిస్తున్నారు. బాలునాయక్‌ కూడా తనకు మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానానికి పలుమార్లు విజ్ఞప్తులు చేశారు. ఇప్పుడు కేబినెట్‌ విస్తరణ చర్చ జరుగుతుండటంతో ఆయన కూడా తనకు మంత్రి అవకాశం కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరినట్లు తెలిసింది.

సాఫ్ట్‌ మూడ్‌లోకి...

తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలిలోనూ మార్పు కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. గతంలో ప్రభుత్వ విధానాలపై, పార్టీ వ్యవహారాలపై ఆయన చేసిన వ్యాఖ్యలతో పోలిస్తే ప్రస్తుతం కొంత సాఫ్ట్‌ మూడ్‌లో ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. దీంతో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ఇచ్చిన హామీని ఈసారి నిలబెట్టుకోవాలని రాజగోపాల్‌రెడ్డి అధిష్టానం పెద్దలను కోరినట్లు తెలిసింది. వారి నుంచి కూడా కొంత సానుకూలత వ్యక్తం అయినట్లు చర్చ జరుగుతోంది.

కేబినెట్‌ విస్తరణపై అధికారిక షెడ్యూల్‌ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, రెండు, మూడు రోజుల్లో లేదా అసెంబ్లీ సమావేశాల తరువాత జరగవచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎవరెవరికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై అధిష్టానం స్థాయిలో కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు రాజగోపాల్‌రెడ్డికి అటు బాలు నాయక్‌లలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది? అసలు మూడో మంత్రి పదవిని జిల్లాకు ఇస్తారా? లేదా? అన్నది ఉమ్మడి నల్లగొండ జిల్లా రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ఫ రాజగోపాల్‌రెడ్డికి బెర్త్‌ దక్కుతుందని రాజకీయవర్గాల్లో చర్చ

ఫ కొండా సురేఖ బర్తరఫ్‌ నేపథ్యంలో కేబినెట్‌ విస్తరణకు అవకాశాలు

ఫ తాజా పరిణామాలతో సాఫ్ట్‌ మూడ్‌లోకి వచ్చేసిన రాజగోపాల్‌రెడ్డి

ఫ లంబాడా కోటాలో మంత్రి పదవి అడుగుతున్న బాలునాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement