నల్లగొండ : ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులను ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని సత్కరించి అవార్డులు అందించే కార్యక్రమం వాయిదా పడింది. ఏటా సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులు అందించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ నెల 5న సీఎం రేవంత్‌రెడ్డి నకిరేకల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా విద్యాశాఖ అవార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. అవార్డులకు ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. గురువుల సన్మాన కార్యక్రమానికి త్వరలో మరో తేదీని ప్రకటిస్తామని డీఈవో సుశీందర్‌రావు తెలిపారు.
సీఎం పర్యటనను
విజయవంతం చేయాలి
నకిరేకల్ : అధికారులు సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. సీఎం నకిరేకల్‌లో పర్యటించనున్న నేపథ్యంలో వైద్యశాలను మినీ స్టేడియంలో సభా ప్రాంగాణాన్ని, హెలిపాడ్ ప్రాంతాలను వారు పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలన్నారు. వారి వెంట డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్‌రెడ్డి, ఆర్డీఓ అశోక్‌రెడ్డి, డీఎస్పీలు శివరాంరెడ్డి, శ్రీనివాస్‌రావు, డీసీహెచ్‌ఎస్ మాతృనాయక్ తదితరులు ఉన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..
● ఎమ్మెల్సీ శంకర్‌నాయక్
మిర్యాలగూడ : ప్రజల కోసమే ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని.. చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు కేటీఆర్ సిద్ధమా అని ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ అన్నారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సాగర్ ఎడమకాల్వ ద్వారా 6వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన సమయంలో రైతు ధర్నా చేపట్టి అబద్దాలు ప్రచారం చేయడం తగదన్నారు. అబద్దాలు మాట్లాడడంలో కేటీఆర్ దిట్ట అని, కేటీఆర్ మాటలను నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. ఎల్‌నినో వల్ల వర్షాలు పడవని, పంటలను కాపాడేందుకే నీరు విడుదల చేశామన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పారదర్శకంగా చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో డబుల్‌బెడ్‌రూమ్ ఇండ్లు, పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదన్నారు. సమావేశంలో ముదిరెడ్డి నర్సిరెడ్డి, మనోజ్, ఇమ్రాన్, ఆవుల బక్కారెడ్డి, కిరణ్, వెంకన్న, లక్ష్మణ్‌గౌడ్, బాలునాయక్, జనార్దన్, దాస్ తదితరులు పాల్గొన్నారు.


